– చెరువు మధ్యలోకి వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ
– లైన్మెన్ సాహసానికి సర్వత్రా ప్రశంసలు
– భట్టి అభినందనలు
హైదరాబాద్: భారీ వర్షాలు, ఈదులుగాలుల సమయంలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, పవర్‌కట్ అవుతుండటం చూస్తుంటాం. కానీ సహజంగా ఆ ప్రకృతి బీభత్సం ముగిసిన తర్వాతనే విద్యుత్ పునరుద్ధరణ పనులు చేస్తుంటారు. దానికి నిర్ణీయ సమయం అంటూ ఏమీ ఉండదు. అలాంటిది.. చెరువునిండి, మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం సగానికి మునిగితే ఎవరైనా దానిని రిపేరు చేయడానికి సాహసిస్తారా?..
మామూలుగా అయితే ఎవరూ సాహసించరు. కానీ లైన్మెన్ హైముద్దీన్ నాకెందుకులే అనుకోలేదు. నడుముకు తాడు కట్టుకుని, చెరువు మధ్యలోకి వెళ్లి కరంట్ పోల్ ఎక్కి, తన ఉద్యోగ ధర్మం నిర్వర్తించాడు. ఇప్పుడు ఇది సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నా విద్యుత్ అంతరాయం కలగకుండా సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. చెట్లు, స్తంభాలు నేలకొరగడంతో వైర్లు తెగిపడినా గంటల్లో బాగు చేస్తున్నారు. తాజాగా సిద్దిపేటలోని నాగసముద్రం చెరువు మధ్యలో తెగిపోయిన లైన్‌ను పునరుద్ధరించేందుకు లైన్మెన్ హైముద్దీన్ సాహసం చేశారు. తాడు సాయంతో చెరువు మధ్యలోకి వెళ్లి స్తంభం ఎక్కి కనెక్షన్ ఇచ్చారు.
భట్టి అభినందనలు
భారీ వ ర్షాలతో చెరువు నిండినప్పటికీ తన ప్రాణాలు ఏమాత్రం లెక్కచేయకుండా, విద్యుత్ పునరుద్ధరణకు నడుంబిగించిన లైన్మెన్ హైముద్దున్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు. హైముద్దీన్ అంకితభావంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇది తమ ప్రభుత్వ ఉద్యోగుల చిత్తశుద్ధి, ప్రజాసేవకు నిదర్శనమని భట్టి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.