– ఆస్పత్రి అభివృద్ధి చేయడానికి దాతలు ముందుకు రావాలి
– రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విజ్ఞప్తి
పాలసముద్రం: రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్య సేవలు పేదలకు అందించాలని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మంత్రి పాల్గొన్నారు. పాలసముద్రం స్థాయి పెరిగిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 15 ఆర్థిక సంఘం నిధులతో 3500 విలేజ్ లెవెల్ హెల్త్ క్లినిక్లు పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సుమారు1095 కోట్ల రూపాయలు నిధులు పనులు చేపట్టడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, త్వరలో టెండర్ పక్రియ పూర్తి చేసి నిర్మాణం పనులు వేగవంతం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో సమాజ అభివృద్ధికి పూర్తి నిబద్ధతను చూపుతున్న హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ను నేను అభినందిస్తున్నాను. ఆరోగ్య సంరక్షణ సదుపాయాల లభ్యత, పారిశుద్ధ్యం, నైపుణ్య అభివృద్ధి వంటి కీలకమైన రంగాలపై వారి దృష్టి నేరుగా స్వావలంబన ఆంధ్రప్రదేశ్ అనే మా ఉమ్మడి లక్ష్యానికి దోహదపడుతుందన్నారు. రాబోయే రోజులలో నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం.మోహన్ కృష్ణ, శివారెడ్డి, యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.