Suryaa.co.in

Telangana

మంత్రి తలసానిచే గోడ పత్రిక ఆవిష్కరణ

వేసవిలో పశువుల సంరక్షణపై గోడ పత్రికను పశుసంవర్ధక, డైయిరి, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయన్న వాతావరణ శాఖ వారి హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని పశుపోషకులు, గొర్రెల మేకల పెంపకందారులు తమ పశువులు, జీవాలను తీవ్రమైన ఎండ నుండి, వడదెబ్బ తగలకుండా కాపాడుకోవాలని సూచించారు.

పశువులను, జీవాలను ఎండ తీవ్రత తక్కువగా ఉండే ఉదయం మరియు సాయంత్ర వేళల్లో మాత్రమే మేత కొరకై బయటకు తీసుకెళ్లాలని, మధ్యాహ్నం సమయంలో వాటిని కొట్టాల్లో మాత్రమే ఉంచి పచ్చిమేత మరియు తగినంత శుభ్రమైన త్రాగునీరు అందుబాటులో ఉంచాలి అని సూచించారు. దీనితో పాటు కొట్టాలకు గోనెసంచులు కట్టి, వాటిని తరచు నీటితో తడపడం ద్వారా వేడి మరియు వడదెబ్బ నుండి పశువులను, జీవాలను కాపాడుకోవచ్చని తెలిపారు.

ఇదే కార్యక్రమంలో గొఱ్ఱెల అభివృద్ధి పథకంకు చెందిన గొర్రెల యూనిట్ల వలన పొందే లాభాలను తెలియజేయు కరపత్రాలను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక,డైయిరి,మత్స్యశాఖా శాఖా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదర్ సిన్హా ఐఏఎస్, పశుసంవర్ధక శాఖా సంచాలకులు డా రాంచందర్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE