Suryaa.co.in

Andhra Pradesh

రెవిన్యూ సమస్యలు పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్

-ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా రెవిన్యూ సేవలు
-రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్

అమరావతి, జూన్ 26 : ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడంలో రెవిన్యూ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆదేశించారు.

ప్రతి వ్యక్తికి జననం నుండి మరణం వరకూ పలు రకాల సేవలు అందజేయడంలో కీలక పాత్ర పోషించే రెవిన్యూ అధికారులు, ఉద్యోగులు ఎంతో ఓర్పు, నేర్పుతో ప్రజలకు సేవచేయడం వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే విషయాన్ని రెవిన్యూ ఉద్యోగులు అంతా గుర్తించాలన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై పలు ప్రాధాన్యతా అంశాల అమలుతీరును సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రెవిన్యూ అంశాలకు సంబంధించి ప్రజలు ఎక్కువగా సమస్యలను, ఇబ్బందులకు ఎదుర్కోవడం జరుగుతుంటుందన్నారు. అసలు ఎటు వంటి అంశాలు, సందర్బాల్లో ప్రజలు సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందనే విషయాన్ని రెవిన్యూ అధికారులు ముందుగానే గుర్తించి, వాటి శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన ఆదేశించారు.

రెవిన్యూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రీవెన్సు సెల్ ను కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా రెవిన్యూ శాఖలోని మంచి అనుభవం గల అధికారులు తగు సూచనలు, సలహాలు అందజేయాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో అమలు చేయబడుచున్న డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం, రీ సర్వే, రీసర్వే గ్రామాల్లోని ఫైనల్ రికార్డుల స్థితిగతులు, న్యూ సిటిజన్ సర్వీసెస్ అమలు, రెవిన్యూ అధికారులకు అందజేసే సర్వే శిక్షణ, కుల దృవీకరణ పత్రాల సత్వర జారీకై అనుసరిస్తున్న విధి విధానాలు మరియు ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న పలు ముఖ్యమైన ఫైల్స్ స్థితి గతులు తదితర అంశాలపై సీసీఎల్ఏ జి సాయిప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.

రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, సీసీఎల్ఏ జి సాయిప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ తదితరులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE