Suryaa.co.in

Telangana

తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త

  • జనవరి నుండి తెల్ల రేషన్ కార్డులకు సన్న బియ్యం
  • పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి

తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు పెద్ద శుభవార్త. 2025 జనవరి నెల నుండి వారికి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అంత్యోదయ కార్డుల సంఖ్యను పెంచే విషయాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. అంత్యోదయ కార్డుదారులు ఎక్కువగా లబ్ధి పొందేలా ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా పని చేయాలన్నారు.

రేషన్ డీలర్లు పిడిఎఫ్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే, వారి లైసెన్సులు రద్దు చేసి, జరిమానా విధిస్తామని మంత్రి హెచ్చరించారు. ప్రజలకు చేరాల్సిన రేషన్ సరుకులను ఏ కష్టం లేకుండా అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు.

రాష్ట్రంలోని రేషన్ దుకాణాలలో సబ్సిడీ గోధుమలు పంపిణీకి సంబంధించి మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. అంతేకాకుండా, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే రేషన్ బియ్యం నాణ్యతపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1,629 రేషన్ డీలర్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని, ఈ విషయమై తగు చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

LEAVE A RESPONSE