Suryaa.co.in

Andhra Pradesh

వరద ముంపు బాధితులకు అండగా ప్రభుత్వం

-మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి
– 1000 మంది బాధితులకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం కిట్ల పంపిణీ

అమరావతి: బుడమేరు వరద బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన వరద ముంపు బాధితులు అందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు.

మంగళవారం పంజా సెంటర్ ప్రాంతంలో నంద్యాల కు చెందిన గురు రాఘవేంద్ర విద్యాసంస్థల తరపున డైరెక్టర్లు షేక్షావల్ రెడ్డి, మౌలాలి రెడ్డి నేతృత్వంలో ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున 1000 మందికి బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు.

పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రులు ఎన్ఎండి ఫరూక్,బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వరద మంపుతో నష్టపోయిన బాధితులు అందరినీ ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్లి పరిశీలించి నివేదిక రూపొందించడం జరిగిందన్నారు. విపత్తు కారణంగా బాధితులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగం, మంత్రివర్గం నిరంతరo అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.

వరద బాధితులను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, వివిధ సేవా సంస్థలు, విద్యాసంస్థలు,ఎందరో దాతలు, వివిధ వర్గాలకు చెందిన వారంతా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేస్తూ తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

ధన రూపేనా, వస్తురూపేనా, వస్త్ర రూపేనా దాతలు రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు వచ్చి ముంపు ప్రాంతాలలో క్షేత్రస్థాయిలోనే బాధితులకు చేయూతని అందిస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రులు ఫరూక్, జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ, టిడిపి మైనార్టీ నాయకుడు ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE