– జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ ఖాతాదారులు నష్టపోయారు
– సొంతంగా కాకుండా ప్రభుత్వ పరంగా అడిట్ జరిపించాలి
– ఎప్పుడో 30 ఏళ్ళక్రితం తెచ్చిన 1995యాక్ట్ ని సవరించాలి
– అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
అమరావతి : ప్రయివేటు సొసైటీలలో డబ్బులు పొదుపు చేసుకుంటున్న వినియోగదారులు మోసపోతున్నారని, ఈ దృష్ట్యా ఆ సొసైటీలపై గట్టి అజమాయిషీ ఉండేలా చర్యలు చేపట్టాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్(వాసు) కోరారు. అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ వ్యవహారాన్ని ఎమ్మెల్యే వాసు ప్రస్తావించారు.
రాజమండ్రి, కాకినాడ లలో ఈ సొసైటీ అవినీతి వల్ల వినియోగదారులు నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. మార్ట్ గేజ్ లో ఉన్న డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితులు వస్తున్నాయని, దాదాపు మూడు కోట్ల 70 లక్షల విలువ చేసే డాక్యుమెంట్స్ ఆవిధంగా విడుదల చేశారని ఎమ్మెల్యే వాసు సభ దృష్టికి తెచ్చారు. ఈ సొసైటీలన్నీ ఏపీఎంఏ సీఎస్ 1995 యాక్ట్ కింద సుమారు 30 ఏళ్ళ కిందట గల యాక్ట్ ప్రకారం నడుస్తున్నాయని, అంతకు ముందు 1964లో తెచ్చిన యాక్ట్ కి కొనసాగింపుగా వచ్చిన చట్టం ఇది ఆయన వివరించారు.
ఈ సొసైటీలకు ప్రభుత్వ పరంగా ఆడిట్ గానీ, తనిఖీలు గానీ లేనందున ఎవరికి వాళ్ళు సొంతంగా అడిట్ చేసేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. దీనివలన డబ్బులు దాచుకున్నవాళ్లు నష్టపోతున్నారని, ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు కష్టపడి కూడబెట్టిన డబ్బులు ఎక్కువ వడ్డీ వస్తుందన్న ఆశతో ఇలాంటి బ్యాంకులు, సొసైటీలలో దాచుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తన నియోజక వర్గంలోనే కాకుండా ఇలాంటి ఘటనలు చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయన్నారు. అందుకే 1995 యాక్ట్ ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించి, ప్రభుత్వ పరంగా ఆడిట్ జరిగేలా చూడాలని, ఇలాంటి సొసైటీల లెక్కలను ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేసేలా సంబంధిత మంత్రి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.