– ముగ్గురు మంత్రులు, కేంద్రమంత్రి ఉన్నా మౌనరాగం
– లోకేష్, నాదెండ్ల, అనగాని, కేంద్రమంత్రి పెమ్మసాని ప్రాతినిధ్యం
– అయినా ఇంకా పెండింగ్‌లో గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ పదవి
– ఏకాభిప్రాయం సాధ్యం కాకనే పెండింగ్‌లో పెట్టారా?
– కూటమి వచ్చి ఏడాదిన్నరయినా ఇంకా చైర్మన్ ను నియమించుకోలేని దుస్థితి
– తాజా నామినేటెడ్ జాబితాలోనూ కనిపించని పేరు
– నిరాశలో గుంటూరు జిల్లా తమ్ముళ్లు
(అన్వేష్)
మిర్చి యార్డ్ చైర్మన్ ఎంపిక ఎప్పుడు? టిడిపికి అండగా ఉన్న గుంటూరు లో ప్రాధాన్యం ఉన్న మిర్చి యార్డ్ చైర్మన్ పై ఎందుకు ఆలస్యం? రాష్ట్ర మంత్రివర్గంలో లోకేష్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. మిర్చి యార్డు చైర్మన్ పదవి ఎందుకు భర్తీ చేయడం లేదు? ఇది ఎవరి వైఫల్యం? జిల్లా నాయకత్వానిదా? మంత్రులు, ఎమ్మెల్యేలదా? జిల్లా పార్టీ జోనల్ ఇన్చార్జిదా? జిల్లా ఇన్చార్జి మంత్రిదా? ఉమ్మడి జిల్లాలో టిడిపి సీనియర్, జూనియర్ నేతల మధ్య సఖ్యత లోపమా? .. ఇదీ ఇప్పుడు గుంటూరు జిల్లా తెలుగు తమ్ముళ్లలో జరుగుతున్న హాట్ టాపిక్.
కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది. రాష్ట్రంలోనే అత్యధిక ప్రాధాన్యం ఉన్న మిర్చి యార్డ్ చైర్మన్ ఎంపిక చేయకపోవడంపై టిడిపి వర్గాలలో అసహనం-అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆసియా లోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డ్ గుంటూరు మార్కెట్ యార్డ్, ఇక్కడ కోట్ల రూపాయల మిర్చి క్రయవిక్రయాలు జరుగుతుంటాయి.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర,కర్ణాటక నుండి కూడా ఇక్కడ మిర్చి యార్డుకు వస్తుంటాయి. అలాంటి ఎంతో ప్రాధాన్యత కలిగిన మిర్చి యార్డ్ చైర్మన్ పదవికి ఎవరినీ ఎంపిక చేయకపోవడం ఏమిటని పార్టీలో సీనియర్లు అసహన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మిర్చి యార్డ్ కార్యదర్శి నిర్వహణలో నడుస్తుంది. ఇక్కడ కోట్ల రూపాయలు వ్యాపారం జరిగి, రైతులకు మేలు జరిగే మిర్చి యార్డు చైర్మన్ నియామకం లో తెలుగుదేశం అధిష్టానం- జిల్లా నాయకత్వం ఎందుకు దృష్టి సారించడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీరి మధ్య సఖ్యత లోపమా? అధిష్టానం నిర్ణయంలో జాప్యమా అన్నది అర్థం కాని ప్రశ్నగా ఉంది.
మిర్చి యార్డ్ చైర్మన్ పదవీకాలం రెండేళ్ల పాటు కొనసాగుతుంది. ఇప్పటికే కూటమి ఏర్పడి 15 నెలలు అయింది. పార్టీ కోసం కష్టపడిన ఎవరో ఒక నాయకుడికి ఆ పదవి ఇచ్చి ఉంటే, ఈపాటికి ఏడాదిన్నర పదవీకాలం ముగిసేది. మరో ఆరునెలల తర్వాత మరో సీనియర్‌కు అవకాశం వచ్చి ఉండేదని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. నాయకత్వం ఆ కోణంలో ఆలోచించకపోవడమే వింతగా ఉందంటున్నారు.
తెలుగుదేశంలో పార్టీ కోసం కష్టపడి ఎన్నికల్లో పనిచేసిన గుంటూరు జిల్లాలో ఉద్దండుల అనేకమంది ఉన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశానికి రాజకీయ చైతన్యవంతమైనది. అలాంటి జిల్లా కేంద్రంలో ఉన్న కీలకమైన మిర్చి యార్డ్ చైర్మన్ పదవికి ఎందుకు ఎంపిక చేయలేదని కేడర్‌లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని శాసనసభ్యులు పార్టీ సీనియర్ నాయకులు సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఎంపిక చేయాల్సి ఉంది. దీనిపై అధిష్టానం కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రిగా ఈ జిల్లా వ్యక్తి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరో మం త్రి అనగాని, జనసేన కీలక నేత, మం త్రి నాదెండ్ల మనోహర్ కూడా గుంటూరులోనే ఉన్నారు.
ఇలాంటి అనేకమంది కీలకమైన ఉద్దండులు ఉన్న గుంటూరు మిర్చి ఘాటు పార్టీకి తాకకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మిర్చి యార్డ్ చైర్మన్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. వీరిలో వెన్నా సాంబశివరెడ్డి, సుఖవాసి శ్రీనివాస్, ముత్తినేని రాజేష్, కనపర్తి శ్రీనివాసరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్, ఉగ్గిరాల సీతారామయ్య, జాగర్లమూడి శ్రీనివాసరావు, గోళ్ళ ప్రభాకర్, కసుకుర్తి హనుమంతరావు తదితరుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
అయితే బీసీలకు అవకాశం ఇస్తే వెంకటేష్ యాదవ్ తనకి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కాపులకు అవకాశం ఇస్తే తనకు అవకాశం ఇవ్వాలని సీతారామయ్య పట్టుబడుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే దాదాపు అరడజన మంది క్యూలో ఉన్నారు. ఇదిలా ఉంటే జనసేన కూడా మిర్చి యార్డ్ పై కన్నేసింది. కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పేరు కూడా తెరపైకి వచ్చింది. బిజెపి నుండి వల్లూరి జయప్రకాష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
ఇలా మిర్చి యార్డ్ చైర్మన్ కోసం పలువురు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. పార్టీ కష్ట కాలంలో పనిచేసిన సీనియర్ నాయకులు వెన్నా సాంబశివారెడ్డి గత తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం నెల రోజులు మాత్రమే మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కొనసాగారు. ఆర్థికంగా నష్టపోయి, పార్టీ కష్టకాలంలో పనిచేసిన వెన్నా సాంబశివరెడ్డి మిర్చి యార్డ్ చైర్మన్ తిరిగి తనకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
గత వైసీపీ ఫార్ములా లో బీసీలకు అవకాశం ఇస్తే బీసీ అభ్యర్థిని చైర్మన్ గా ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు. గత వైసీపీ రెండుసార్లు చైర్మన్ గా చంద్రగిరి ఏసురత్నం, నిమ్మకాయల ఆదినారాయణ ఎంపిక చేసి బీసీలకు పెద్దపీట వేసింది. అదేవిధంగా తెలుగుదేశం కూడా బీసీలకు అవకాశం ఇస్తుందా? ఓసి లకు అవకాశం ఇస్తుందా చూడాలి. పట్టున్న గుంటూరు జిల్లాలో ఎందుకు ఇలా పట్టుకోల్పోతున్నాము? సమన్వయం చేయలేక నాయకులు మధ్య సఖ్యత ఎందుకు కొరవడిందని పలువురు వాపోతున్నారు. కీలకమైన మిర్చి యార్డు చైర్మన్ ఎంపిక 15 నెలలు అవుతున్న ఎందుకు జరగలేదని, ముఖ్యంగా లోకేష్ ఉన్న ఈ జిల్లాలో ఈ పదవిపై దృష్టి సారించకపోవడం ఏమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎందుకంత తాత్సరం చేస్తున్నారు? అధికారం కోసం ఎన్నికల్లో కష్టపడ్డా నాయకులకు ఇంకెప్పుడు న్యాయం చేస్తారని తమ్ముళ్లు రుసరులాడుతున్నారు. ఇప్పటికైనా కీలకమైన గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవి ఎంపికపై అధిష్టానం కసరత్తు చేసి వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
‘‘మేం అధికారంలోకి వచ్చి 15 నెలలయింది. ఒక మిర్చి యార్డు చైర్మన్ పదవినే భర్తీ చేసుకోలేకపోయాం. అదే జగన్‌ను చూడండి. రెంటు టర్ముల్లో వెంటవెంటనే ఇద్దరిని నియమించారు. మేం మాత్రం ఇంకా అభిప్రాయసేకరణ, ఐవిఆర్ఎస్, సర్వేల పేరిట కాలయాపన చేస్తుంది. ఈసారి అధికారంలోకి వస్తేనన్నా నాయకత్వం ధోరణి మారుతుందని ఆశించాం. మా నాయకత్వం మారలేదు. మారుతుందని ఆశించడం కూడా అత్యాశే.
అసలు ఈపాటికే ఒక విడత నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తే, ఒక టర్ములో వందలమందికి పదవి వచ్చి నేతలు సంతృప్తి పడేవారు. అప్పుడు వైఎస్, జగన్ చేసింది అదే కదా? నాయకులు గుర్తింపు, గౌరవం కోరుకుంటారు. అది లేకపోతే మనస్ఫూర్తిగా ఎందుకు పనిచేస్తారు? అంతా పనిచేస్తున్నట్లు నటిస్తారు తప్ప చిత్తశుద్ధితో ఎందుకు పనిచేస్తారు? మరో ఏడాది తర్వాత పదవులు ఇచ్చినా ఎవరూ తీసుకోరు. ఎన్నికలకు ఏడాది ముందు పదవులిస్తే ఏం ప్రయోజనం?
పార్టీకి పనిచేసేవారిని గుర్తించి వారి స్థాయిలో గౌరవించాలన్న మనసు లేకపోతే ఎలా? జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే బడ్జెట్ కదా? మరి ఆయన అన్ని నామినేటెడ్ పదవులను పెండింగ్‌లో ఉంచకుండా, వెంటవెంటనే ఎందుకు భర్తీ చేశారు? ఎంతమందికి సలహాదారు పదవులిచ్చారు? కార్పొరేషన్ల ద్వారా ఎన్ని వందలమంది కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చారు? ఇవ్వాలన్న మనసు- ఆలోచన ఉంటే ఏదైనా సాధ్యమే’’ అని జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
మరి జిల్లా ఇన్చార్చి మంత్రులు, జోనల్ ఇన్చార్జులు, పరిశీలకులు, బ్యాక్ ఆఫీసు టీములు, సర్వే టీములు ఇన్ని ఉండి ఏం చేస్తున్నట్లు? వారిచ్చే నివేదికలు ఎందుకు? ఎన్టీఆర్ హయాంతోపాటు.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇలా జరిగిందా? అప్పట్లో జిల్లా నాయకత్వాలు, నాయకులు బలంగా ఉండేవాళ్లు. వాళ్లే బాధ్యత తీసుకునేవాళ్లు. మరిప్పుడు అంత బలమైన నాయకులేరీ? జిల్లా నాయకత్వాలు ఏవీ?
అసలు జిల్లా సమన్వయకర్తలు, జోనల్ ఇన్చార్జుల వయసెంత? వారి అనుభవమెంత? వారికి జిల్లా పార్టీ సమస్యలు పరిష్కరించే సత్తా ఉందా? అసలు అప్పటిలా పార్టీలో పొలిటికల్ కో ఆర్డినేషన్, సమిష్టి నిర్ణయాలు, చర్చల వాతావరణం ఏదీ? సబ్ జూనియర్లు, రాజకీయాలు తెలియని వారి ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని మేం ఏనాడూ అనుకోలేద’’ని మరో సీనియర్ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.