Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో క్రీడారంగానికి మంచిరోజులొచ్చాయి

– క్రీడాకారులు, కోచ్‌లు, స్పోర్ట్స్ అకాడ‌మీల‌కు శుభ‌దినాలు
– అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై రాణించేందుకు శాప్ ద్వారా క్రీడాకారుల‌కు ప్రోత్సాహం
– పేద క్రీడాకారుల‌కు స‌హాయం అందించేందుకు ప్ర‌త్యేక కార్ప‌స్ ఫండ్ ఏర్పాటు దిశ‌గా కృషి
– గౌర‌వ ముఖ్య‌మంత్రి గ‌తంలో చేసిన కృషి వ‌ల్లే అంత‌ర్జాతీయంగా తెలుగుతేజాలు రాణిస్తున్నారు
– రాష్ట్ర ర‌వాణా, యువ‌జ‌న‌, క్రీడాశాఖ మంత్రివ‌ర్యులు మండిప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డి

గౌర‌వ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు క్రీడ‌ల‌కు అత్యంత ప్రాధాన్య‌మిస్తున్నార‌ని.. ఇప్పుడు రాష్ట్రంలో క్రీడారంగానికి మంచిరోజులొచ్చాయ‌ని రాష్ట్ర ర‌వాణా, యువ‌జ‌న‌, క్రీడాశాఖ మంత్రివ‌ర్యులు మండిప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డి అన్నారు.
సుప్ర‌సిద్ధ భార‌తీయ హాకీ క్రీడాకారుడు మేజ‌ర్ ధ్యాన్‌చంద్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ఏటా జ‌రుపుకునే జాతీయ క్రీడాదినోత్స‌వ వేడుక‌లు గురువారం విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియంలో జ‌రిగాయి. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డి హాజ‌రుకాగా.. ప్ర‌ముఖ క్రీడాకారులు పాల్గొన్నారు.

వేడుక‌ల్లో భాగంగా తొలుత మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి.. క్రీడారంగ ప్ర‌ముఖుల‌తో క‌లిసి మేజ‌ర్ ధ్యాన్‌చంద్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా క్రీడా కాన్వాస్‌పై సంత‌కాలు చేశారు. వివిధ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల విద్యార్థులు, క్రీడాకారులు, క్రీడల ఔత్సాహికుల‌తో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. చురుకైన, ఆరోగ్యకర జీవనశైలిని పెంపొందించడానికి నా ఫిట్‌నెస్‌, ఆరోగ్యం కోసం రోజూ 30 నిమిషాలు కేటాయిస్తాను.. నా కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారిని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహిస్తాను.. అంటూ ప్ర‌తిజ్ఞ చేయించారు.

క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌త్యేక చొర‌వ‌:

ఈ సంద‌ర్భంగా మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ క్రీడాదినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తిఒక్క‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాన‌ని.. హాకీ క్రీడ‌ద్వారా దేశానికి కీర్తిప్ర‌తిష్ట‌లు తెచ్చిపెట్టిన మేజ‌ర్ ధ్యాన్‌చంద్ జ‌న్మ‌దినాన్ని జాతీయ క్రీడాదినోత్స‌వంగా జ‌రుపుకోవ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ఆయ‌న్ను స్ఫూర్తిగా తీసుకొని యువ‌త ఏదో ఒక ఇష్టమైన క్రీడ‌ను ఎంచుకొని.. అందులో రాణించేందుకు శాయ‌శ‌క్తులా కృషిచేసి రాష్ట్రానికి, దేశానికి కీర్తిప్ర‌తిష్ట‌లు తెచ్చిపెట్టాల‌ని పిలుపునిచ్చారు. చ‌దువుతో పాటు శారీర‌కంగా దృఢంగా ఉండేందుకు ఫిట్‌నెస్‌పైనా దృష్టిసారించాల‌ని.. రోజులో క‌నీసం 30 నిమిషాలు ఇందుకు కేటాయించాల‌ని సూచించారు.

2014-19 మ‌ధ్య‌కాలంలో రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి ఎన్నో కార్య‌క్ర‌మాలు అమ‌లుచేయ‌డం జ‌రిగింద‌ని.. ఇప్పుడు మ‌ళ్లీ రాష్ట్ర క్రీడారంగానికి, క్రీడాకారుల‌కు, కోచ్‌ల‌కు, స్పోర్ట్స్ అకాడ‌మీల‌కు మంచిరోజులు వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి చొర‌వ‌వ‌ల్లే రాష్ట్రానికి చెందిన ఎంద‌రో క్రీడాకారులు జాతీయ‌, అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై త‌మ స‌త్తాచాటి, పేరుతెచ్చార‌న్నారు.

క్రీడల‌ప‌ట్ల ఆస‌క్తిచూపే వారికి శాప్ నుంచి పూర్తి స‌హాయ‌స‌హ‌కారాలు ఉంటాయ‌ని.. ఔత్సాహికులు రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని సూచించారు. ఖేల్ ఇండియా, ఇత‌ర కార్య‌క్ర‌మాల ద్వారా కేంద్రం నుంచి కూడా స‌హాయ‌స‌హ‌కారాలు అందుకొని మైదానాల అభివృద్ధికి, క్రీడాసామ‌గ్రిని స‌మ‌కూర్చుకోవ‌డం, అత్యుత్తమ శిక్షణ త‌దిత‌రాలకు కృషిచేయ‌నున్న‌ట్లు తెలిపారు.

త్వ‌ర‌లో క్రీడారంగంపై గౌర‌వ ముఖ్య‌మంత్రి స‌మీక్ష చేయ‌నున్నార‌ని.. పేద క్రీడాకారుల‌కు ఆర్థికంగా స‌హాయ‌స‌హ‌కారాలు అందించేందుకు రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వ‌ర‌కు కార్ప‌స్‌ఫండ్ ఏర్పాటుచేసే అంశాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌న‌ద‌గ్గ‌ర యువ‌శ‌క్తికి కొద‌వ‌లేద‌ని.. వారిని ప్రోత్స‌హించి, స‌రైన శిక్ష‌ణ అందించి అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై రాణించి, ప‌త‌కాలు సాధించే దిశ‌గా కృషిచేయ‌నున్న‌ట్లు మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి తెలిపారు.

శాప్ ద్వారా పేద క్రీడాకారులను గుర్తించి వారికి సరైన శిక్షణ, కిట్లను అందించేందుకు తన నెల జీతం రూ. 3,16,000ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి విరాళంగా ప్రకటించారు.

ఒడుదొడుకుల‌ను ఎదుర్కొని నిలిచి గెల‌వాలి: పీవీ సింధు

తెలుగుతేజం, బ్యాడ్మింట‌న్ అంత‌ర్జాతీయ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడుతూ అంద‌రికీ జాతీయ క్రీడాదినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నానని.. ప్ర‌తి ఒక్క‌రూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని.. మేజ‌ర్ ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో ఏదో ఒక క్రీడ‌ను ఎంపికచేసుకొని క‌ష్ట‌ప‌డి సాధ‌న చేసి ఉన్న‌తంగా ఎద‌గాల‌ని పిలుపునిచ్చారు. క‌ష్ట‌ప‌డితే దేన్న‌యినా సాధించ‌గ‌ల‌మ‌ని.. ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డంలో ఒడుదొడుకులు ఎదుర‌వుతాయ‌ని.. వాటిని అధిగ‌మిస్తూ విజ‌యం దిశ‌గా ముందుకు సాగాల‌ని, త‌న కెరీర్‌లోనూ ఆటుపోట్లు ఎదుర‌య్యాయ‌ని పేర్కొన్నారు. ఏదో ఒక‌సారి ఓట‌మి ఎదురైంద‌ని.. అంత‌టితో ఆగిపోకుండా నిబ‌ద్ధ‌త‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో క‌ష్ట‌ప‌డి ముందుకెళితే త‌ప్ప‌క విజ‌యం సొంత‌మ‌వుతుంద‌న్నారు. వ్యాయామం ప్రాధాన్యాన్ని గుర్తించి, ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ కొంత స‌మ‌యాన్ని అందుకు కేటాయించాల‌న్నారు.

క్రీడ‌ల‌ను జీవ‌న‌శైలిలో భాగం చేసుకోవాలి: శాప్ వీసీ, మేనేజింగ్ డైరెక్ట‌ర్ పీఎస్ గిరీష

శాప్ వీసీ, మేనేజింగ్ డైరెక్ట‌ర్ పీఎస్ గిరీష మాట్లాడుతూ ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా మేజ‌ర్ ధ్యాన్‌చంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జాతీయ క్రీడాదినోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకోవ‌డం జ‌రుగుతోంద‌ని అన్నారు. ఈ వేడుక‌ల్లో ఒలింపిక్ క్రీడ‌ల్లో పాల్గొని దేశానికి గుర్తింపు తెచ్చిన క్రీడాకారులు కూడా పాల్గొన్నందుకు చాలా గ‌ర్వంగా ఉంద‌న్నారు. రాష్ట్రం క్రీడారంగంలో మ‌రింత ఉన్న‌తంగా ఎద‌గాల‌ని ఆశిస్తున్నాన‌ని పేర్కొన్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి, గౌర‌వ మంత్రివ‌ర్యులు క్రీడ‌ల‌కు అత్యంత ప్రాధాన్య‌మిస్తున్నార‌ని.. ప్ర‌తిఒక్క‌రూ త‌మ జీవ‌న‌శైలిలో క్రీడ‌ల‌ను భాగం చేసుకోవాల‌ని సూచించారు.

క్రీడా ఆణిముత్యాల‌కు స‌త్కారం:

జాతీయ క్రీడాదినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా మంత్రివ‌ర్యులు మండిప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డి.. పీవీ సింధు, శాప్ వీసీ, మేనేజింగ్ డైరెక్ట‌ర్ పీఎస్ గిరీష, ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి క్రీడా ఆణిముత్యాల‌ను ఘ‌నంగా స‌త్క‌రించారు. ధీర‌జ్ శ్రీకృష్ణ (ఆర్టిస్టిక్ యోగా), జి.న‌గేష్ బాబు (బాస్కెట్ బాల్‌), భావ‌న (సాఫ్ట్ టెన్నిస్‌), ఎం.అంకిత (వాలీబాల్‌), గిరిబాబు (వాట‌ర్ స్పోర్ట్స్‌)ల‌ను స‌త్క‌రించారు. జాతీయ క్రీడాదినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా మంత్రివ‌ర్యులు మండిప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డి.. క్రీడాకారులు, ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియం వ‌ద్ద మెగా ర్యాలీని ప్రారంభించారు.

కార్య‌క్ర‌మంలో ఆర్చ‌రీ అంత‌ర్జాతీయ క్రీడాకారుడు బి.ధీర‌జ్‌, అథ్లెటిక్స్ అంత‌ర్జాతీయ క్రీడాకారిణులు య‌ర్రాజి జ్యోతి, జ్యోతిక‌శ్రీ త‌దిత‌రుల‌తో పాటు శాప్ అధికారులు, సిబ్బంది జి.వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఎ.మ‌హేష్‌బాబు, కె.కోటేశ్వ‌ర‌రావు, పి.సురేంద్ర‌, కిశోర్ బాబు; ఎన్‌టీఆర్ జిల్లా క్రీడ‌ల అభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్‌, జిల్లా యువ‌జ‌న సంక్షేమ అధికారి యు.శ్రీనివాస‌రావు, జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేట‌ర్ డా. కొల్లేటి ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE