– భారత పురస్కారం పద్మశ్రీ ఆదివాసీలిద్దరికి రావడం ఈ కళల గొప్పతనానికి నిదర్శనం
– అంతరిస్తున్న కళలు, జాతులకు రక్షణ కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది
– రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్
– నన్ను, నా కుటుంబాన్ని, జాతిని కాపాడాలి – పద్మశ్రీ రామచంద్రయ్య
హైదరాబాద్: అంతరించిపోతున్న గిరిజన కళలు, జాతులను కాపాడుతూ…వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గొప్ప కృషి జరుగుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో మేడారం జాతరలో సమ్మక్క – సారలమ్మల చరిత్రను డోలి వాయిద్యంలో చెప్పే రామచంద్రయ్యను పద్మశ్రీ పురస్కారానికి ప్రతిపాదించడం ఈ ప్రభుత్వానికి ఆదివాసీ కళల పట్ల ఉన్న చిత్తశుద్ది, అంకితభావానికి నిదర్శనమన్నారు. గత ఏడాది గుస్సాడి కనకరాజును, ఈ ఏడాది రామచంద్రయ్యలను పద్మశ్రీలకు ప్రతిపాదించడం ద్వారా గిరిజన కళల గొప్పతనాన్ని, ఆవశ్యకతను చాటి చెప్పారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డ, కోయ జాతి ఆణిముత్యం, జానపద కళాకారులు, డోలి వాయిద్య కారులు పద్మశ్రీ రామచంద్రయ్యను మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, విప్ రేగా కాంతారావు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, అధికారులు కలిసి నేడు మాసబ్ టాంక్ లోని నెహ్రూ సెంటినరీ ట్రైబల్ మ్యూజియంలో ఘనంగా సత్కరించారు. ఆయనకు పట్టుబట్టలు పెట్టి, శాలువా కప్పి, లక్ష రూపాయల నగదు అందించి సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ .. ఆదివాసీ కోయ బిడ్డ ఎక్కడో పుట్టి, కళకు గొప్ప సేవ చేసి భారత పురస్కారం పద్మశ్రీ పొందారు. కోయ చరిత్రలు చెబుతూ తన పని తాను చేసుకుంటూ
పోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను పద్మ పురస్కారాలకు సిఫారసు చేయడం ఈ కళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ రెండు సంవత్సరాలలో మా గిరిజనులకు గొప్ప గౌరవం దక్కింది. గత ఏడాది గుస్సాడి కనకరాజుకి, ఈ ఏడాది డోలి రామచంద్రయ్యకు పద్మశ్రీలు లభించాయి. గిరిజనుల కళల గొప్ప తనానికి ఇవి నిదర్శనం.
మేడారం జాతరలో డోలి కళను ప్రదర్శించడం, అమ్మవార్ల చరిత్రను, ఔన్నత్యాన్ని చెప్పడం, తద్వారా ఈ కళను, చరిత్రను భావి తరాలకు తీసుకెళ్లే ప్రయత్నం రామచంద్రయ్య గారు నిరంతరం చేశారు. పద్మశ్రీ పురస్కారాలు గొప్ప,గొప్ప వారికే కాదు మారుమూల గిరిజనులకు కూడా వస్తాయి అని చెప్పడానికి ఈ ఆదివాసీ ఆణిముత్యాలు నిదర్శనం.
సీఎం కేసిఆర్ స్వయంగా కళాకారులు కావడం వల్ల, ఈ రాష్ట్రంలో కళాకారులకు అత్యంత గౌరవం దక్కుతుంది.గిరిజన సంస్కృతి, కళలు అంతరించకుండా గిరిజన సంక్షేమ శాఖ ఎనలేని కృషి చేస్తోంది. జోడేఘాట్లో కొమురం భీమ్ మ్యూజియం, మేడారంలో ఆదివాసీ మ్యూజియం కట్టి వారి కళలు, చరిత్రను భావితరాలకు తెలియ చేస్తున్నాం.
ఆదివాసీల మరో గొప్ప సంస్కృతి అయిన నాగోబా జాతర కూడా మొదలైంది. నేను స్వయంగా సందర్శించి, ఆలయ అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇస్తాం అన్నాను. ఇప్పటికే 5 కోట్ల రూపాయలు కేటాయించాము, జాతర నిర్వహణకు కూడా ఏటా 20 లక్షలు ఇస్తున్నాం. సేవాలాల్ మహరాజ్ జయంతి, కుమురం భీమ్ జయంతి, వర్ధంతి, జంగు బాయ్ జాతర, నాగోబా జాతర వంటివి గొప్పగా ఈ ప్రభుత్వం నిర్వహిస్తోంది.
హైదరాబాద్ లో నిర్మించిన గిరిజన, ఆదివాసీ ఆత్మ గౌరవ భవనాలు త్వరలో ప్రారంభించుకుంటాం. పద్మశ్రీ రామచంద్రయ్య కుటుంబానికి వారి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇల్లు, వారి పిల్లలను గిరిజన శాఖ ద్వారా సముచితంగా ఆదుకుంటాం.రామచంద్రయ్య ని సీఎం కేసిఆర్ కి కలిపించే ప్రయత్నం చేస్తున్నాం.రామచంద్రయ్య గారి కళలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి గల సంపూర్ణ సహకారం అందిస్తాము.ఈ కళను మరింత మందికి నేర్పించే విధంగా వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని భగవంతున్ని కోరుకుంటున్నాను. ఆయనను సత్కరించే అవకాశం రావడం నిజంగా మా అదృష్టం. ఆయనకు సత్కారం చేయడం అంటే ప్రతి గిరిజన, ఆదివాసీ కళాకారున్ని సత్కరించడమే అన్నారు.
కేసీఆర్ కు పదివేల నమస్కారాలు: పద్మశ్రీ రామచంద్రయ్య
నేను ఎక్కడో, కోయ జాతిలో పుట్టాను. నాకు 58 సంవత్సరాలు. ప్రతి సారి మేడారం జాతరలో అమ్మవార్ల చరిత్రను చెబుతాను. ఈసారి కూడా ముందు మేడారం జాతరకు వెళ్లాలని ఉంది. ఈ అవార్డు రావడం వల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ నన్ను సన్మానం చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను, నా కుటుంబాన్ని, నా కోయ జాతిని మంచిగా చూసుకోవాలని సిఎం కేసిఆర్ కు పదివేల నమస్కారాలు.
రామచంద్రయ్య కు 10 వేల రూపాయల పెన్షన్ : ఎంపీ కవిత
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజన, ఆదివాసీల ఆణిముత్యాల పేర్లు కేంద్రానికి సిఫారసు చేస్తుంది. ఇలాంటి వారి గురించి సిఫారసు చేయడం చాలా గొప్ప విషయం. మొగిలయ్య కూడా చాలా కష్టపడ్డారు. బీమ్లా నాయక్ సినిమాలో పాటపాడడం ద్వారా అవార్డు వచ్చిందని కొందరు అనుకుంటున్నారు. కానీ ఆయన కొన్నేండ్లుగా చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి గొప్ప కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి ఉంటుంది. ఇలాంటి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 10 వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది. కేసిఆర్ గారు సీఎం అయ్యాకే ఇలా ఇస్తున్నాం. త్వరలోనే రామచంద్రయ్య కు కూడా ఈ పెన్షన్ వస్తుంది.
పద్మశ్రీ వంటి వాటితో గుర్తించడం గొప్ప విషయం: విప్ రేగా కాంతారావు
పద్మశ్రీ సకిని రామచంద్రయ్యకి అభినందనలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత కనుమరుగు అయ్యే కళలు, జాతులను గుర్తించి పద్మశ్రీ వంటి వాటితో గుర్తించడం గొప్ప విషయం. మా సంస్కృతి దోపిడికి గురి అవుతున్న సమయంలో ఈ ప్రభుత్వం వారిని కాపాడే గొప్ప నిర్ణయాలు తీసుకుంటోంది. పాఠశాలల్లో ఇటువంటి కళలను ప్రోత్సహిస్తాం అనడం నిజంగా గొప్ప విషయం. ఇలవేల్పుల జాతరకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే మరింత గొప్పగా జరుగుతాయి. మేడారం జాతరలో రామచంద్రయ్య ప్రతి సారి ఆ చరిత్ర చెబుతుంటారు. కాబట్టి ఈ కళను, జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, పద్మశ్రీ రామచంద్రయ్య కొడుకు బాబురావు, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సర్వేశ్వర్ రెడ్డి, సత్యనారాయణ, కళ్యాణ్ రెడ్డి, సీతారాం నాయక్, శంకర్ రావు, లక్ష్మీ ప్రసాద్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.