-చంద్రబాబును, లోకేష్ ను విమర్శించే స్థాయి బొల్లాకు లేదు
-వైసిపి రివర్స్ పాలనతో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కు
-కాకి లెక్కలతో వైజాగ్ సమ్మిట్
-పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు
వినుకొండ: రాజకీయ స్వార్థం కోసం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎన్నికలకు ముందు వినుకొండలోని ప్రతి కుల సంఘానికి 3 నుంచి 5 ఎకరాలు పొలం ఇస్తానని నమ్మించి గద్దనెక్కాక అన్ని సంఘాల వారిని మోసం చేశాడని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు విమర్శించారు. గురువారం టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల సంఘాలతో పాటు వినుకొండ జర్నలిస్టులకు స్థానిక ఎన్ఎస్పీ కాలనీలో ఇళ్ల స్థలాలు ఇస్తానని నమ్మించి నేడు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో నీటి సౌకర్యం లేని రాలగొట్టను ఇళ్ల స్థలాలుగా ఇస్తానని మోసం చేస్తూ మరోవైపు ప్రతిపక్ష నాయకుని పై బురద చల్లడం దుర్మార్గమన్నారు. విలేకరులకు చిత్తశుద్ధితో ఇళ్ల స్థలాలు ఇవ్వడం చేతగాక అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష నాయకుని పై బురద చల్లడం అవివేకమన్నారు.
పట్టణంలో అనధికారిక చర్యలకు పాల్పడుతూ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ మీ స్థలాలకు విలువలు పెంచుకుంటూ కోట్ల రూపాయలు దోచుకుంటూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. పట్టణ పేద ప్రజలకు ఇళ్లస్థలాలు ఇస్తానని ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మి 18 కోట్లు దోచుకొని ఐదు వేలమంది పేదలను దగా చేసావని విమర్శించారు. పట్టణ శాశ్వత త్రాగునీటి పథకానికి 1509 కోట్లు, గ్రామీణ శాశ్వత త్రాగునీటి పథకానికి 259 కోట్లు నిధులు తెస్తే నాలుగేళ్ల పాలనలో పథకాలను పూర్తి చేయలేని అసమర్ధ ఎమ్మెల్యే అని ఆయన ఎద్దేవా చేశారు. పట్టణ పేదలకు 4 వేల టిట్కో ఇల్లు తెచ్చి ఫేస్ వన్ ద్వారా 90 శాతం పూర్తి చేస్తే నేటికీ లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వం అన్నారు.
ఇసుక ,మద్యం, మట్టి మాఫియాలతో కోట్ల రూపాయల సొత్తును దోచుకోవటమే కానీ అభివృద్ధి మచ్చుకైనా లేదన్నారు.టిడిపి హయాంలో నియోజకవర్గంలోని 150 గ్రామాల్లో సిసి రోడ్లు తాము వేశామని వైసిపి ప్రభుత్వానికి చేతనైతే సైడ్ కాలువలు నిర్మించి సమర్థతను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. శావల్యాపురం మండలం గంటా వారి పాలెం నూజెండ్ల పార్కులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలను, జూనియర్ కాలేజీ గ్రౌండ్లో శివశక్తి బలలను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు ధ్వంసం చేయడం సిగ్గుచేటు అన్నారు.
పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజలపై రైతులపై అక్రమ కేసులు మానుకొని అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అభివృద్ధి చేయటం చేతగాని అసమర్ధ ఎమ్మెల్యే టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబులను విమర్శించే స్థాయి బొల్లా బ్రహ్మనాయుడు కు లేదన్నారు. జరిగిన సమ్మిట్ కాకి లెక్కల కే పరిమితమని విమర్శించారు.