– కిడ్డీ బ్యాంకు డబ్బుతో చెల్లెలికి అన్న అరుదైన గిఫ్ట్!
అమ్మ+ నాన్న= అన్న, అనే గొప్ప జీవిత సత్యాన్ని మన అందరికీ బోధించారు మన పెద్దలు. డిజిటల్ యుగం, నేను అనే స్వార్థం, అన్నీ నేనే అనుభవించాలని అత్యాశ, నేటి ఆర్థిక బాంధవ్యాలు… మన పూర్వీకులు సాంప్రదాయంగా మనకు నేర్పిన పాఠాలు, గుణపాటాలు బాంధవ్యాల విలువలను మంటగలిపేలా చేస్తున్నాయి.
నా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికొస్తే ఏమిస్తారు అనే లేటెస్ట్ ట్రెండ్ రాజ్యమేలుతున్న ప్రస్తుత ఫైనాన్షియల్ సొసైటీలో, హైదరాబాద్‌కు చెందిన ఓ అన్న తన బర్త్‌డే సందర్భంగా చెల్లెలికి ఇచ్చిన అరుదైన గిఫ్ట్ నేటి సమాజాన్ని, మనల్ని ఆలోచన బాట పట్టించేలా చేస్తున్నాయి. ఇంతకీ ఈ హైదరాబాది చిన్నోడు చేసిన పని ఏమిటి? ఇచ్చిన ఆ అరుదైన గిఫ్ట్ ఏమిటి? తెలుసుకుందాం రండి.
ఈ ఫోటోలో మీరు చూస్తున్న అన్నా చెల్లెలు M. సోమాదిత్య, M సోనాక్షి… అతడు టెన్త్ క్లాస్. అతని చెల్లెలు సెవెంత్ క్లాస్. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుతున్నారు. కొన్ని రోజుల్లో మొదటిసారిగా బోర్డ్ ఎగ్జాం రాయబోతున్న అతను, తన బర్త్‌డేను స్పెషల్ గా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని… తన అన్నయ్యకు ఎలాంటి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని ఆ చెల్లెలు.. సీక్రెట్ ప్లానింగ్ చేసుకుంటున్న సమయం అది.
సరిగ్గా అదే సమయంలో టీవీలలో అండ్ సోషల్ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు 14 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు ఉచితంగా “హెచ్ పి వి వ్యాక్సిన్” వేస్తున్నారని తెలుసుకున్న సోమాదిత్య, తన తండ్రి ద్వారా పూర్తి సమాచారం తెలుసుకొని, 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తన చెల్లెలికి సర్వికల్ క్యాన్సర్ సంబంధిత వ్యాధులపై హై ప్రొటెక్షన్ కల్పించేందుకు వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయం తీసుకున్నాడు.
అప్పటివరకు చెల్లెలి నుంచి ఈసారి స్పెషల్ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అతను చెల్లెలికి మోస్ట్ మెమొరబుల్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని తన కిడ్డీ బ్యాంకు ను తెరిచాడు. 15 వేల రూపాయలు పోగయ్యాయని గుర్తించిన అతను పదివేల రూపాయలతో “GARDASIL 9” వ్యాక్సిన్ వేయించి తన చెల్లెలి పట్ల అన్న బాధ్యతను, ప్రేమను ప్రదర్శించాడు. May నెల లో సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఫ్రెండ్స్! డబ్బు శాశ్వతం కాదు. మనుషులు శాశ్వతం కాదు. కానీ బ్రతికుండగా మనం, మన వారి కైనా, ఇతరులకైన చేసే పనులే రేపు మనం లేకున్నా ఇతరుల హృదయాల్లో మనల్ని సజీవంగా, చిరంజీవులుగా నిలబెడతాయి. ఈ చిన్నోడు చేసిన పని చిన్నదే అయినా తన చిన్నారి చెల్లెలి పట్ల చూపించిన కమిట్మెంట్ నిజంగా ఆదర్శంగా నిలుస్తోంది .
కేర్ అండ్ షేరింగ్ కాన్సెప్ట్ కు నిలువెత్తు సాక్షంగా నిలుస్తున్న ఈ స్టోరీ, విస్తృతంగా ప్రచారమవడంతోపాటు, నెటిజన్ల వాహ్వాలను సొంతం చేసుకుంటోంది…
హ్యాట్సాఫ్ రా హైదరాబాద్ చిన్నోడా!!