– పోచంపల్లికి మోకిలాలో వందల కోట్ల ప్రాజెక్ట్
– హరీష్ రావు, సంతోష్ రావు బీఆర్ఎస్ను జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు
– హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్
– ఆరడుగుల బుల్లెట్టే నన్ను గాయపరిచింది
– కేసీఆర్‌తో మొదటి నుంచి హరీష్ రావు లేరు
– నాపై కుట్రలు జరుగుతుంటే కేటీఆర్ ఏం చేశారు?
– హరిత హారం పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలు సంతోష్ రావు సంపాదించాడు
– నా సస్పెన్షన్‌పై మరోసారి ఆలోచించాలి
– నేను ఏ పార్టీలో చేరను
– బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు
హైదరాబాద్: భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయటంపై కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పెదవి విప్పారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అగ్రనేత, తన మేనబావ హరీష్‌రావు, సోదరుడు వరసయ్యే మాజీ ఎంపి జోగిలిపల్లి సంతోష్‌రావుపై ఆరోపణల వర్షం గుప్పించారు. తన మాదిరిగానే, వారిద్దరూ తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్‌ను పార్టీ నుంచి వెళ్లగొట్టి పార్టీని స్వాధీనం చేసుకుంటారని తండ్రి, అన్నను హెచ్చరించారు. మీడియా సాక్షిగా కవిత చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
జై తెలంగాణ నినాదంతో ప్రెస్ మీట్ ప్రారంభించిన కవిత…. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన సస్పెన్షన్ లేఖలో ప్రత్యేకంగా రెండు అంశాల గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు.
‘నాపై అక్రమ కేసులు పెట్టి తీహార్ జైల్లో ఐదున్నర నెలలు ఉంచారు. బయటకు రాగానే.. 2024, నవంబర్ 23వ తారీఖు నుంచి ప్రజా క్షేత్రం లోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. నేను చేసిన పనుల్లో మొట్ట మొదటిది.. ఓ బిడ్డ హాస్టల్లో చనిపోతే అక్కడి వెళ్లాను. గురుకులాల్లో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడాను. బీసీ లకు జరుగుతున్న అన్యాయం గురించి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన 42 శాతం హామీ కోసం పెద్ద ఎత్తున పని చేశా. మహిళలకు 2500 ఇవ్వాలని పోస్టు కార్డు ఉద్యమం చేశాను’ అని అన్నారు..
పార్టీ లోని కొందరు నాపై కక్ష గట్టారు
‘10 నెలల వ్యవధిలో 42 నియోజక వర్గాల్లో పర్యటించా. రాష్ట్రంలో ఏ మూల సమస్య ఉన్నా స్పందించా. పార్టీ కోసం నేను చేసిన సేవలను నాయకత్వం పునరాలోచన చేయాలి. నేను మాట్లాడుతున్నది పార్టీకి వ్యతిరేకంగా కాదు. పార్టీలో ఉన్న కొందరు నాపై కక్ష గట్టారు. సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నా. అది తప్పా? నేను ఏం తప్పుగా మాట్లాడాను? సామాజిక తెలంగాణ అంటే బీఆర్ఎస్ వ్యతిరేకం ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు.
కేటీఆర్‌కు కవిత సూటి ప్రశ్నలు
‘కేటీఆర్‌ను గడ్డం పట్టుకుని అడుగుతున్నా. నాపై కుట్రలు జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మీరు ఏం చేశారు? నాపై కుట్రలు జరుగు తున్నాయని చెప్పినా, కేటీఆర్ నుంచి ఫోన్ కూడా రాలేదు. మహిళా నేతలు కూర్చోని నాపై ప్రెస్ మీట్ పెట్టారు. అది మంచిదే. అదే నేను కోరుకున్నది. కొందరు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలను కుంటున్నారు. అందుకే నన్ను పార్టీ నుంచి బయట పడేశారు. పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారు. రేపు కేటీఆర్‌కు ఇదే జరుగుతుంది. కేసీఆర్‌కు ఇదే జరుగుతుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు..
పుణ్యం వల్లే కేసీఆర్‌కు కూతురిగా పుట్టా
‘ఎన్నో జన్మల పుణ్యముంటే కేసీఆర్‌కు కూతురిగా పుట్టా. కేసీఆర్‌ను, పార్టీని నేనెందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటా? అధికారంలో ఉన్నా లేకున్నా నేను ఒకేలా ఉన్నా. అధికారంలో ఉన్నా నన్ను ప్రతిపక్ష ఎంపీ గానే చూశారు. ఆరడుగుల బుల్లెట్టే నన్ను గాయ పరిచింది. వీళ్లే ఇతర రాష్ట్రాలకు వెళ్తారు. కుట్రలు చేస్తారు. వీరి వల్లే విజయశాంతి, మైనంపల్లి, ఈటల సహా ఎంతో మంది పార్టీని వీడారు.
ఉప ఎన్నికల్లో ఈటలను హరీష్ రావే దగ్గరుండి గెలిపించారు. ఈ విషయాలను కేటీఆర్ గుర్తించాలి. నాకు పదవులపై ఆశ లేదు. బయటకు వచ్చేశా. ఇప్పటికైనా అన్ని విషయాలను కేటీఆర్ గమనించాలి. హరీష్ రావు చెవిలో జోరీగ లాంటివారు. పార్టీలో జరిగే తప్పులన్నీ రామన్నపై మోపుతున్నారు. దళితులు మరణించిన అంశంలో కూడా రామన్ననే డామినేట్ చేశారు’ అని అన్నారు.
హరీష్ రావు టార్గెట్‌గా విమర్శలు
‘సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్ రెడ్డి కాళ్లు హరీష్ రావు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయి. హరీష్ రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారం లోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలున్నాయి. రూ. లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి అంటారు. కానీ, హరీష్ రావు గురించి మాట్లాడరు. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారు.
కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చిందంటే అందుకు కారణం హరీష్ రావు, సంతోష్ రావే. కేసీఆర్‌తో మొదటి నుంచి హరీష్ రావు లేరు. టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా, ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. ట్రబుల్ క్రియేట్ చేసేదే హరీష్ రావు. అయినే సమస్య సృష్టించి దాన్ని పరిష్కరించినట్టు నటిస్తాడు.
కేసీఆర్‌కు హరీష్ రావు కట్టప్ప లాగా అంటారు. హరీష్ రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు. నా ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వను. నాపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా?’ అంటూ కంటతడి పెట్టుకున్నారు..
నాపై తప్పుడు ప్రచారం
‘నా 20 ఏళ్ల జీవితాన్ని బీఆర్ఎస్, తెలంగాణ కోసం పని చేయడానికి వెచ్చించా. సస్పెన్షన్‌పై మరోసారి ఆలోచించాలి. అయినా నాకు ప్రజలున్నారు. వాళ్ల దగ్గరికే వెళ్తా. బీఆర్ఎస్ ఉంటే ఎంత? లేకుంటే ఎంత అని నేను అనలేదు. కేసీఆర్‌కు నష్టం చేసే పార్టీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత అన్నాను. సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
కేటీఆర్‌ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీష్ రావు డబ్బు పంపారు. పోచంపల్లికి మోకిలాలో వందల కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. హరీష్ రావు, సంతోష్ రావు బీఆర్ఎస్ను జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీతో ఇద్దరూ అంట కాగుతున్నారు. సంతోష్ రావు బాధితులు చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు’ అని కవిత అన్నారు.
హరిత హారం పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలు సంతోష్ రావు సంపాదించాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని చెప్పి సినిమా హీరోలను మోసం చేసి సంతోష్ రావు ఫారెస్ట్ లు కబ్జాలు చేసేవాడు.సంతోష్ రావు కోసం ప్రత్యేక జీవోలు విడుదల చేసేవారు.
నేను ఏ పార్టీలో చేరను. నాకు ఏ పార్టీతో అవసరం లేదు. ఫ్యూచర్లో ఏం చేయాలో జాగృతి కార్యకర్తలు, తెలంగాణ మేధావులు, బీసీ బిడ్డలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా.