– ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రతిపాదన
– కేంద్ర మంత్రి అర్జున ముండా సానుకూలంగా స్పందన
నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏకలవ్య మోడ్రన్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) స్కూల్ మరియు ఆధునిక క్రీడా ప్రాంగణాన్ని మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున ముండాకు లేఖ రాశారు. గుంటూరు జిల్లా జనాభాలో 5% గిరిజనులు ప్రధానంగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్రీకృతమై ఉన్నారని నరసింహారావు తన లేఖలో ఉద్ఘాటించారు.
ఆంధ్రప్రదేశ్‌కు 28 ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ నరసరావుపేట-పలనాడు ప్రాంతానికి ఒక్కటీ కేటాయించలేదన్నారు. నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో గిరిజన విద్యార్థుల నాణ్యమైన విద్య, క్రీడల అభివృద్ధికి ఒక ఏకలవ్య పాఠశాల, ఒక ఆధునిక క్రీడా ప్రాంగణాన్ని మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖపై కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున ముండా స్పందిస్తూ, బ్లాక్ జనాభాలో కనీసం 50 శాతం గిరిజనులై, కనీసం 20 వేల గిరిజన జనాభాలో ఉండాలనే నిబంధనతో ప్రస్తుతం ఏకలవ్య పాఠశాలను నరసరావుపేట-పల్నాడు ప్రాంతంలో మంజూరు చేయలేమని కేంద్ర గిరిజన శాఖ మంత్రి తెలిపారు. అయితే, ఈ మార్గదర్శకాలను సమీప భవిష్యత్తులో సవరించే అవకాశం ఉందని, ఆ సమయంలో నరసరావుపేట-పల్నాడు ప్రాంతానికి ఏకలవ్య పాఠశాలను మంజూరు చేస్తామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ EMRS పథకం కింద షెడ్యూల్డ్ తెగల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలన్న జీవీఎల్ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా శాఖ ద్వారా క్రీడా ప్రాంగణానికి ప్రతిపాదనలు పంపితే నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గంలో మంజూరు చేస్తామని తెలియజేశారు.
కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు, గిరిజన ప్రాబల్యం ఉన్న పల్నాడు-వినుకొండ ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాల, ఆధునిక క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చొరవ చూపుతామన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, ఏకలవ్య పాఠశాల, క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గంలో 2 లక్షల మందికి పైగా గిరిజనుల సంక్షేమం కోసం, ఈ ప్రాంతంలోని లక్ష మందికి పైగా గిరిజన యువత మానవాభివృద్ధికి కృషి చేస్తానని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.