– బల్లికురవ మండలం వేమవరం జంక్షన్ వద్ద కార్మికులు
-యజమానుల ఆందోళన
– మంత్రి గొట్టిపాటి ఇలాకా నుంచే సమరం షురూ
– ఏఎంఆర్ చెక్ పోస్టు కంటైనర్ బాక్సులను కూల్చేసిన వైనం
– సీసీ కెమెరాలు, లైటింగ్ పోల్, కంప్యూటర్ సెట్ ధ్వంసం
– ఇటీవలే మార్టూరు హైవే జొన్నతాలి వద్ద గ్రానైట్ యజమానుల ఆందోళన
– జీఎస్టీ, రాయల్టీ బాదుడుపై తిరుగుబాటు
– ఇన్నేసి పన్నులు మేం మోయలేం
– మాపై ఏఎంఆర్ పెత్తనమేంటి?
– తిరగబడ్డ యజమానుల్లో టీడీపీ వారే ఎక్కువ
– ఓ మీడియా అధిపతి రాయబారంతో ఏఎంఆర్ టెండరు దక్కించుకుందని టీడీపీ నేతల ఆరోపణ
-వ్యాపారంలో ఆ మీడియా అధిపతికీ వాటాలున్నాయని ఆగ్రహం
– ఇప్పటికే మిథున్ రెడ్డి కోసం ఆ అధిపతి లాబీయింగ్ చేస్తున్నారంటూ విమర్శలు
-కూటమి వచ్చాక టీటీడీ మాజీ సభ్యుడు, ఇసుక వ్యాపారి శేఖర్ రెడ్డి కోసం లాబీయింగ్?
– వంద కోట్ల ఆదాయాన్ని ఏఎంఆర్ కు 40 కోట్లకే ఇచ్చేశారంటూ విమర్శలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగన్ జమానాలో కేవలం మూడు జిల్లాల్లోనే సీనరేజీ వసూళ్లు చేసిన ఏఎంఆర్ కంపెనీ.. ఇప్పుడు కూటమి హయాంలోనూ మళ్లీ చక్రం తిప్పి, ఈసారి రాష్ట్రం మొత్తం వసూళ్లకు గుత్తాధిపత్యం పొందిన క్రమంలో.. రాష్ట్రంలో తొలిసారి ఉమ్మడి ప్రకాశం జిల్లా, మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి నియోజకవర్గం నుంచే తిరుగుబాటు ప్రారంభం కావడం సంచలనం సృష్టిస్తోంది. ఆగ్రహోదగ్రులైన తమ్ముళ్లు.. ఏఎంఆర్ కంపెనీకి చెందిన ఆస్తులను ధ్వంసం చేశారు. సీసీ టీవీలు పగలగొట్టారు. కంటైనర్ బాక్సులను కూల్చేశారు. మొత్తంగా తమ్ముళ్లు ఏఎంఆర్ పై అగ్గిరాముళ్లయ్యారు. తాజాగా తిరగబడ్డ గ్రానైట్ కంపెనీ యజమానుల్లో 80 శాతం టీడీపీ సానుభూతిపరులే కావడం విశేషం.
జగన్ హయాంలో ఇదే ఏఎంఆర్ పెత్తనా న్ని ప్రశ్నించి.. తిరగబడ్డ తమ పార్టీ.. ఇప్పుడు మళ్లీ అదే కంపెనీకి సీనరేజీ వసూళ్లను అప్పగించడంపై తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. జగన్ సర్కారు కూడా ఇంత దారుణంగా వసూలు చేయలేదని, అసలు జగన్ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వమే వసూలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నెలకు అక్షరాలా వంద కోట్ల రూపాయల ఆదాయాన్ని, ఏఎంఆర్ కంపెనీకి కట్టబెట్టడంపై, తమ్ముళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు.
బాపట్ల జిల్లాలో మైనింగ్, ఇసుక, మట్టి తరలింపు వసూళ్లను ప్రభుత్వం ఏఎంఆర్ కంపెనీకి నెలకు 48 కోట్లకు కట్టబెట్టింది. నిజానికి లెక్కకుమించిన గ్రానైట్ కంపెనీలు, కట్టింగ్ మిషన్ ఫ్యాక్టరీలు ఉన్న ఈ ప్రాంతంలో నెలకు సీనరేజీ ఆదాయం వంద కోట్ల రూపాయలుంటుందని చెబుతున్నారు. ఆ రకంగా ఏఎంఆర్ నెలకు సులభంగా 50 కోట్లు మిగుల్చుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. కాగా ఇటీవల జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు ఒక మంత్రిగారే నెలకు ఇంత అని ఫిక్స్ చేశారన్న ఆరోపణలు టీడీపీ వర్గాల నుంచే వినిపించాయి. ఈ క్రమంలో కంపెనీ జీఎస్టీలు, రాయల్టీలతోపాటు అనధికార వసూళ్లతో విసుగుచెందిన గ్రానైట్ యజమానులు-కార్మికుల హటాత్తుగా వేమవరం జంక్షన్లో.. పన్నులు వసూలు చేస్తున్న ఏఎంఆర్ చెక్‌పోస్టు వద్ద ఆందోళనకు దిగారు.
కంపెనీ కంటైనరు బాక్సులను బద్దలు కొట్టిన ఆందోళనకారులు, సీసీ టీవీ కెమెరాలు, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. పన్నుల పేరుతో దోపిడీకి పాల్పడుతోందంటూ ఆందోళన నిర్వహించారు. మధ్యాహ్నం బల్లికురవ మండలంలోని వేమవరం, మల్లాయపాలెం, ఉప్పమాగులూరు, కొణిదెన, గంగపాలెం, నక్కబొక్కలపాడు తదితర గ్రామాల్లోని గ్రానైట్ కంపెనీ యజమానులు, అందులో పనిచేసే దాదాపు 500 మంది కార్మికులు ఒక్కసారిగా ఏఎంఆర్ చెక్పోస్టుఫై దాడి చేయడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు.
మా కంపెనీలోకి వచ్చి తనిఖీలు చేసేందుకు మీకేం అధికారం ఉంది? మేం ప్రభుత్వానికి పన్నులు కట్టి, మీకూ మామూళ్లు సమర్పించుకోవాలా? ఇక మేం ఏం తినాలి? అసలు మార్కెట్లో గ్రానైట్ గిరాకీ పడిపోయింది అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. గత జగన్ ప్రభుత్వ హయాంలోనే నెలకు 840 కోట్లకు టెండరు పిలిచినా ఎవరూ రాలేదని, ఇప్పుడు ఏఎంఆర్ కేవలం నెలకు 48 కోట్లు చెల్లించి, ఏకంగా వంద కోట్లు సంపాదించాలని చూస్తోందని ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులకు సర్దిచెప్పి వెనక్కి పంపించారు.
జగన్ జమానాలోనే నయం సీనరేజీ వసూళ్లలో జగన్ ప్రభుత్వమే మేలని గ్రానైట్ యజమానులు, కార్మికులు వ్యాఖ్యానించడం గమనార్హం. జగన్ ప్రభుత్వ హయాంలో ఒక కట్టరుకు 25 వేలు వసూలు చేసేవారని, ఇప్పుడు ఏఎంఆర్ కంపెనీ అదే కట్టరుకు 35 వేల రాయల్టీతోపాటు, 5 వేలరూపాయల జీఎస్టీ, కట్టరుతో 35 వేలు కప్పం కింద వసూలు చేస్తోందని విరుచుకుపడ్డారు. కట్టింగ్ సందర్భంగా మిగిలిపోయే రాయికీ పన్నులు వేస్తుంటం దారుణమన్నారు. అటు.. గ్రానైట్, ప్యాక్టరీలు మూతపడితే తాము రోడ్డున పడతామని యుపి, బిహార్, రాజస్థాన్, ఒడిషా, పశ్చిమబెంగాల్, తమిళనాడు నుంచి వచ్చిన వందలాది కార్మికు లు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మార్టూరు మండల రహదారి జొన్నతాలి గ్రామం వద్ద గ్రానైట్ వ్యాపారులు ఆందోళన నిర్వహించారు. ఇప్పుడు స్వయంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో ఏకంగా ఏఎంఆర్ కంపెనీ వస్తువులను ధ్వంసం చేయడం ప్రస్తావనార్హం. కాగా యువనేత లోకేష్ యువగళం పాదయాత్రకు వచ్చిన సందర్భంగా.. ఆయన ఇచ్చిన హామీలను వారు మీడియాకు చూపించారు.
గ్రానైట్ పై వారి పెత్తనం ఏమిటి? మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏఎంఆర్ కంపెనీ దోపిడీతో తాము వ్యాపారాలు చేసుకోలేక, పరిశ్రమలను మూసుకోవలసిన పరిస్థితి వచ్చిందని కంపెనీ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో గతంలో మాదిరిగా గ్రానైట్ కు గిరాకీ లేదని గుర్తు చేశారు. ఈ విషయంలో మంత్రి కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకాలేదని.. ఇప్పటివరకూ ప్రైవేటు సంస్థలు తమ ప్యాక్టరీలోకి వచ్చి తనిఖీలు చేయలేదని, కానీ ఏఎంఆర్ కంపెనీకి ప్రభుత్వం అలాంటి అధికారం ఇవ్వడం దారుణమని యజమానులు వ్యాఖ్యానించారు.
ఒక మీడియా సంస్థ అధిపతి హస్తం? ఈ వ్యవహారంలో ఒక మీడియా సంస్థ అధిపతి హస్తం ఉందని, ఆయనే దుబాయ్ వివాహ వేడుకలో.. ఏఎంఆర్ కంపెనీతో రాయబారం నిర్వహించారని, ఇప్పుడు సదరు మీడియా అధిపతికి సైతం ఇందులో వాటా ఉందంటూ విరుచుకుపడుతున్నారు. ఆయనే ప్రభుత్వానికి -ఏఎంఆర్కి సయోధ్య కుదిర్చారన్న సమాచారం తమ వద్ద ఉందంటున్నారు.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి పై లిక్కర్ కేసును నీరుగార్చేందుకు సైతం ఇదే మీడియా అధిపతి లాబీయింగ్ చేస్తున్నారంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ పై దృష్టి సారించిన ఆయన తన పలుకుబడి వినియోగించి తమకు కావలసిన వారికి మైనింగ్ లీజులు కట్టబెడుతున్నారంటున్నారు. అదేవిధంగా టీటీడీ మాజీ సభ్యుడు, చెన్నైలో ఇసుక వ్యాపారి శేఖర్ రెడ్డిని కూటమి దరి చేర్చేందుకు సైతం ఇదే మీడియా అధిపతి లాబీయింగ్ చేశారని గుర్తు చేస్తున్నారు. ఇదే శేఖర్ రెడ్డి పై కరోనా కాలంలో ఈడీ-ఐటి దాడి చేయగా, వేలకోట్ల రూపాయలు దొరికిన విషయం తెలిసిందే.


