మాదాసి కురువలకు కూడా సబ్సిడీ పై గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల గొర్రెల పెంపకం వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మాదాసి కురువ లు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం కొల్హాపూర్ MLA బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆలంపూర్,MLA అబ్రహం ల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన మాదాసి కురువ లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వేరు వేరుగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రిని కురువలు గొంగడి, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి కుటుంబాలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించే విధంగా ప్రభుత్వం చేయూతను అందిస్తుందని తెలిపారు. ఆలంపూర్, కొల్హాపూర్, జోగులాంబ గద్వాల నియోజకవర్గాల పరిధిలో ఉన్న సుమారు 32 వేల మంది మాదాసి కురువ లకు గొర్రెల యూనిట్లను అందజేస్తామని మంత్రి వివరించారు.
లబ్దిదారుల వాటాధనం DD లను అధికారులకు అందజేయాలని మంత్రి సూచించారు. త్వరలోనే పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి గొర్రెల యూనిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి వివరించారు.