– 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ కోసం ప్రయత్నం
– కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తో భేటీ
పుట్టి పెరిగిన ప్రాంతానికి న్యాయం చేసి, జన్మభూమి రుణం తీర్చుకునే పనిలో ఉన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు గుంటుపల్లి వెంకట నరసింహారావు. ఆయన తన నర్సరావుపేట లోక్‌సభ పరిథిలో.. అత్యంత వెనుకబడిన పల్నాడు ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. సాంకేతికంగా యుపికి చెందిన ఎంపీ అయినప్పటికీ.. ఏపీ సమస్యలపై మాట్లాడే జీవీఎల్ నరసింహారావు, తాజాగా పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతల మాటల దాడిని ఖండించారు. అటు అభివృద్ధి విషయంలోనూ జీవీఎల్ తన ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా పల్నాడులో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మించాల్సిందిగా, కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు.
రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మాత్యులు భూపేంద్ర యాదవ్ని కలిసి, ముందుగా నరేంద్ర మోడీ కి ఆంధ్రప్రదేశ్ పై గల ప్రత్యేక శ్రద్ధ మరియు అభివృద్ధి దార్శనికతకు నిదర్శనంగా ఇటీవల నూతనంగా 7 ఈఎస్ఐ (ESI) హాస్పటల్ లను, ఆంధ్రప్రదేశ్ కు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో ఒక దానిని నరసరావుపేట-పల్నాడు ప్రాంతంలో నిర్మించ వలసిందిగా కోరడం జరిగింది. దానివలన ప్రజారోగ్య విషయంలో అత్యంత వెనుకబడి నిర్లక్ష్యానికి గురైనటువంటి, నరసరావుపేట-పల్నాడు ప్రాంత ప్రజలకు అత్యంత ఉపయోగం మాత్రమే కాకుండా, ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రైవేటు రంగ శ్రామికులు, ఉద్యోగులు, పారిశ్రామిక ఉద్యోగులు మరియు ఈఎస్ఐ లబ్ధిదారులకు అత్యంత ఉపయుక్తమని,, అందువలన దానిని నరసరావుపేట పట్టణంలో లేదా పార్లమెంటు పరిధిలో ఏర్పరచవలసినదిగా అభ్యర్థిస్తూ, దానికి అవసరమైన స్థలమును కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించివలసిందిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రివర్యులను కోరడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన భూపేందర్ యాదవ్ , తగు చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర కార్మిక శాఖ అధికారులను వెంటనె ఆదేశించారు.
జీవీఎల్ అతి తక్కువ సమయంలోనే తన స్వస్థలమైన నరసరావుపేట-పల్నాడు ప్రాంత ప్రజలపై మరియు ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మరియు దృష్టిసారించి, అభివృద్ధి చెందిన మిగతా ప్రాంతాలకు దీటుగా అన్ని రంగాల్లోనూ నరసరావుపేట-పల్నాడు ప్రాంత ప్రజలు, రైతులు, విద్యార్థులు, ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగులు, ముందంజలో ఉండాలని కృతనిశ్చయంతో.. ఆ ప్రాంత రైల్వే స్టేషన్లు మరియు రహదారులు ప్రజారోగ్యం మరియు ఆ ప్రాంత రైతుల యొక్క అభివృద్ధికై కేంద్ర స్థాయిలో వీలైనన్ని ఎక్కువ సౌకర్యాలను నరసరావుపేట-పల్నాడు ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి కేటాయింప చేస్తున్నారు.