Suryaa.co.in

Telangana

బ్రతకమని సర్కార్ పొలాలు ఇస్తే ఇదేం బుద్ధి?

  • పాటు కాలువలు పాడుచేసి మట్టి వ్యాపారం
  • నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబానికి ప్రభుత్వ అసైన్డ్ పొలాలు
  • షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు
  • కొండన్నగూడ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్
  • జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

షాద్ నగర్ : ప్రభుత్వం బతుకమని పేద ప్రజలకు అసైన్డ్ భూములను కేటాయిస్తే వాటిని నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబం పెద్ద ఎత్తున సర్కార్ భూములను దక్కించుకొని.. ఇప్పుడు అదే భూములలో నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డగోలుగా మట్టి వ్యాపారం చేస్తూ పైగా పాటు కాలువను పాడుచేసి ధ్వంసం చేసిన వ్యక్తులపై చట్టరీత్యా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు డిమాండ్ చేశారు.

ఫరూక్ నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలో సర్వేనెంబర్ 53/1/రు/1 లో ఉన్న 1ఎకరా 13 గుంటలు అదేవిధంగా సర్వేనెంబర్ 53/1అ/38 లో 3 ఎకరాల 34 గుంటలు మొత్తం ఐదు ఎకరాల ఏడు గంటల భూమి ఉందని, అదేవిధంగా సర్వేనెంబర్ 53/1అ 1లో 26 గుంటలు. సర్వేనెంబర్ 53/ 1ఓలో 1 ఎకరా 14 గుంటలు మొత్తం 2 ఎకరాల భూమిలో ప్రభుత్వ అసైన్డ్ భూమి మేడమోని విట్యాల కృష్ణయ్య, మేడమోని విట్యాల శ్యామల దంపతులకు ప్రభుత్వం అసైన్డ్ ఇచ్చిందని తెలిపారు.

ఈ పొలంలో ఉన్న పాటు కాలువను సైతం వారు ధ్వంసం చేసి మట్టిని దర్జాగా విక్రయించారని పేర్కొన్నారు. వీరితో పాటు పక్కనే ఉన్న రామ్ రెడ్డి అనే వ్యక్తి కూడా అసైన్డ్ పొలాల్లో మట్టిని అక్రమంగా విక్రయించారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.

బుధవారం సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు సందర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొండన్నగూడ గ్రామంలో సదరు సర్వే నెంబర్లలో వాటర్ షెడ్ల పనులు చేపట్టినట్టు తెలిపారు.

అప్పటి వాటర్ షెడ్ చైర్మన్ కృష్ణయ్య యాదవ్ ఉన్న సమయంలో 20 లక్షల రూపాయలను మంజూరు చేసి వాటర్ షెడ్ అభివృద్ధి కోసం పాటు కాలువలు, ఆనకట్టలు నిర్మించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ అసైన్డ్ పొలాలలో ఇలా విచ్చలవిడిగా నిబంధనలకు వ్యతిరేకంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకున్న వారిపై నీటిపారుదల శాఖ అధికారులు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఒకే కుటుంబానికి చెందిన మేడమోని కృష్ణయ్య అతని భార్య శ్యామల అదేవిధంగా అతని కుటుంబ సభ్యులపై నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ పొలాలు ఎలా ఒక కుటుంబానికే ఎక్కువ భూమి ఇచ్చారో అధికారులు చెప్పాలని కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఒకే కుటుంబంలో ప్రతి వ్యక్తికి అసైన్డ్ పొలం ఎలా కేటాయించారు? అధికారులు సమగ్ర దర్యాప్తు జరపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు ద్వారా కోరినట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు.

ఈ అంశం క్షమించరానిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓవైపు ప్రభుత్వ అసైన్డ్ పొలాలను నిబంధనకు వ్యతిరేకంగా ఒకే కుటుంబం అనుభవిస్తూ పదిమందికి ఉపయోగపడే పాటు కాలువలను పాడుచేసి మట్టిని అమ్ముకోవడం క్షమించరాని నేరమని ఆయన తెలిపారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బక్కని నర్సింహులు డిమాండ్ చేశారు,

LEAVE A RESPONSE