– లేనిపక్షంలో ఉద్యోగుల పక్షాన ఉద్యమిస్తాం
– త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం
– ఉద్యోగ సంఘాలు ఎందుకు స్పందించడం లేదు?
– ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ వన్నీ పిచ్చి మాటలే
– రైతులను మోసం చేస్తున్న కేసీఆర్
– మెడమీద కత్తిపెడితే 317 జీవోను రద్దు చేస్తారా?
– వానా కాలం పంటనంతా కేంద్రం కొనేందుకు సిద్దం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
ఉద్యోగుల రీ అలాట్ మెంట్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. సీఎం తీరువల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు అల్లాడిపోతుంటే… ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. తక్షణమే 317 జీవోపై పున:సమీక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమిస్తుందని ప్రకటించారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రశిక్షణా సమావేశంలో పాల్గొనేందుకు సిర్పూర్ కాగజ్ నగర్ కు వచ్చిన బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల రీ అలాట్ మెంట్, ధాన్యం కొనుగోలు వంటి అంశాలపై మాట్లాడారు. బండి సంజయ్ మాటల్లోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి…
317 జీవో పేరుతో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరువల్ల ఉద్యోగుల, ఉపాధ్యాయుల కుటుంబాలన్ని ఛిన్నాభిన్నం అయ్యే పరిస్థితి. ఉద్యోగులంతా స్థానికేతరులుగా మారి చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యే దుస్థితి ఏర్పడింది. ఉద్యోగుల కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఉద్యోగుల్లో ఎవరిని కదిలించినా అరిగోస పడుతున్నారు. కానీ ఈ సీఎం కనీసం వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. పైగా సీనియర్, జూనియర్ పేరుతో కొట్లాటలు పెడుతున్నడు. ‘‘ఉరిశిక్ష వేసే ముందైనా చివరి కోరిక ఏమిటని అడుగుతారు. కానీ ఉద్యోగులకు మాత్రం కనీసం అవకాశం ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా ఆదరాబాదరాగా రీఅలాట్ మెంట్ చేస్తూ వాళ్ల కుటుంబాల్లో చిచ్చు పెట్టారు.
ఉద్యోగులు ఇన్ని ఇబ్బందులున్నా ఉద్యోగ సంఘాలు ఏం చేసున్నాయి? ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన ఉద్యోగ సంఘాలు ఎవరికి కొమ్ము కాస్తున్నయ్? సీఎం పిలిస్తే చికెన్, మటన్, కాళ్లు, తలకాయ, బోటీ తిని వచ్చారా? ఉద్యోగుల సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదు? నేడు ఉద్యోగులు, ఉపాధ్యాయుల పడుతన్న ఇబ్బందులకు ఉద్యోగ సంఘాలే బాధ్యత వహించాలి. వాళ్ల చేతగానితనంవల్లే ఉద్యోగులకు ఈ కష్టాలు వచ్చాయి.
‘‘ఇప్పటికైనా సీఎం సోయిలోకి రావాలి. 317 జీవోపై పున: సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నం. ఉద్యోగ, ఉపాధ్యాయులు రీ అలాట్ మెంట్ విషయంలో ఎదురవుతున్న సమస్యలేమిటో తెలుసుకోవాలి. వాళ్ల బాధలు విన్న తరువాతే రీ అలాట్ మెంట్ ప్రక్రియ చేపట్టాలి. లేనిపక్షంలో బీజేపీ పక్షాన ఉద్యమం తీవ్రతరం చేయబోతున్నం. త్వరలోనే దీనిపై కార్యాచరణ ప్రకటించబోతున్నం’’అని ప్రకటించారు.
ఈ సీఎం మానవత్వం లేని మ్రుగం. కనీస స్పందన ఉండదు. రోజుకో కొత్త సమస్యను తెరపైకి తీసుకొస్తున్నడు. లాకర్లలో పైసలు పెట్టుకున్నట్లుగా సమస్యలను పెట్టుకుని తనకు అవసరమైనప్పుడల్లా బయటకు తీస్తూ ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తున్నడు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్.
ప్రజా సమస్యలు, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై పోరాటాలు చేస్తుంటే ‘ఒమిక్రాన్’ పేరుతో సభలు, ర్యాలీలు నిషేధించిన ఈ సీఎం తెల్లవార్డు బార్లు, పబ్ లకు అనుమతిచ్చేటప్పుడు ఒమిక్రాన్ గుర్తుకు రాదు. కొత్త ఏడాది కానుకగా ‘తాగు-ఊగు’ పేరుతో బంపర్ ఆఫర్ ఇచ్చి కలెక్షన్లమీద పడ్డడు. ఆయన వ్యవహారమంతా రాత్రి బార్-దర్బార్ నిర్ణయాలే.
కేంద్ర ప్రభుత్వం వానా కాలం పంటకు సంబంధించి ప్రతి గింజా కొనేందుకు సిద్దమని పదేపదే చెబుతోంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్ లో రాసిన లేఖకు స్పందిస్తూ 6 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు లేఖ పంపింది. కానీ టీఆర్ఎస్ కేంద్రం మెడలు వంచినట్లుగా చెప్పుకోవడం సిగ్గు చేటు. ఢిల్లీలో పార్లమెంట్ సెంట్రల్ హాల్ క్యాంటీన్ లో ఫోటోలు దిగి…. పార్లమెంట్ లో ధర్నా చేసినట్లు మీడియాకు ఫోజులిచ్చిన ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు.
మెడమీద కత్తిపెడితే బాయిల్డ్ రైస్ ఇయ్యబోనని కేంద్రానికి లేఖ రాసిచ్చినట్లు చెప్పిన సీఎం….అదే కేంద్రం మెడలు వంచి అదనపు ధాన్యం కొనుగోలు చేయించినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. మెడమీద కత్తిపెట్టి 317 జీవో రద్దు చేయమంటే రాసిస్తవా? సిగ్గుండాలి. నేను బయటపెట్టేదాకా కేంద్రానికి రాసిచ్చిన అగ్రిమెంట్ ఇచ్చిననే సంగతి చెప్పని సీఎం మెడమీద కత్తిపెడితే రాసిచ్చానని చెప్పడం సిగ్గుచేటు. సీఎం మెడలు వంచే సమయం దగ్గర్లోనే ఉంది. సీఎం కేసీఆర్ బాయిల్డ్ రైస్ తినడట… కానీ కేంద్రం బాయిల్డ్ రైస్ కొనాలట. కొని ఏం చేయాలి? సీఎం నోట్లో కుక్కమంటావా?
మళ్లీ మళ్లీ చెబుతున్నాం. వానా కాలం పంటకు సంబంధించి రా రైస్ ఎంతైనా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అయినా కేంద్రం మెడలు వంచినట్లు పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు.
పంటల మార్పిడి కోసం తెలంగాణలో భూసార పరీక్షలు నిర్వహించాలని మూడేళ్ల కిందటే కేంద్రం నిధులిస్తే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. కానీ రైతులు వరి వేయొద్దంటూ అయోమయానికి గురి చేస్తోంది. పోనీ ఏ పంట వేయాలో చెప్పకుండా.. దానికి తగ్గట్లుగా విత్తనాలివ్వకుండా
యాసంగి పంట ఎంత వస్తుందో చెప్పే దమ్ముందా ఈ సీఎంకు? ఈ వానా కాలంలో ఎంత ధాన్యం పండించారో ఆయన దగ్గర లెక్కలున్నాయా? ప్రతి గింజా కొంటామని చెప్పి మోసం చేసింది కేసీఆరే. రైతులు వాస్తవాలు గ్రహించాలని కోరుతున్నా.