– భూ భారతి.. భూ హారతిగా మారిందా?
– కాంగ్రెస్ నాయకులకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి అయ్యిందా?
– భూమి రిజిస్ట్రేషన్, ఇతర భూ సమస్యలతో ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతున్న వరుస ఘటనల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం
హైదరాబాద్:
మొన్న: భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బుతో ఆందోళనకు దిగిన అన్నదమ్ములు.
నిన్న: భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం. “ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు. రైతుల భూమి హక్కులు 100% కాపాడతాం” అని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి… మీ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల వద్ద, తహసిల్దార్ కార్యాలయాల వద్ద, కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న రైతు ఆత్మహత్యాయత్నాలు కనిపించడం లేదా? ‘ధరణి’ పై అడ్డగోలుగా మాట్లాడి మీరు గొప్పగా తెచ్చిన ‘భూ భారతి’ భూముల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు విఫలమైంది? అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వసూళ్లతో భూ భారతి ‘భూ మేత’ అయ్యిందా? భూ భారతి.. భూ హారతిగా మారిందా? కాంగ్రెస్ నాయకులకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి అయ్యిందా? పేరు దిబ్బ ఊరు దిబ్బ అన్న చందంగా ఉన్నది మీ ప్రభుత్వ తీరు.
మీరు తెచ్చిన రెవెన్యూ చెత్త సంస్కరణలు.అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూ సమస్యలు పరిష్కరిస్తాం అన్న హామీ ఏమైంది రేవంత్ రెడ్డి? భూముల రికార్డులు సరిచేస్తాం, రైతుల హక్కులు కాపాడతాం అని చెప్పి మీరు రెండేళ్లుగా కుంటి సాకులు చెబుతూ రిజిస్ట్రేషన్లు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. నెలలు గడుస్తున్నా సాదాబైనామా దరఖాస్తుదారులు ఎందుకు పరిష్కరించడం లేదు. కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెసులుబాటు కల్పించడం లేదు? రైతు భూమి మీద ఆ రైతుకే హక్కు లేకుండా చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వం మీది. ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం.
ఆపదకో, అవసరానికో ఉన్న భూములు అమ్ముకోలేక.. అధిక వడ్డీకి రుణాలు తీసుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి? రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి? ధరణి పేరు మార్చి తెచ్చిన భూ భారతి ఏమైంది? తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులు పెండింగ్లో ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులు, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రైతులు, ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారమవడం లేదు. మీ పాలనలో భూ సమస్యల పరిష్కారానికి 30 శాతం నుంచి 40 శాతం లంచాలు ఇస్తే గాని పని కాని పరిస్థితి.
రిజిస్ట్రేషన్ ల పేరిట మధ్యవర్తులు, ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు..రైతుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఇప్పటికే మీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల 700 పైగా అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. రుణమాఫీ కాక, రైతు భరోసా అందక, పంట బోనస్ ఇవ్వక పోవడంతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మేలుకుని, పెండింగ్లో ఉన్న భూ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించాలని డిమాండ్ చేస్తున్నాం.