Suryaa.co.in

Telangana

హరీశ్ రావుకు త్వరలో నోటీసులు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఏజెన్సీలను అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఆ అఫిడవిట్లపై విచారణ కొనసాగుతోందని వివరించారు. టెక్నికల్ అంశాలు సిద్దమైన తర్వాత ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు.

ఆ తర్వాత భారీ నీటిపారుదల శాఖా మంత్రి, ముఖ్యమంత్రిని విచారణకు పిలుస్తామని వెల్లడించారు. జూలై రెండో వారం లేదంటే ఆ తర్వాత విచారణకు పిలుస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు త్వరలో నోటీసులు అందే అవకాశం ఉంది.

అంతకుముందు కాళేశ్వరం కమిషన్‌ను హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజనీర్లు కలిశారు. మధ్యంతర నివేదిక రెండు వారాల్లో సమర్పించాలని నిపుణులకు కమిషన్ స్పష్టం చేసింది. పూర్తిస్థాయి నివేదిక వీలయినంత త్వరగా అందజేయాలని రెండు కమిటీల ఇంజనీర్లకు కాళేశ్వరం కమిషన్ సూచించింది.

టెక్నికల్ అంశాలకు సంబంధించిన విషయంలో అఫిడవిట్ ఫైల్ చేయాలని నిపుణుల కమిటీలకు కాళేశ్వరం కమిషన్ సూచించింది. త్వరలో మరోసారి ఫీల్డ్ విజిట్ చేస్తామని జస్టిస్ చంద్ర ఘోష్ వివరించారు.

అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిని బహిరంగ విచారణలో భాగస్వామ్యం చేస్తామని కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్ర ఘోష్ స్పష్టం చేశారు. విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కమిషన్ ఇప్పటికే కోరింది. విజిలెన్స్ రిపోర్ట్ అందకపోవడంతో మరోసారి ప్రభుత్వానికి లేఖ రాయనుంది.

LEAVE A RESPONSE