Suryaa.co.in

Editorial

బాబు వదిలేసినా.. తెలంగాణ బ్రహ్మరథం!

-ఇకనయినా తెలంగాణపై దృష్టి పెట్టాలంటున్న తమ్ముళ్లు
-షర్మిల పార్టీ కంటే తీసిపోయామా అంటున్న తెలంగాణ తమ్ముళ్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన తెలంగాణలో పార్టీని మర్చిపోయి ఐదారేళ్లయిపోయింది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా బంజారాహిల్స్‌లోని పార్టీ ఆఫీసుకు రారు. హైదరాబాద్‌లోనే కాదు, తెలంగాణలో పార్టీ కార్యక్రమం జరిగినా హాజరుకారు. తెలంగాణ తమ్ముళ్లే ఆయన వద్దకు వెళుతుంటారు. అంటే ఒక్కముక్కల్లో చెప్పాలంటే.. ఆయన తెలంగాణలో పార్టీ వద్దనుకున్నారు. కానీ.. ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనను, తెలంగాణ ప్రజలు మాత్రం ఇంకా మర్చిపోలేదు. వెళ్లిన చోటల్లా ఆపి ఘనస్వాగతం పలుకుతున్నారు. ఇంతకూ ఆయనెవరంటే.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు.

ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబునాయుడు తెలంగాణలో టీడీపీని వదిలేసి, పూర్తి స్థాయిలో ఏపీపైనే దృష్టి సారించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణలో 15 సీట్లు సాధించిన టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారంతా, ఒక్కొక్కరుగా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దానితో తెలంగాణలో టీడీపీ ఉనికి మాయమయింది. తెలంగాణలో పుట్టిన తెలుగుదేశం పార్టీ కథ, ఆవిధంగా తెలంగాణలోనే ముగిసినట్టయింది.

తెలంగాణలో టీడీపీ కనుమరుగుకు కారణమయిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు పాత్రేమీ లేదని తేల్చి, చార్జిషీట్‌లో చంద్రబాబునాయుడు పేరు లేకుండా కేసు కొనసాగుతోంది. అయినా టీడీపీలో చలనం లేదు. ఉన్న కొంతమంది నాయకులతోనే బండి నడిపిస్తున్నారు. జనాలకు పెద్దగా తెలియని నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించారు. గత గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ పోటీ నామమాత్రంగానే ముగిసింది. పార్టీ జెండాలు తప్ప, మిగిలిన ఏ వనరులూ అందించలేని నిస్సహాయ స్థితిలో ఎన్నికల్లో పోటీని మమ అనిపించారు.

నిజానికి హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్యంగా 40కి పైగా స్థానాలు రావడానికి టీడీపీ నిస్సహాయతే కారణం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను గతంలో మాదిరిగా టీడీపీ నాయకత్వం సీరియస్‌గా తీసుకుని ఉంటే, బీజేపీకి అన్ని సీట్లు వచ్చే అవకాశం ఉండేది కాదంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గతంలో మాదిరిగా చంద్రబాబు గానీ, లోకేష్‌ గానీ, ఇతర పార్టీ సీనియర్లు గానీ ప్రచారం చేయని విషయం తెలిసిందే.

తెలంగాణలో పుట్టిన తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ క్యాడర్‌ను చంద్రబాబునాయుడు ఆరకంగా అనాధగా వదిలేసినా జనం మాత్రం.. తెలంగాణలో చంద్రబాబునాయుడు ఏదైనా కార్యక్రమాలకు హాజరయితే, ఆయనను చూసేందుకు పోటీలు పడుతున్న వైచిత్రి. అమరావతి నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్‌babu1 నుంచి అమరావతికి వెళ్లే రోడ్డు మార్గంలో వెళ్లే చంద్రబాబుకు నల్లగొండ జిల్లా పార్టీ కార్యకర్తలు నీరాజనాలు పడుతున్నారు. ఆయన కాన్వాయ్‌ను ఆపి మరీ బాబుతో ముచ్చటిస్తున్న సందర్భంలో, అక్కడి స్థానికులు కూడా చేరి ఆయనతో సెల్ఫీలు తీసుకోవడం సాధార ణమయి పోయింది. చంద్రబాబు హైదరాబాద్‌లో హాజరయ్యే వివాహ కార్యక్రమాలకయితే, పెళ్లికి వచ్చే వారంతా ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీలు పడే దృశ్యాలు కనిపిస్తాయి.

తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన బాబుకు తెలంగాణ జనం హారతులు పట్టారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్‌ మండలంలో పర్యటనకు వెళ్లిన బాబుకు, అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాఠశాల బాలికలు రోడ్డుకిరువైపులా నిలబడి, ఆయనకు స్వాగతం చెప్పారు. మహిళలయితే పూలవాన కురిపించారు. దానితో తనకు ఎదురయిన ఘనస్వాగతానికి మురిసిపోయిన బాబు, కారు దిగి వారితో మాట్లాడారు. తాను పరామర్శకు వెళుతున్నానని, మళ్లీ వచ్చి మిమ్మల్ని కలుస్తానంటూ చెప్పి, వెళ్లిపోయారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారి భద్రాద్రి జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు ఎదురయిన ఘన స్వాగతదృశ్యాలివి. అయితే.. తెలంగాణ ప్రజలనుతమ నేత చంద్రబాబు మర్చిపోయినా, తెలంగాణ ప్రజలు మాత్రం ఆయనను మర్చిపోలేదని చెప్పడానికి, ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలని తెలంగాణ తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.

షర్మిల కంటే తీసిపోయామా.. బాబూ!
‘కడప జిల్లాకు చెందిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి తాను తెలంగాణ ఆడపడచునంటూ స్వేచ్ఛగా, నిర్భయంగా తిరుగుతున్నారు. కానీ తెలంగాణలో పుట్టిన తెలుగుదేశం పార్టీకి మళ్లీ ప్రాణం పోయడానికి మా నాయకత్వం మాత్రం భయపడిపోతున్న తీరే బాధాకరం. ఇప్పటికీ తెలంగాణలో నేతలు లేకపోయినా క్యాడర్‌ అలాగే ఉంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలపై ఇప్పటికయినా దృష్టి సారించి, సమర్ధుడైన అధ్యక్షుడిని నియమిస్తే పార్టీకి పూర్వవైభవం తప్పకుండా వస్తుంది. కానీ మా సార్‌ మాత్రం తెలంగాణలో పార్టీని పటిష్టం చేయాలంటేనే ఎందుకో భయపడుతున్నారు. అసలు బలంగా ఉన్న హైదరాబాద్‌లోనే పార్టీని వదిలేయడం బాధాకరం. రాయలసీమకు చెందిన షర్మిల లాంటి నాయకురాలే అంత ధైర్యంగా తెలంగాణలో రాజకీయాలు చేస్తుంటే, తెలంగాణలో పుట్టిన టీడీపీని మాత్రం బలోపేతం చేయడానికి మా సార్‌ ఎందుకో భయపడుతున్నార’ని ఓ సీనియర్‌ నాయకుడు వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE