Suryaa.co.in

Telangana

తెలంగాణపై ఎప్పుడు విషం చిమ్మడమే మోడీ పని

– తెలంగాణ ఏర్పాటును తక్కువ చేయడం అంటే… ఉద్యమాన్ని కించ పరచడమే 
– మంత్రి హరీశ్ రావు

హన్మకొండలో టి డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడంతో పాటు, మథర్ మిల్క్ బ్యాంక్, టీబీ స్పెషాలిటీ క్లినిక్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఎంజీఎం ఆసుపత్రిలో 42 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్ ను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఏంపి దయాకర్, ఎమ్మేల్యేలు నరేందర్, అరూరి రమేష్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, tsmsidc ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ లతో కలిసి ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ..

తెలంగాణపై విషం కక్కిన మోడీ.. ఇప్పుడు వలస జీవులపై విషం కక్కిండు.కరోనా సమయంలో ఎంతో మంది వలస జీవులు బతికి ఉంటే చాలు అనుకుంటే.. మోడీ వారిపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు.వలస కార్మికులకు సమయం ఇవ్వలేదు. అకస్మాత్తుగా లాక్ డౌన్ పెట్టారు. ఎంతో మంది నరకం చూశారు.

అలాంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భోజనం పెట్టి, జేబులో డబ్బులు పెట్టి, రైళ్లు ఏర్పాటు చేసి ఇళ్లకు పంపారు. ఇలా వలస కార్మికులకు అనేక మంది, సేవా సంస్థలు సహకారం అందించాయి. అందరినీ అభినందించాల్సిన పోయి.. మోడీ విమర్శలు చేస్తున్నారు. వారిని ఇంటికి పంపడం వల్లనే కరోనా పెరిగింది అని అవమాన పరిచారు. వలస జీవులపై ఎందుకు మోడీకి చిన్న చూపు.

వలస కార్మికుల కష్టాలు అర్థం చేసుకోవడంలో కేంద్రం ఫెయిల్ అయ్యింది. మీరు ట్రంపును తీసుకు వచ్చి, మీటింగ్ లు పెడితే,ఎన్నికల ర్యాలీలు పెడితే కరోనా పెరగలేదు కానీ వలస కార్మికుల వల్ల పెరిగిందా?ఇంత కంటే దారుణం ఇంకొకటి ఉంటదా..పొట్ట చేత పట్టుకొని ఉన్న వారిపై నిందలు వేయడం..కంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదు.

మొన్న తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారు. తెలంగాణ ఉద్యమ కారుల బలిదానాలను కించ పరిచారు. తెలంగాణ ఏర్పాటును తక్కువ చేయడం అంటే… అమరులకు కించపరచడం..ఉద్యమాన్ని కించ పరచడమే. వరంగల్ లోనే ఎంత మంది బలిదానాలు చూసాము..ఎన్ని త్యాగాలు..ఎన్ని శవాలు మోసాము.
అప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నరు.. ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు సక్రమంగా జరగలేదు అంటున్నారు..తెలంగాణ పై ఎప్పుడు విషం చిమ్మడమే మోడీ పని.

తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు. 157 మెడికల్ కాలేజీ ఇస్తే ఎందుకు ఒక్కటి ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలు, ఐఐఎం, ఐఐఐటీ, ఒక్కటి ఇవ్వలేదు. అన్నింటా తెలంగాణకు మొండి చేయి చూపారు.

మాటలతో హింస..
తెలంగాణ ప్రజలను అవమానించేలా చర్యలు.. అందరూ వ్యతిరేకిస్తున్న కూడా వ్యవసాయ చట్టాలు ఎలా చేశారు.తెలంగాణ అంటే బిజీపికి కడుపు నిండా విషం.మీకు తెలంగాణలో నూకలు చెల్లినయు.నిధులు ఇవ్వరు.. సూటి పోటి మాటలు. అమరుల త్యాగాలను తక్కువ చేస్తారు. మీరు ఎన్ని చేసినా రాష్ట్రం పురోగతిలో ఉంటది. అభివృద్ధి ఆగదు.ఎంపిలు దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధిలో టాప్ 10లో దేశంలో 7 తెలంగాణవి ఉన్నాయి. వివిధ రంగాల్లో కేంద్రం నుండి అనేక అవార్డులు ఇచ్చారు..ఇది మా పని తీరు.. కండ్లు కనిపిస్తలేదా?

మోడీ ఇంకో మాట అంటారు..రాష్ట్రాలు కేంద్రం కలిసి ఉండాలని.. నీతులు బాగా చెబుతాడు. ఎందుకు మా ఏడు మండలాలు ఆదరాబాదరాగా ఆంధ్రలో కలిపారు, ఎందుకు సీలేరు ప్రాజెక్టు అప్పగించారు. నువు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పు.తెలంగాణపై మోడీ చేసిన వ్యాఖ్యలు, వాళ్ళ తీరు పట్ల జర్నలిస్టు సంఘాలు కూడా కదలాలి. ఉద్యమంలో వరంగల్ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారు.

వైద్యారోగ్యం పై…….
మంత్రుల కోరిక మేరకు సమ్మక్క సారక్క జాతర లో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేస్తాము. అరోగ్య శాఖ తరుపున పూర్తి స్థాయి ఏర్పాట్లు ఉంటాయి. 7.5 కోట్లతో ఎమ్మారై స్కాన్, సెకెండ్ సీటీ స్కాన్ నీ కూడా మంజూరు చేస్తున్నాం. త్వరలో అందుబాటులోకి వస్తాయి.

రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేయడంలో, 15-17 ఏళ్ల మధ్య వారికి మొదటి డోసు పూర్తి చేయడంలో హన్మకొండ ముందంజలో ఉంది. మంత్రులకు, ఇక్కడి జిల్లా యంత్రాంగానికి అభినందనలు. వరంగల్ జిల్లా కూడా వేగంగా పూర్తి చేయాలి.

సమ్మక్క జాతర తర్వాత ములుగు, సిరిసిల్ల లో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు మొదలవుతుంది. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.హన్మకొండలో టి డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడంతో పాటు, మథర్ మిల్క్ బ్యాంక్, టీబీ స్పెషాలిటీ క్లినిక్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఎంజీఎం ఆసుపత్రిలో 42 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత పుట్టిన పిల్లల కోసం నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు, పెద్ద వాళ్ల కోసం అడల్ట్ ఐసీయూ, తల్లుల కోసం మెటర్నల్ ఐసీయూలను మనం ప్రారంభించుకున్నాం. ఇప్పుడు కొత్తగా చిన్నారుల కోసం పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్లను మొదటి సారిగా మనం ప్రారంభించుకుంటున్నాం.
నీలోఫర్ ఆసుపత్రిని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా మార్చి హబ్ అండ్ స్పోక్ మోడల్లో 33 జిల్లాల్లో ప్రత్యేకంగా పీడియాట్రిక్ ఐసీయూలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రూ.86 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. ఈ క్రమంలో మొదటిది ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం.

మదర్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు ప్రారంభించుకున్నాం. పుట్టిన ప్రతి బిడ్డకు గంట వ్యవధిలో తల్లి పాలివ్వాలి. దీన్నే గల్డెన్ అవర్ అంటారు. తల్లులకు పాలు రాకపోవడం, సిజేరియన్, శిశువుల అనారోగ్యం తదితర కారాణాల వల్ల తల్లి, బిడ్డలను వేర్వేరు చోట ఉంచాల్సి వస్తుంది.ఇటువంటి సమయంలో శిశువుల ఆకలి తీర్చడానికి ఈ మదర్ మిల్క్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న మిల్క్ బ్యాంక్ అద్భుతమైన సేవలందిస్తున్నది. హైదరాబాద్ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం.

57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించే టి- డయాగ్నోస్టిక్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 20 జిల్లాల్లో ఉండగా, 13 జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి చోట పాథాలజీ, రేడియాలజీ సేవలు ఉండేలా చూస్తున్నాము. దీని కోసం ఒక్కో సెంటర్ పై రూ. 3.5కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం.నర్సంపేట 200, భూపాలపల్లి 300, ములుగు 200, మహబూబాబాద్ 200 పడకల ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. దీనికి తోడు వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో 2,900 పడకలు అందుబాటులోకి రానున్నాయి.

వరంగల్ అంటే ముఖ్యమంత్రి కి ప్రత్యేక ప్రేమ. అందుకే వరంగల్ ను హెల్త్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక్కడ ఇప్పటికే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఉండగా, అత్యాధునిక వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలతో కూడిన హెల్త్ సిటీని 215.35 ఎకరాల్లో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. 15 ఎకరాల్లో రూ. 1,100 కోట్లతో భారీ భవన సముదాయాన్ని నిర్మించబోతున్నాం. 2,000 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనున్నది.

విద్యతో పాటు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పల్లె ప్రజల కోసం పల్లె దవాఖానలు, పట్టణ ప్రజల కోసం బస్తీ దవాఖానలు, జిల్లాకొక మెడికల్ కాలేజీ, హైదరాబాద్ నలువైపులా ఎయిమ్స్ తరహాలో నాలుగు టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. 8 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ పరిధిలోని మహబూబాబాద్లో కొత్త మెడికల్ కాలేజీ వస్తున్నది.

తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 700 మాత్రమే ఉంటే, ఇప్పుడు వాటిని 2,850కి పెంచుకుంటున్నం. పీజీ సీట్లు నాడు 531 మాత్రమ ఉంటే, ఏడేండ్లలో 938కి పెంచుకున్నాం. భవిష్యత్లో వీటన్నింటిని మరింత పెంచుకొని, దేశానికే తెలంగాణ వైద్య రంగాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దబోతున్నాం.

తెలంగాణ వైద్య రంగం దేశంలోనే అత్యుత్తమమైందని కేంద్ర ప్రభుత్వ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానం అని నీతి అయోగ్ చెప్పగా, అందులో బీజేపీ పాలిత, మోడీ ప్రాతినిధ్య యూపీ చిట్టచివరన నిలిచింది. ప్రజా వైద్యంపై తెలంగాణ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే రాజ్యసభలో చెప్పింది. ఒక్కొక్కరి ఆరోగ్యం కోసం రూ. 1698 తలసరి ఖర్చు చేస్తూ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.

LEAVE A RESPONSE