– క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలను అందించి, భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలి
– జీపీవోల ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మైన్ వి. లచ్చిరెడ్డి
కరీంనగర్: గ్రామ స్థాయిలో ప్రజలకు, రైతులకు మేలు జరగాలనే ప్రభుత్వ సంకల్పం జీపీవో (గ్రామ పాలన అధికారులు) లు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి అన్నారు. ఇటీవల రెవెన్యూ శాఖలో నియమకమైన జీపీవోలు అంకిత భావంతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు.
జీపీవోలపై ప్రభుత్వం పెట్టిన గురుతర బాధ్యతను అనునిత్యం గుర్తించుకోవాలన్నారు. బుధవారం ఉమ్మడి కరీంనగర్ నగర్ జిల్లా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో గ్రామ పాలన అధికారుల ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులోని రెవెన్యూ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లచ్చిరెడ్డి నూతనంగా నియామకమైన జీపీవోలకు భూభారతి చట్టంపై అవగాహన, విధులు/బాధ్యతలతో పాటు పారదర్శకత, అంకితభావంతో కూడిన పౌరసేవలపై దిశా నిర్దేశం చేశారు.
తెలంగాణ రాష్ట్ర గ్రామీణ రైతాంగానికి, ప్రజలకు మెరుగైన సేవలను క్షేత్రస్థాయిలోనే అందించాలనే సంకల్పంతో పాటు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం, పునర్నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంపూర్ణ సహకారం, భూ భారతి చట్టం అమలుతో జీపీవో వ్యవస్థ ఏర్పాటు సాధ్యమైందన్నారు. జీపీవోల సమస్యలను నాకు వదిలేసి ప్రజల సమస్యల పరిష్కారం బాధ్యత ను జీపీవో లు స్వీకరించాలన్నారు.
తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని రెవెన్యూ, భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. రెవెన్యూ చట్టాలకు సంబంధించి తెలంగాణ రెవెన్యూ పత్రికను నడపడం జరుగుతుందన్నారు. గతంలో ఐదు వేల మంది ఉంటే, నేడు 10వేల పై చిలుకు రెవెన్యూ ఉద్యోగులను రెవెన్యూ శాఖలోకి తీసుకోవడం జరిగిందన్నారు. జీపీవోలు ఉద్యోగం భావన తెలిసి ఉండాలన్నారు. ఏ ఒక్కరు తప్పు చేసినా అది మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందన్నారు.
ప్రజలతో సఖ్యతగా ఉండాలని సూచించారు. జీపీవోల సమస్య తీరిందని, ఇతరుల సమస్యలను విస్మరించవద్దన్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించి త్వరలోనే తీపి కబురు వస్తుందన్నారు. ప్రజలకు మంచి సేవ చేస్తారని నేను భావిస్తున్నానని, కింది స్థాయి, నుండి ఉన్నత స్థాయి వరకు పదోన్నతులు వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భూ జీపీవో ల విధులు, పదోన్నతులు కూడా చాలా పకడ్బందీగా రూపొంచడం జరుగుతుంది. ఈ రోజు జీపీవోల వేతనాలకు సంబంధించి ప్రభుత్వ పెద్దలు, సీసీఎల్ఏ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే వేతనాలు అందుతాయని తెలిపారు.
ఉద్యోగుల జేఏసీ చైర్మైన్ లచ్చిరెడ్డి సారధ్యంలో గ్రామ పాలన అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి అన్నారు. రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వ్యక్తులే నేడు మళ్ళీ మన మధ్య తిరుగుతున్నారని అన్నారు. పదోన్నతుల విషయంలో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జీపీవో లు ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని సూచించారు.
టీజీటీఏ జనరల్ సెక్రటరీ రమేష్ పాక మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు యువత ఎంత కీలకమో, రెవెన్యూ వ్యవస్థకు జీపీవోలు అంతే కీలకమన్నారు. పోరాడి సాధించుకున్న ఉద్యోగంను ఒక యగ్నంగా భావించి ప్రజలకు నాణ్యమైన సేవలను సత్వరం అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మైన్ లచ్చిరెడ్డితో పాటు టీజీటీఏ జనరల్ సెక్రటరీ రమేష్ పాక, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.బిక్షం, రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ చిల్లా శ్రీనివాస్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కరీంనగర్ నగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, రమేష్, టీజీటీఏ కరీంనగర్ నగర్ కార్యదర్శి రాజేశ్వరి, నవాజ్ షరీఫ్, రిటైర్డ్ తహసీల్దార్ గంప శంకరయ్య, మల్లారం అర్జున్, ఆంజనేయ ప్రసాద్, సాయి కిషోర్, బాపుదేవ్ తదితరులు పాల్గొన్నారు.