Suryaa.co.in

Telangana

ప్రగతి భవన్ లో ఘనంగా దసరా వేడుకలు

• కుటుంబంతో కలిసి నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి
• శమీ పూజ, వాహన పూజ, ఆయుధ పూజ,ఆశీర్వచనం కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
• రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని, విజయాలు సిద్ధించాలని అమ్మవారిని ప్రార్థించిన సీఎం కేసీఆర్

విజయదశమి వేడుకలు సోమవారం ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోశ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం సతీమణి శోభమ్మ, కుమారుడు మంత్రి కెటిఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు పాల్గొన్నారు. అనంతరం శమీపూజ నిర్వహించారు. ఇందులో భాగంగా సాంప్రదాయ పద్దతిలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు, విజయాలు సిద్ధించాలని ఆశీర్వచనం ఇచ్చారు.

శుభసూచకంగా భావించే పాలపిట్టను సిఎం దర్శనం చేసుకున్నారు. సాంప్రదాయం ప్రకారం దసరానాడు ప్రత్యేకంగా నిర్వహించే వాహన పూజలో మనుమడు హిమాన్షును తోడ్కొని సిఎం గారు పాల్గొన్నారు. అనంతరం సాంప్రదాయ పద్దతిలో వేదపండితులు నిర్వహించిన ఆయుధ పూజలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పూజాకార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది సిఎం కేసీఆర్ నుండి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందరకీ సిఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని సిఎం ప్రార్థించారు.

LEAVE A RESPONSE