– పీ-4 కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు టార్గెట్లు దారుణం
– ఉద్యోగ, ఉపాధ్యాయులతో బలవంతంగా దత్తత కార్యక్రమాలు
– కలెక్టర్ల పేరుతో దత్తత ఉత్వర్వులు సరికాదు
– ఇదెక్కడి సాంప్రదాయం?
– ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్ఆర్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి.
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా ప్రజలకిచ్చిన హామీల అమల్లో పూర్తిగా వైఫల్యం కావడంతో.. దాన్నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు రకరకాల డైవర్షన్ కార్యక్రమాలకు తెరతీస్తోందని వైయస్సార్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ఉపాధ్యాయ, ఉద్యోగులకివ్వాల్సిన బకాయిలు చెల్లింపుపై మాట్లాడని ప్రభుత్వం… పీ-4 పేరుతో పేదకుటుంబాలను దత్తత కోసం టార్గెట్ లు విధించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
హామీలు అమలు చేయలేక- ఉద్యోగులకు టార్గెట్ లా.?
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇచ్చిన హామీలు అమల్లో విఫలమైంది. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా.. వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి, మర్చిపోయేటట్టు చేయడానికి ప్రభుత్వం డైవర్షన్ కు పాల్పడుతోంది. అందులో భాగంగా ఏ సంబంధం లేని ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను పీ-4 తో అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తోంది. గ్రామసచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పీ-4 పనిచేయిస్తూ… వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది.
అది మరింత శృతిమించి ఉపాధ్యాయులకు కాలపరిమితి విధించి.. పేదవారిని గుర్తించి వారిని దత్తత తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఒక్కో ప్రధాన ఉపాధ్యాయుడు కనీసం ఐదుమంది పేద కుటుంబాలను, స్కూల్ అసిస్టెంట్ రెండు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఓట్ల కోసం దొంగ హామీలిచ్చి ఇప్పుడు వాటి అమలు కోసం ఉపాధ్యాయ, ఉద్యోగుల మీద ఇలాంటివి నెట్టడం ఎంతవరకు భావ్యం.
ప్రభుత్వఉద్యోగులంటే చిన్నతరహా ఉద్యోగులు. ప్రభుత్వం 24 ప్రభుత్వ శాఖలను గుర్తించి.. వారికి కూడా ఈ పనులు అప్పగించారు. సంపన్నులను గుర్తించి వారి ద్వారా పేదకుటుంబాలను ఆర్దికంగా అభివృద్ధి చేయడానికి దత్తత తీసుకునే కాన్సెఫ్ట్ ను అమలు చేస్తున్నారు. అయితే చిన్నతరగతి ఉద్యోగులుగా ఉన్న ఉఫాధ్యాయులు ఎలా దత్తత తీసుకుంటారు.
వారి జీతాలే మీరు సక్రమంగా ఇవ్వడం లేదు. పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలు కూడా సకాలంలో ఇవ్వలేదు. పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేవు. ఇవాల ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.25వేల కోట్లు విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. వాళ్లకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకపోవడంతో అంతంత మాత్రంగా ఆర్ధికంగా ఉన్న వాళ్లపై దత్తత తీసుకోవాలని నిర్భంధ ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గం.
కలెక్టర్లు ఏ అధికారంతో ఇలా ఆదేశాలు జారీ చేస్తున్నారు? వాళ్లకు రావాల్సిన బకాయిలు కలెక్టర్లు ఇప్పిస్తున్నారా? ఇటీవల ప్రభుత్వం దాదాపు 50 వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేసింది. వారిలో చాలామందిని రిలీవ్ చేయడం లేదు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఉద్యోగులు రాక, బకాయిలు ఏళ్ల తరబడి ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంటే.. వాటి గురించి ప్రస్తావించడం లేదు.
ఎన్నికల్లో సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ప్రజలకు అబద్దపు హామీలిచ్చి… ఓట్లు వేయించుకుని ఇప్పుడా హామీలను అమలు చేయడం కోసం ఉద్యోగుల నోళ్లు కొట్టడం సరికాదు. గ్రామ సచివాలయ ఉద్యోగులను కూడా రెండేసి కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఉత్తర్వులివ్వడం సరికాదు.
ఉద్యోగులు తప్ప మరెవ్వరూ కనబడ్డం లేదా..?
సంపన్నులను, పారిశ్రామికవేత్తలను గుర్తించి వారి ద్వారా బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమం చేయమని ప్రభుత్వం చెబితే… కలెక్టర్లకు ఉద్యోగులు తప్ప మరెవ్వరూ కనబడ్డం లేదా? సంపన్నులు, పారిశ్రామిక వేత్తలును ఈ కార్యక్రమంలో పేదవాళ్ల కోసం ఉపయోగించుకుంటున్న ప్రభుత్వం.. భవిష్యత్తులో వాళ్లు ఏమైనా పొరపాట్లు చేస్తే కలెక్టర్లు ద్వారా వారికి మద్ధతునివ్వాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధం కాదా? మానవత్వం ఉన్న సంపన్నులు పేదవాళ్లను చదివించి, వారికి ఉద్యోగాలిప్పించడంతో పాటు వారి కుటుంబాలని పోషించిన ఘటనలు మనం కోకోల్లులుగా చూశాం. పీ-4 అనే కొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాస్తవానికి ఎవరైనా సంపన్నులు బీదవారిని ఆదుకుంటామని ముందుకొస్తే.. వారికి దత్తతనివ్వాలే తప్ప బలవంతంగా నువ్వు ఫలానా ఇన్ని కుటుంబాలను దత్తత తీసుకోమని ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పడం ఎంత వరకు సమంజసం?
సాకులు వెదుకుతున్న ప్రభుత్వం:
ప్రభుత్వం ఏది అడిగినా ప్రభుత్వం దాన్ని పీ-4తో ముడిపెడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 2 కోట్ల పై చిలుకు ఆడబిడ్డలకు ఎన్నికల్లో గెలిస్తే ప్రతి ఒక్కరికి రూ. 1500 ఆడబిడ్డ నిధి ఇస్తామని హామి ఇచ్చిన చంద్రబాబు…అది చేసే పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి సాకులు వెదుకుతోంది. కేవలం ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికే ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేస్తోందా ?
ఉద్యోగులను వేధిస్తే… ఆందోళన తథ్యం
ఇవాళ దేశంలో చాలామంది రుణాలు తీసుకుని ఎగరగొడుతున్నారు. దాదాపు 20 లక్షల మంది పేదవాళ్లను సాకడానికి సరిపోయే ధనం రావాల్సి ఉంది. తాజాగా అనిల్ అంబానీ నుంచి రూ.45వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. ఇలాంటి రుణాలను రాబట్టి పేదవాళ్లకు ఉపయోగించి వారి భవిష్యత్తును మార్చే కార్యక్రమం చేయండి. అంతేతప్ప ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక… ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఈ రకమైన ఒత్తిడి తీసుకువచ్చే ఆలోచన మానుకోవాలి.
వీటిపై ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పీ-4 కార్యక్రమం కోసం లబ్దిదారులను ఎంపిక చేయడంతో పాటు వారిని దత్తత తీసుకోమనడం సరికాదు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రభుత్వం రోడ్డుమీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి వాటిని మానుకోవాలని హెచ్చరిస్తున్నాం.
కూటమి పాలన- భద్రత లేని ఉద్యోగులు
ఇటీవల కడప జిల్లా గండి క్షేత్రంలో జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ పోటోను గుడిలో పెట్టే ప్రయత్నం చేస్తుండగా.. ఆలయ సంప్రదాయం ప్రకారం అలా చేయకూడదన్న ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ పై దాడి చేసి కాళ్లు పట్టుకునే స్థితికి తీసుకొచ్చారు. ఉద్యోగులకు ఎలాంటి భద్రత కూటమి పాలనలో ఉందో ఈ సంఘటన చూస్తూ తేటతెల్లం అవుతుంది.
మరోవైపు ఏపీకి చెందిన ఇద్దరు డిఎస్పీలు తెలంగాణాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బాధాకరమైన సంఘటన చోటుచేసుకుంది. దీనికి కారణం డ్రైవర్ అలసట, పని ఒత్తిడే అని తెలుస్తోంది. తాను డిప్యూటీ సీఎం గారి కాన్వాయ్ లో డ్రైవ్ చేసి వచ్చాను.. ఇప్పుడు హైదరాబాద్ వెళ్లలేను అని చెప్పినా ఉన్నతాధికారులు అంగీకరించలేదు. ఫలితమే రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఒక అడిషనల్ ఎస్పీ తీవ్ర గాయాలా పాలైన దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. కాబట్టి డ్యూటీల విషయంలో దిగువస్ధాయి సిబ్బందిని వేధించవద్దని వైయస్సార్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ విభాగం తరపున చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.