– గజం స్థలం అయినా పేదల కోసం కొన్నారా ?
– వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్: గత వైయస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్జలాలు, వారికి పక్కా ఇళ్లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, ఆ దిశలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా, 21.75 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు.
రెండేళ్లు కోవిడ్ మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను వైయస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసిందని ఆయన తెలిపారు. బుధవారం చంద్రబాబు ఆర్భాటంగా ప్రచారం చేసి ప్రారంభించిన 3,00,092 ఇళ్లలో, గత ప్రభుత్వ హయాంలోనే 1,40,010 ఇళ్లు దాదాపు పూర్తి కాగా, శ్లాబ్ లెవెల్ వరకు 87,380 ఇళ్ల నిర్మాణం జరిగిందని, ఇంకా వివిధ దశల పనులతో మిగిలిన 66,845 ఇళ్లు ఉన్నాయని గుర్తు చేశారు.
అయినా 3 లక్షల ఇళ్లు తామే కట్టినట్లు పచ్చి అబద్దాలతో సీఎం చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి 18 నెలల్లో స్వయంగా నిర్మించిన 3 లక్షల 92 ఇళ్లు ఒకేరోజు లబ్ధిదారులకు అందజేసినట్టు ప్రచారం చేసుకున్న చంద్రబాబు, అందుకోసం కనీసం గజం స్థలం కొని, సెంటు భూమి అయినా పేదలకు మంజూరు చేసి ఉంటే చూపాలి. అవేవీ చేయకుండా గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తయిన ఇళ్లకు రంగులేసి, అప్పటికే ఆ ఇళ్లలో ఉంటున్న వారికి మళ్లీ కీ ఇచ్చి, అవన్నీ తామే కట్టించి, గృహ ప్రవేశం చేయిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పుకుంటున్నారు. రాయచోటిలో నిన్న (బుధవారం) ప్రారంభించిన ఇళ్లు గత మా ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. అందుకు తగిన ఆధారాలన్నీ ఉన్నాయి.
వైయస్సార్సీపీ ప్రభుత్వంలోనే రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగితే, అవి కూడా తామే తీసుకొచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నానా హంగామా చేస్తూ, ఆర్భాట ప్రచారంతో నిన్న (బుధవారం) ప్రారంభించిన 3 లక్షల ఇళ్లన్నీ గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలోనే నిర్మించారు. వాటిలో చాలా వాటిని లబ్ధిదారులకు అందజేశారు కూడా.
వాటిని కూడా తామే కట్టి, లబ్ధిదారులకు ఇస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లెకి చెందిన ఎస్.అల్తాబ్బేగం, హేమలతకు ఏప్రిల్ 28, 2022లో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరు చేస్తే, అప్పుడే వాటిని పూర్తి చేసుకున్నారు. వారికి రూఫ్ లెవెల్ వరకు బిల్లులు కూడా అప్పుడే మంజూరైనట్లు స్పష్టంగా కనిపిస్తున్నా, అవి తాము కట్టామని చంద్రబాబు చెబుతున్నారు. అదే గ్రామంలో రాజీవ్‌నగర్ కాలనీలో 40 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే 30 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. అప్పుడే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు.
ఆ ఇళ్లనే నిన్న చంద్రబాబు ప్రారంభించి తన ఘనత అన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అలా నాడు జగన్ కట్టించి, మంజూరు చేసిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేసే కుతంత్రానికి తెర లేపాడు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక అటవీ భూములు కాజేశాడంటూ కూటమి నాయకులు ఆయన మీద పదే పదే బురద జల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. తాను ఆ భూములు ఎలా సంపాదించానో తెలియజేస్తూ ఆయన అన్ని ఆధారాలు చూపించారు. అన్నింటికీ పెద్దిరెడ్డి వద్ద ఆధారాలున్నాయి. పెద్దిరెడ్డి మీద ఏడాదిన్నరగా ఆరోపణలు చేస్తూనే ఉన్నా, ఇప్పటి వరకు ఏ ఒక్కదాన్నీ ఆధారాలతో నిరూపించలేకపోయారని జి.శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు.