• ఇప్పటి వరకు రూ. 50 లక్షల చేనేత వస్త్రాల అమ్మకాలు
• నగర ప్రజల నుంచి విశేష ఆదరణకు ధన్యవాదాలు
• చేనేతలకు ప్రభుత్వం అవసరమైన సహకారాన్ని అందిస్తున్నది.
• ఆదివారంతో ముగియనున్న చేనేత ఎగ్జిబిషన్
విజయవాడ: చేనేత ఎగ్జిబిషన్ కు విశేష ఆదరణ లభించడం హర్షనీయమని రాష్ట్ర చేనేత, జౌళీ శాఖ కమిషనర్ రేఖారాణి అన్నారు. విజయవాడ పట్టణంలోని శేషసాయి కళ్యాణమండపంలో ప్రదర్శిస్తున్న చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాల్స్ ను శనివారం అధిక సంఖ్యలో ప్రజలు సందర్శించారని చేనేత, జౌళీ శాఖ కమిషనర్ రేఖారాణి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా చేనేత, జౌళీ శాఖ కమిషనర్ రేఖారాణి మాట్లాడుతూ నగర ప్రజల ఆదరణతో ఇప్పటి వరకు రూ. 50లక్షల అమ్మకాలు జరగాయని, అందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆదివారంతో చేనేత ఎగ్జిబిషన్ ముగియనుందని, పట్టణ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ అందుబాటు ధరలో మన్నికైన చేనేత వస్త్రాలు ఎగ్జిబిషన్ లో ప్రదర్శనలో ఉన్నాయన్నారు.
ఈ ఎగ్జిబిషన్ లో రాష్ట్రానికి చెందిన పొందూరు, ఉప్పాడ, అంగర, పులగర్త, బందరు, మంగళగిరి చీరలు మరియు డ్రెస్ మిటిరీయల్స్, చీరాల చీరలు, డ్రెస్ మెటీరీయల్స్, వెంకటగిరి, ధర్మవరం, మదనపల్లి, ఎమ్మిగనూరు, గద్వాల్, కాంచీపురం, పోచంపల్లి, చీరల స్టాల్స్, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, జమ్మూకాశ్మీర్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లకు చెందిన 89 స్టాల్స్ ప్రదర్శనలో ఉన్నాయన్నారు.
ప్రతీ ఒక్కరూ చేనేత వస్త్రాలను ఆదరించాలని ఆమె పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాల అమ్మకాల ప్రోత్సాహకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. నేతన్నలకు ఏడాదిపాటు పని కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక పధకాలు అమలు చేస్తున్నదన్నారు. చేనేత వస్త్రాలకు మరింత మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి అన్నారు.