Suryaa.co.in

Telangana

పేరేమో ఉత్తమ్ – మాట తీరేమో మూసీ

కమిషన్ల కోసం జలయజ్ఞం ప్రారంభించింది మీరు
– మంత్రి ఉత్తమ్ కు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్

హైదరాబాద్: మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ను డెకాయిట్ అని మంత్రి ఉత్తమ్ సంభోదించడం ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనం. బూతులు మాట్లాడడంలో, అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించడం ముఖ్యమంత్రి రేవంత్ కు నేనేమి వెనుకబడలేదని నిరూపించాలనుకున్నావా ఉత్తమ్ ?

పేరేమో ఉత్తమ్ కుమార్ – మాట తీరేమో మూసీ ప్రవాహం.రేవంత్ నోటితో పాటూ ఉత్తమ్ నోరు కూడా ప్రక్షాళన చేయాల్సి ఉంది. జలయజ్ఞంలో EPC కాంట్రాక్ట్ పద్దతిని ప్రవేశపెట్టి ఇష్టమున్నట్టు ప్రాజెక్టుల అంచనా విలువలను పెంచేసి, ఏజెన్సీలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పద్దతిని ప్రవేశపెట్టి, నిబంధనలకు విరుద్దంగా సర్వే, డిజైన్ అడ్వాన్స్ లను 0.5 శాతం నుంచి 3.5 శాతానికి పెంచుకొని రాష్ట్రాన్ని డెకాయిటీ చేసింది ఎవరు ? వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నదెవరు ? మీరు కాదా ఉత్తమ్?

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 17 వేల కోట్ల నుండి తట్ట మట్టి ఎత్తకుండానే 40 వేల కోట్లకు పెంచుకున్న సంగతిని మరచిపోయావా ఉత్తమ్ ? ఇగో మీ కాంగ్రెస్ డెకాయటి గురించి ఇప్పటికే ఎన్నోసారు చెప్పి ఉన్నా. మళ్ళీ గుర్తు చేస్తున్న.

తొలుత జి ఒ నంబరు 124 తేదీ 16.05.2007 ద్వారా రూ. 17,875 కోట్లకు ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతి మంజూరు చేసి ఆ తర్వాత 19 నెలల్లోనే పనులు మొదలు కాకుండానే జి ఒ నంబరు 238 తేదీ 17.12.2008 ద్వారా రూ.38,500 కోట్లకు పరిపాలనా అనుమతిని సవరించింది మీరు మంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాదా?
తుమ్మిడిహట్టి బ్యారేజి నిర్మాణానికి మహారాష్ట్రాతో ఎటువంటి ఒప్పందం చేసుకోకుండానే ప్రాజెక్టు పనులని 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేసి తలను వదిలేసి తోక దాకా ఏక కాలంలో పనులని ప్రారంభింపజేసి అడ్వాన్స్ లు దండుకున్నది మీరు కాదా?

2010 లో కేంద్ర ప్రభుత్వానికి DPR ని రూ. 40,300 కోట్లకు సవరించి పంపింది నువ్వు మంత్రిగా ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ?
నాలుగేండ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వం ఈ కాలంలో పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా ఉత్తమ్ నీకు ? 2008-09 నుండి 2012 దాకా పెట్టిన ఖర్చు:

మొబిలైజషన్ అడ్వాన్స్ చెల్లింపులు: 651. 28 కోట్లు
సర్వే & ఇన్వెస్టిగేషన్ కోసం చెల్లింపులు : 829.51 కోట్లు
పనుల కోసం చెల్లింపులు : 151.93 కోట్లు
భూసేకరణ : 16.93 కోట్లు
ఇతర ఖర్చులు : 14.52 కోట్లు
నాలుగేండ్లలో ప్రాజెక్టు పనులు, భూసేకరణ కోసం పెట్టిన ఖర్చు : 151.93 + 16.93 = 168.86 కోట్లు
మొబిలైజేషన్ కోసం చెల్లింపులు (జూన్ 2014 వరకు) : 651.28 + 775.32 = 1426.60 కొట్లు

ఇదీ ప్రాణహిత – చేవెళ్ళ ప్రాజెక్టులో మీరు మంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం డెకాయిటీ. రాష్ట్రం ఏర్పడిన 9 ఏండ్లలో వ్యవసాయ రంగం అభివృద్దిలో, ఇతర మానవాభివృద్ది సూచికల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత కెసిఆర్ ది.

2014-15 నుంచి 2023-24 మధ్య కాలంలో ఆహార పంటల ఉత్పత్తి వృద్ది రేటు పెరుగుదలపై కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదిక ఏమి చెప్పిందో తెలియదా ఉత్తమ్?
16.42 శాతం వృద్ది రేటును సాధించి, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రా లాంటి పెద్ద వ్యవసాయ రాష్ట్రాలను వెనక్కి నెట్టి అగ్ర స్థానంలో నిలచింది తెలంగాణ. రెండవ స్థానంలో ఉన్న మహారాష్ట్రా సాధించిన వృద్ది రేటు 7.11 శాతం. తెలంగాణ దరిదాపుల్లో కూడా ఈ రాష్ట్రాలు లేవు.

ఆ నివేదిక ప్రకారం తెలంగాణలో 2014-15 లో పంటల సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు ఉంటే 2022-23 నాటికి అది 2.21 కోట్ల ఎకరాలకు పెరిగింది.

ఈ స్థాయిలో ఆహార పంటల ఉత్పత్తిలో, పంటల విస్తీర్ణాన్ని సాధించడంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టింది కేసిఆర్ కాదా? కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు అనుకూల వ్యవసాయ విధానాలు కావా?

కేసీఆర్‌ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితం కండ్ల ముందు సాక్షాత్కరించింది. తెలంగాణ వ్యవసాయానికి ఊపిరిలూదిన ఈ ప్రాజెక్టు నాశనం కాలేదు. దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణను ఆగ్రభాగాన నిలిపింది.

మీరు అధూరా వదిలి పెట్టిపోయిన అనేక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి, రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాల కల్పనలో అద్భుతమైన ప్రగతి సాధించినందు వల్లనే ఈ వృద్ది రేటు సాధ్యం అయ్యింది.

కాళేశ్వరంతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, తుమ్మిళ్ళ, భక్తరామదాసు, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల, గూడెం తదితర ఎత్తిపోతల పథకాలను, సింగూర్ కాలువలు, కిన్నెరసాని కాలువలు, కొమురం భీం, నీలవాయి, గొల్లవాగు, మత్తడివాగు, ర్యాలివాగు, గడ్డెన్న సుద్దవాగు, పాలెం వాగు, బేతుపల్లి వరద కాలువ, గట్టు పొడిచిన వాగు, తదితర ప్రాజెక్టులను పూర్తి చేసి, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్, ఘన్ పూర్ ఆనకట్ట కాలువలు, స్వర్ణ, సాత్నాలా, చెలిమెలవాగు, నల్లవాగు, సదర్ మాట్ ఆనకట్ట కాలువల ఆధునీకీకరణ, 28 వేల చెరువుల పునరుద్దరణ, నదులు, వాగులపై చెక్ డ్యాంల నిర్మాణం, చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం.. ఇట్లా బహుళ అంచెల వ్యూహాన్ని అమలు చేసినందువలన రాష్ట్రంలో రెండు పంటలకు సాగునీటి సరఫరా అనూహ్యంగా పెరిగింది.

శ్రీరాంసాగర్ రెండవ దశ కాలువల వ్యవస్థను పూర్తి చేసి కాళేశ్వరం ద్వారా 4 లక్షల ఎకరాలకు మొదటిసారి నీరు అందించింది మా కెసిఆర్ ప్రభుత్వం. భూగర్భ జలాలు పెరగడం వలన, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా చేసినందువలన 30 లక్షల బోర్ల కింద సుమారు 45 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి.

వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టిన కెసిఆర్ ను డెకాయిట్ అని అనడానికి నీకు నోరెలా వచ్చింది ఉత్తమ్ ? ఇంతకంటే దారుణం, మహా పాపం మరొకటి ఉండదు. దేవాదుల ప్రాజెక్టులో 300 రోజులు 60 టీఎంసీల నీటిని ఎత్తిపోసినామని మీ ఘనతగా చెప్పుకున్నావు. సమ్మక్కసాగర్ బ్యారేజి కట్టకపోయి ఉంటే ఆ పని చేయగలిగేవారా ?

దేవాదుల ప్రాజెక్టుకు నిల్వ లేకుండా ప్రాజెక్టును రూపకల్పన చేసింది చంద్రబాబు అయితే, కాంతనపల్లి పేరు మీద ప్రాజెక్టును ఆదివాసీ గ్రామాల ముంపు, పునరావాస సమస్యల్లో, పర్యావరణ సమస్యల్లో కూరుకుపోయేలాగా చేసి ప్రాజెక్టును మీరు కట్టకుండా వదిలేసింది మీరు.

దేవాదుల ప్రాజెక్టు కింద ఆయకట్టును, ఆయకట్టు పరిధిలో ఉన్న వేలాది చెరువులను నింపడానికి బ్యారేజి అవసరాన్ని గుర్తించి ముంపు, పునరావాస సమస్యలను, పర్యావరణ సమస్యలను తొలగించి సమ్మక్క బ్యారేజీని మూడేండ్లలో నిర్మించింది కెసిఆర్ ప్రభుత్వం. బ్యారేజి నిర్మాణం పూర్తి అయిన తర్వాతనే దేవాదుల ప్రాజెక్టు కింద పంపింగ్ ఎక్కువ రోజులు చేయడానికి వెసులుబాటు ఏర్పడింది.

కెసిఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను మీవిగా చెప్పుకోవడం మీకు కొత్తేమీ కాదు. సీతారామ ప్రాజెక్టులో మూడు పంప్ హౌజ్ లు పూర్తి చేసి రెడీగా పెడితే బటన్ వొత్తి ప్రాజెక్టును మీ ఘనతగా చెప్పుకున్న వైనం చూసి ఖమ్మం జిల్లా ప్రజలు నవ్వుకున్నారు. ఇప్పుడు వరంగల్ జిల్లా ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు.

కమిషన్ల కోసం జలయజ్ఞం ప్రారంభించింది మీరు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి మీరు వదిలిపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసింది మేము.

LEAVE A RESPONSE