Suryaa.co.in

Editorial

కేసీఆర్ వద్దకు ‘గ్రేటర్’ పార్టీ పంచాయతీ!

– ‘సరిహద్దు’ సమస్యలతో ఆగిన ప్రకటన
– జిల్లా స్థాయి కావాలని కొందరు, గ్రేటర్ పరిథిపై ఇంకొందరు
– కేటీఆర్‌కూ సాధ్యం కాక కేసీఆర్ వద్దకు పంచాయతీ
– పెండింగ్‌లోనే టీఆర్‌ఎస్ గ్రేటర్-జిల్లా పంచాయతీ
– ఇప్పటిదాకా రాజధానిలో కార్యాలయం, కమిటీ లేని అధికార పార్టీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
అధికార టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్న గ్రేటర్-హైదరాబాద్ జిల్లా పరిథి కమిటీ పంచాయతీ.. చివరకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వద్దకు చేరింది. చాలాకాలం నుంచి రాజధాని నగరానికి కమిటీలేని టీఆర్‌ఎస్, ఇటీవలే సంస్థాగతంగా స్థానిక ఎన్నికలు పూర్తి చేసుకుంది. అయితే, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కమిటీగా ఉండాలా? లేక హైదరాబాద్ జిల్లా కమిటీని ఏర్పాటుచేయాలా? అన్న పీటముడి పడటంతో దానిపై పార్టీ నాయకత్వం స్పష్టతకు రాలేకపోతోంది.
హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, పాతబస్తీలో మజ్లిస్ ఎమ్మెల్యేలు మినహా, మిగిలిన అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకూ హైదరాబాద్ నగరంలో మిగిలిన పార్టీల మాదిరిగా నగర పార్టీకి ఒక కార్యాలయం లేని దుస్థితి కార్యకర్తలను విస్మయపరుస్తోంది. పార్టీ స్థాపించిన తొలినాళ్ల కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలోనే, రాష్ట్ర పార్టీతో పాటు నగర పార్టీ కార్యాలయం కూడా కొన్నాళ్లు కొనసాగింది. ఆ తర్వాత ఎం.సుదర్శన్‌రావు, పద్మారావు, దాసోజు శ్రవణ్, కట్టెల శ్రీనివాసయాదవ్, మైనంపల్లి హన్మంతరావు నగర అధ్యక్షులుగా పనిచేశారు.
వీరిలో సుదర్శన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొద్దిరోజుల ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద సిటీ ఆఫీసు ఏర్పాటుచేశారు. ఆ తర్వాత పద్మారావు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హిమాయత్‌నగర్‌లో ప్రభుత్వ స్థలం చూసినప్పటికీ, ఏ కారణం వల్లనో ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. దివంగత నేత ఆలె నరేంద్ర టీఆర్‌ఎస్‌లో ఉండగా, కొంతకాలం ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి నగర పార్టీ కార్యకలాపాలు నడిచాయి. పార్టీ స్థాపించిన తర్వాత ఇద్దరు కార్పొరేటర్లతో మొదలైన పార్టీ ప్రస్థానం.. ఇప్పుడు నగరంలో మెజారిటీ ఎమ్మెల్యేలు చేజిక్కించుకునే స్థాయికి ఎదిగినప్పటికీ, ఇప్పటివరకూ నగర పార్టీకి సొంత కార్యాలయంపై ఒక్క నగర అధ్యక్షుడు కూడా దృష్టి సారించకపోవడమే ఆశ్చర్యం.
నిజానికి టీఆర్‌ఎస్ స్థాపించిన తొలినాళ్లలో హైదరాబాద్ నగరంలో పార్టీ బలహీనంగా ఉండేది. అప్పట్లో ఎంసీహెచ్‌లో పద్మారావు, యాదయ్య ఇద్దరే కార్పొరేటర్లుగా ఉండేవారు. సుదర్శన్, పద్మారావు, శోభన్‌రెడ్డి వంటి అగ్రనేతలతోపాటు టీడీపీ నుంచి చేరిన కొద్దిమంది నేతలు ఉన్నప్పటికీ, పార్టీ నాయకత్వం కూడా హైదరాబాద్‌పై పెద్దగా దృష్టి సారించలేదు. నగరంలో బహిరంగసభ నిర్వహించినప్పడు మాత్రం కేసీఆర్, పద్మారావును పిలిచి ఆ బాధ్యత అప్పగించేవారు. నగరంలో చాలామంది అధ్యక్షులుగా పనిచేసినప్పటికీ, మిగిలిన కమిటీలు మాత్రం ఎవరూ వేయలేకపోయారు. ఇప్పటికీ సంస్థాగతంగా నిర్మాణాత్మక కమిటీలు లేకపోవడం మరో విశేషం.
కాగా, ప్రస్తుతం టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికలు ముగిసినందున, ఇక నగర స్థాయి కమిటీ ఏర్పాటుపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఆ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్- మంత్రి కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్- ఎంపీ కేశవరావు జలవిహార్‌లో గత నెలలో నగర పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిథిని కలిపి గ్రేటర్ కమిటీని ఏర్పాటుచేయాలా? లేక హైదరాబాద్ జిల్లాలోని రెవిన్యూ మండలాలను కలిపి, హైదరాబాద్ జిల్లా కమిటీగా ఏర్పాటుచేయాలా? అన్న అంశంపై అభిప్రాయ సేకరణ నిర్వహించారు.
talasani-padmaraoఅందులో జీహెచ్‌ఎంసీ పరిథిని పరిగణనలోకి తీసుకొని, గ్రేటర్ కమిటీని ఏర్పాటుచేయాలని కొందరు సూచించారు. మరికొందరు మాత్రం హైదరాబాద్ రెవిన్యూ మండలాలను పరిగణనలోకి తీసుకుని, హైదరాబాద్ జిల్లా కమిటీ ఏర్పాటుచేయాలని సూచించారు. ఆ మేరకు ఎవరికి అనుకూలంగా వారు తమ గళం వినిపించారు. కానీ పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు జీహెచ్‌ఎంసీ పరిథిని పరిగణనలోకి తీసుకుని, గ్రేటర్ హైదరాబాద్ కమిటీని ఏర్పాటుచేయడమే సముచితంగా ఉంటుందని కేటీఆర్‌కు సూచించినట్లు సమాచారం.
అదే సమయంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాత్రం, హైదరాబాద్ రెవిన్యూ మండలాల పరిథిని పరిగణనలోకి తీసుకుని, హైదరాబాద్ జిల్లా కమిటీ ఏర్పాటుచేయాలని కేటీఆర్‌కు సూచించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిథిలో అయితే రంగారెడ్డి జిల్లా కూడా వస్తుంది కాబట్టి, హైదరాబాద్ జిల్లా అయినందున, జిల్లానే యూనిట్‌గా తీసుకోవాలన్నది తలసాని అభిప్రాయంగా పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే గంటలపాటు చర్చించినప్పటీ, పార్టీ కమిటీపై ఏకాభిప్రాయం రాకపోవడంతో.. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతామని కేటీఆర్, కేకే ఆ సమావేశంలో చెప్పాల్సి వచ్చింది.
మధ్యేమార్గంగా పార్లమెంటు పార్టీ కమిటీలు?
అయితే.. ఎమ్మెల్యేలు, సీనియర్లు మాత్రం మధ్యే మార్గంగా లోక్‌సభ పార్లమెంటు పార్టీ కమిటీని ఏర్పాటుచేస్తే ఎలాంటి వివాదం ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, టీడీపీ కూడా లోక్‌సభ నియోజకవర్గ కమిటీనే ఏర్పాటుచేసినందున, టీఆర్‌ఎస్ కూడా ఆ విధానాన్నే పాటిస్తే చాలామందికి పార్టీలో అవకాశాలు కల్పించవచ్చని సూచిస్తున్నారు. అప్పుడు హైదరాబాద్-సికింద్రాబాద్ కమిటీలు ఏర్పాటుచేసుకునే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు. మరి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

LEAVE A RESPONSE