– చట్టం అమలైతే..మొట్ట మొదటి ముద్దాయి ఎవరు?
– ఫాసిస్ట్ భావజా లానికి దీనికి ఏమిటి తేడా?
– జనం ఏమనుకుంటారనే సోయి ఉండాలి
విపరీతమైన ద్వేషంతో,కోపంతో, బాధతో, సంతోషంతో ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోవద్దని శాస్త్రం చెప్తుంది.
అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు పైన చెప్పిన భావోద్వేగాలతో కూడుకొని ఉన్నవేననేది జగమెరిగిన సత్యం.
రాష్ట్ర ప్రభుత్వం ‘హేట్ స్పీచ్ నియంత్రణ బిల్లు’ పేరుతో నడుపుతున్న ప్రహసనం వెనుక, అసహనం ద్వేషం నిండిన ఆలోచన ఉన్నదనేది స్పష్టమవుతున్నది.
మరి ప్రభుత్వానికి ఈ ద్వేష భావన ఎవరి మీద.? ప్రతిపక్షాల మీదనా?
ప్రజల మీదనా? అవినీతి అక్రమాలను ప్రభుత్వ నియంతృత్వ పోకడలను నిలదీస్తున్న సామాన్యుల మీదనా ?
ఈ భూమ్మీద ఏ ప్రజాస్వామిక ప్రభుత్వము ఆలోచించడానికి కూడా వెనుకాడే విధంగా ఉన్న., భావ ప్రకటన స్వేచ్ఛ అనే రాజ్యాంగ మౌలిక సూత్రానికి పూర్తి విరుద్ధంగా ఉన్న, ఈ బిల్లును చట్టం చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ మొండివైఖరికి మూలం ఎక్కడుంది?
తనకు నచ్చని వారిని కట్టడి చేయాలని, అసహనంతో కోపంతో, విద్వేషంతో, ఆధిపత్య వైఖరులతో పొరుగు దేశాల మీద దాడులు చేస్తూ పసిపిల్లలను కూడా చంపేస్తున్న అగ్రదేశాల నాయకత్వ ఆలోచనలకు., ఈ బిల్లును చట్టం చేయాలనీ పూనుకున్న ప్రభుత్వ పెద్దల ఆలోచనకు సారంలో ఏమి తేడా ఉన్నది చెప్పగలరా?
ఇది నియంతృత్వ ధోరణితో, ఫాసిస్ట్ భావజాలంతో నిండుకొని ఉన్నది అంటే… ఎవరిని తప్పు బడతారు?
వీటన్నిటికీ మనం ఇప్పుడు సమాధానాలు దోలాడుకోవాల్సిన అక్కర ఉన్నదా? లేదా? మౌనంగా ఉన్న మేధావి పెద్దలు చెప్పాలిగ!
ప్రభుత్వ పక్ష సభ్యులకు కూడా అసంతృప్తిని మిగిలించి, సెలక్ట్ కమిటీకి పంపించబడిన ‘హేట్ స్పీచ్ బిల్లు’ను, అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం నిజంగా…దొంగే దొంగా దొంగ.. అన్నట్టు ఉన్నది..
ఒకవేళ, ఈ బిల్లు చట్టంగా మారింది అనుకుందాం. అప్పుడు మొట్టమొదట చర్యలు తీసుకోవాల్సి వచ్చే మనిషి లేదా ఉన్నత పదవిలో ఉన్న నాయకుడు ఎవరో ప్రజలందరికీ తెలుసు.
చట్టం అమలైతే..మొట్ట మొదటి ముద్దాయి ఎవరు? ఆలోచించారా?
రాజ్యాన్ని చేత పట్టుకొని హేట్ స్పీచ్ కి ఆజ్యం పోస్తున్నది ఎవరు? సమయం సందర్భము లేకుండా., అవి బహిరంగ సభలా? చట్టసభలా? ప్రెస్మీట్ల ? అంతరంగిక సంభాషణల.. అనే సోయి లేకుండా, నోటికి ఎంత వస్తే అంత.. విద్వేషాన్ని రగిలించే భాషతో,హావభావాలతో, నెటిజన్లను , ప్రజలను రెచ్చగొట్టాలనే తప్పుడు అవగాహనతో.. ప్రసంగాలు చేస్తున్నది ఎవరు..? ఈ విషయం తెలియంది ఎవరికి ?
మరి.. ‘హేట్ స్పీచ్ నియంత్రణ’ పేరుతో చట్టం చేసి ఎవరిని సాధిద్దాం అనుకుంటున్నారు?
ఇది.. హంతకుడే సంతాప సభ పెట్టినట్టు కాదా ?
ప్రజాస్వామ్యాన్ని చంపేసి దానికి ప్రశ్నించిన వారిని కారణం చూపిస్తూ.,సంతాప సభ పెట్టి సానుభూతి పలికినట్టు కాదా?
ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉంటూ, ప్రజా సంక్షేమం ప్రగతిని లక్ష్యంగా చేసుకొని పరిపాలన సాగించడం చేతగాక, గత పాలకుల మీద నిత్యం విద్వేషాన్ని చిమ్ముతూ, సమస్యలను పక్కదారి పట్టించి,సమయాన్ని వృధా చేద్దామనే తప్పుడు ఎత్తుగడ కాదా ? ఈ బిల్లు.
కనిపించిన దేవుడు మీదల్ల వొట్లేసి, ప్రజల చేత ఓట్లు వేయించుకున్న మూడు రంగుల జెండా పట్టిన పెద్దలు, గద్దెనెక్కిన తర్వాత చేస్తున్న పనులేమిటి.,
జనానికి అర్థం కావట్లేద?
ప్రజాపాలన పేరుతో, ప్రజల ఆస్తులను దోచుకుందామనే యావతో, నేటి ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారే సంగతిని ప్రజలు పసిగట్టలేదనుకుంటున్నారా?
తాము వచ్చిందే దోచుకోవడానికి దాచుకోవడానికి మాత్రమే., అన్నట్టుగా, పాలనలోకి వచ్చిన తెల్లారి నుంచే తమ దోపిడి ఆలోచనలను అమలు చేసుకుంటూ వస్తున్న కార్యాచరణను., ఎప్పటికప్పుడు పసిగడుతూ, ప్రజలను చైతన్యం చేస్తూ, నిలవరించడం నీకు నచ్చడం లేదా?
ఈ క్రమంలో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజాస్వామికవాదులు, తెలంగాణవాదులు, మెయిన్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజాక్షేత్రంలో, బండారం బయట పెడుతుంటే, మీ ‘నోటికాడి బుక్కను గుంజుకుంటున్నంత’ బాధవుతున్నదా? అదేనా ఈ బిల్లుకు అసలుకారణం.?
ఒక్కసారి మోసపోయిన ప్రజలు ఐదేళ్లదాకా నోరు మూసుకుంటారు కానీ, ఈ తెలంగాణ వాదులు తెలంగాణ తెర్లు కాకుండా చూసుకోవాలని , ఈనగాచి నక్కల పాలు చేయకూడదనే పట్టుదలతో, ప్రభుత్వ చర్యలను కట్టడి చేస్తున్నారు, కాబట్టి వీళ్లను కట్టడి చేయాలి.. ఇదే కదా బిల్లు వెనుక అసలు సంగతి.
ఎవరిని మాట్లాడనీయకుండా, మాట్లాడిన వాళ్లను అక్రమ కేసులు పెట్టి అడ్డు తొలగించుకునేందుకు, ఎన్ని ఉపాయాలు పన్నాలో అన్ని ఉపాయాలు వేసి, ఇరాన్ మీద దాడికి పోయి పండ్లికిలిస్తున్న ట్రంప్ మాదిరి, వైఫల్యం చెందుతూ, ఏమీ చేయలేక నియంతృత్వాన్ని ఆశ్రయిస్తూ, “హేట్ స్పీచ్ నియంత్రణ” అంటూ బయలుదేరారా ? ఫాసిస్ట్ భావజా లానికి దీనికి ఏమిటి తేడా?
మనం ఒక పని చేసే ముందు కనీస ఆలోచన, జనం ఏమనుకుంటారనే సోయి ఉండాలి. అవేవీ లేకుండా… నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు…అన్నట్టుగా, మన బుర్రకి ఏది దోస్తే అది చేయడానికి ఇదేమన్నా రాచరికమా ?
ప్రశ్నించే వాళ్లను పరేషాన్ చేయాలనే అత్యుత్సాహం, ఎంత వరకు దారి తీస్తది ?దాని పర్యవసానాలు ఏమిటి ? ఆలోచించారా? రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి మీకు మార్గాలు దొరకకపోతే.. ప్రజావాహక్కును నిషేధించడమే మార్గమా ?
ఇంట్లో ఎలుకలు పడ్డాయని, ఇల్లు కాల పెట్టుకుంటే ఎవరికి నష్టం ?
త్యాగాల తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నారు ? ఎటు తీసుకపోదల్చుకున్నారు ?
– రమేశ్ హజారి