Suryaa.co.in

Telangana

ఎస్సీ హాస్టల్లో రాత్రి బస చేసిన యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి: విద్యార్థులకు అందించే భోజన విషయంలో రుచి , శుచి, శుభ్రత పాటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం నారాయణపూర్ మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్( ప్రీమెట్రిక్ )విద్యార్థులతో కలిసి రాత్రి బస చేశారు. సాయంత్రం ఐదు గంటలకు హాస్టల్ కు చేరుకున్న కలెక్టర్..విద్యార్థులను పలకరించి వారికి అందిస్తున్న భోజనం, రోజువారి దినచర్య గురించి కలెక్టర్ ఆరా తీశారు.హాస్టల్ పరిసరాలను, వంట గదిని, పిల్లలు చదువుతున్న విధానాన్ని, కూరగాయలను, రోజు వారి మెనూను , విద్యార్థులు ఉండే గదులను, మరుగు దొడ్లను కలెక్టర్ పరిశీలించారు.

వంట గది ని కలెక్టర్ పరిశీలించారు. వంట తయారు చేసే విధానాన్ని కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు.అనంతరం విద్యార్థులతో కలిసి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించి, స్టోర్ రూం లో ఉన్న కందిపప్పు, బియ్యం , చింతపండు, కారం , ఉప్పు, గుడ్లు, కూరగాయలు తదితర వంట సరుకులను కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. నాసిరకం బియ్యం,కూరగాయలు , ఇతర ఆహార పదార్థాలు సరఫరా చేసినట్లయితే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, నాణ్యమైన సరుకులు మాత్రమే వాడాలని నాణ్యమైన సరుకులు వాడని పక్షంలో చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

విద్యార్థులకు అందించే భోజన విషయంలో నిరక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని , ఏ చిన్న ఫిర్యాదు వచ్చిన ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.ఎక్కువ కాలం నిల్వ ఉంచిన , పురుగుపట్టి తేది అయిపోయిన సరుకులను ఉపయోగించరాదని, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. వంటకు వాడే నీటిని ట్యాంక్ నుండి వాడుతున్నారా లేదా ఆర్ ఓ వాటర్ ప్లాంట్ నుండి నీటిని వాడుతున్నారా అని ఆరా తీశారు.

అనంతరం విద్యార్థులతో భోజనం చేస్తూ వారి విద్య విధానంలో ఎదురవుతున్న సమస్యలు , వాటి పరిష్కారానికి కావలసిన సలహాలు ,సూచనలు విద్యార్థులకు వివరించారు.విద్యార్థులతో మమేకం అయ్యి వారి అభ్యాసన సామర్థ్యాలను రాబట్టారు .రోజు ఉదయం ఎన్ని గంటలకు లేస్తున్నారు? మీ దిన చర్య ఏంటి? ఎంత మంది మీలో 10/10 జి పి ఏ సాధిస్తారు? అని కలెక్టర్ విద్యార్థులను అడిగారు. బాగా చదుతున్నమని, 10/10 జిపిఏ సాధిస్తామని కలెక్టర్ తెలిపారు.

సిలబస్ ను సకాలంలో పూర్తి చేయాలనీ, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పదవ తరగతిలో ఈసారి 100% ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులందరికీ కలెక్టర్ ఆల్ ద బెస్ట్ అని తెలిపారు.విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని విద్యార్థులకు సూచించారు.మంచిగా చదువుకుంటేనే భవిష్యత్ ను ఉన్నతంగా తీర్చి దిద్దుకోవచ్చునని, ఉన్నత స్థానాలను అధిరోహించి, మీ తల్లిదండ్రులకు, మీ ఊరికి మంచి పేరు తీసుకొని రావాలని హిత బోధ చేశారు.

మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారని,వారి కలలను నిజం చేసి భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవ్వాలని కలెక్టర్ అన్నారు.విద్యార్థులకు చదువు అందించడంతోపాటు వారి ఆరోగ్యం పట్ల కూడా అలర్ట్ గా ఉండాలన్నారు.తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుతున్న నిరుపేద విద్యార్థులను మన బిడ్డలుగా భావించి వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తించాలన్నారు. సిబ్బంది మరియు విద్యార్థుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు.

చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు దుప్పట్లను, కుర్చీలను కలెక్టర్ పంపిణీ చేయడం జరిగింది. నాణ్యత ప్రమాణలను పాటిస్తూ , మంచి రుచి కరమై భోజనం పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వార్డెన్ లు తప్పనిసరిగా హాస్టల్ లోనే ఉండాలన్నారు. హాస్టల్ కి రాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి హాస్టల్ కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డి,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE