– చాలాకాలం తర్వాత కలసిన కేసీఆర్-తమిళసై
– నిన్నటి వరకూ వారిద్దరి మధ్య మాటల యుద్ధం
– తాజాగా మనసారా ముచ్చట్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
నిన్నటి వరకూ వాళ్లిద్దరూ ఉప్పు నిప్పుల్లా కనిపించారు. ఆమె పర్యటనలకు కలెక్టర్లు, ఎస్పీలు వెళ్లకుండా ముఖం చాటేశారు. దానితో ఆమె మనస్తాపం చెందారు. మహిళను అవమానిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన తల్లి మృతి చెందిన సమయంలో ఆయన కనీసం మర్యాదపూర్వకంగా వచ్చి పరామర్శించకపోగా, ఫొన్లో కూడా సానుభూతి చెప్పలేదని వాపోయారు. ఆయన మీద తనకేమీ కోపం లేదన్నారు. తర్వాత ఆమె తన నివాసాన్ని మహిళా దర్బార్‌గా మార్చేశారు. దానితో ఆయన, పార్టీ పరివారం అంతా ఆమె తీరుపై విరుచుకుపడ్డారు. ఆమె బీజేపీ నాయకురాలిగా పనిచేస్తున్నారంటూ విమర్శనాస్ర్తాలు సంధించారు.
అంతకుముందు.. ఆమె అనుమతి తీసుకోకుండానే ఆయన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించారు. అంత తీవ్రస్థాయిలో నడిచిన వారిద్దరి మాటలయుద్ధానికి, మంగళవారం నాటి ఓ కార్యక్రమం తాత్కాలికంగా తెరదించింది. ఇంతకూ ఆయనెవరంటే తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆమె గవర్నర్ తమిళసై. నిన్నటి
వరకూ వారిద్దరి మధ్య పేలిన మాటల తూటాల స్థానంలో నేడు చిరునవ్వులు చిందాయి. అందుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదికగా మారింది. అక్టోబర్‌లో చివరిసారి భేటీ అయిన తర్వాత సీఎం కేసీఆర్-గవర్నర్ తమిళసై ముఖాముఖి భేటీ కావడం మళ్లీ ఇదే తొలిసారి.
ప్రగతిభవన్- రాజభవన్‌కు దూరం తగ్గినట్లేనా?.. తాజా పరిణామాలు చూస్తే కాస్తంత తగ్గినట్లే కనిపిస్తోంది. ఇప్పటివరకూ తెలంగాణ గవర్నర్ తమిళసైను బేఖాతరు చేస్తూ, సొంత నిర్ణయం తీసుకుంటున్న సీఎం కేసీఆర్, చాలాకాలం తర్వాత అంటే… అక్టోబర్ తర్వాత ఇప్పటివరకూ వారిద్దరూ కలుసుకున్న మాటముచ్చట లేదు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ కోసం కేసీఆర్ చేసిన సిఫార్సును గవర్నర్ పక్కనపెట్టినప్పటినుంచీ వారిద్దరి మధ్య వార్ ప్రారంభమయింది.
అది ముదరుపాకానపడి.. గవర్నర్ జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు ఆమెకు ఎస్పీ, కలెక్టర్లు ప్రొటోకాల్ గౌరవం ఇవ్వనంత దూరం వెళ్లింది. ఆమె పర్యటనలకు కేసీఆర్ ప్రభుత్వం హెలికాప్టర్ ఇచ్చేందుకూ నిరాకరించింది. దానితో ఆమె రోడ్డుమార్గంలోనే పర్యటనలకు వెళ్లాల్సివచ్చింది. ఆ క్రమంలో తమిళసై రాజ్‌భవన్ వేదికగా ప్రారంభించిన మహిళా దర్బార్ కేసీఆర్ సర్కారు ఆగ్రహానికి గురయింది. అప్పటి నుంచీ గవర్నర్-టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ఫలితం రాజ్‌భవన్-ప్రగతిభవన్ మధ్య దూరం మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించిన అధికార కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. సాధారణకార్యక్రమమయితే కేసీఆర్ హాజరుకాకపోయినా ఎవరూ పట్టించుకోరు. కానీ చీఫ్ జస్టిస్ ప్రమాణ
స్వీకారానికి సీఎం హోదాలో కేసీఆర్ వస్తారా? లేదా అన్నదానిపై అటు మీడియాలోనూ చర్చ జరిగింది. కేసీఆర్ వైఖరి తెలిసినందున, ఆయన రాజ్‌భవన్‌కు వెళతారా? లేక గవర్నర్‌పై ఉన్న కోపంతో ముఖం చాటేస్తారా అని చర్చలు జరుగుతున్న సమయంలో.. ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి ఆ చర్చకు తెరదించారు.
కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లిన సందర్భంలో గవర్నర్, చీఫ్ జస్టిస్, సీఎం ముగ్గురూ యాంటీరూంలో కొద్దిసేపు
ముచ్చటించారు. ముగ్గురూ కరోనా నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించారు. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ వద్ద ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకున్నారని, ఆ సందర్భంలో వారిద్దరి మధ్య జోకులు కూడా పేలాయన్నది అధికార
సమాచారం.ఇక అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా కేసీఆర్ మాట్లాడారు. ఈ సమయంలో గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రి మధ్య నవ్వులు విరిశాయి. మరి రాజభవన్-ప్రగతిభవన్ మధ్య తగ్గిన దూరం తాత్కాలికమా? శాశ్వతమా? అన్నది వేచిచూడాలి.