( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రపంచ సైకిల్ దినోత్సవం మరుసటిరోజు ఆంధ్రా ప్రజలు సుమానీలా సైకిల్ ఎక్కారు. గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లు ఇచ్చిన ఆంధ్రా ఓటరు, ఈసారి ఆ ఒక్క పార్టీకే 137 స్థానాలు పువ్వుల్లో పెట్టి అప్పగించడం రికార్డే. ప్రజాగ్రహం-ప్రజాభిమానం ఒక్కోసారి అంత వింతగా-ఊహించని విధంగా ఉంటుంది. దానికే పొంగిపోయి తలకెక్కిన అహంకారంతో నిర్ణయాలు తీసుకుంటే, వైసీపీలా పతనం తప్పదు.
ఎన్డీయేతో జతకట్టి విజయభేరి మ్రోగించిన టీడీపీకి అభినందనలు. అయితే ఈ విజయం ఆషామాషీగా దక్కింది కాదు. లక్షలాదిమంది కార్యకర్తల రెక్కల కష్టం. వేలాదిమంది నేతల శ్రమ. అంతకుమించి అధినేత చంద్రబాబునాయుడు మేధస్సు. కాయకష్టం. ప్రజావ్యతిరేకతను ఓటుగా మలిచిన చాణక్యం. లోకేష్, పవన్ కల్యాణ్‌ల దన్ను. అన్నీ కలసి వెరసి చంద్రబాబును నాలుగోసారి పాలకుడిగా గద్దెనెక్కేందుకు అక్కరకొచ్చిన అంశాలే. దీనికి ప్రధాన కారణం పవన్‌కల్యాణ్ సహకారం అన్నది మనం మనుషులం అన్నంత నిజం. పవన్‌ను తన దారిలోకి తెచ్చుకుని, ఆయనతో సమన్వయం నెరిపిన రాజకీయ చతురతే ఈ ఘన విజయానికి అసలు రహస్యం.
ఈ అపూర్వ-అనన్య-అనితర సాధ్యం-అద్భుతమైన విజయంతో కూటమి పొంగిపోతే అది పొరపాటే. అసలు కష్టం ఇప్పుడే మొదలుకాబోతోంది. ఇప్పుడు దక్కింది అధికారం అనుకుంటే పొరపాటే. అది పెను బాధ్యతగానే గుర్తించాలి. జగన్ పాలనా వ్యవస్థతోపాటు, ఖజానాను కుప్పకూల్చారు. అప్పుల చిప్ప అందించి వెళ్లిపోతున్నారు. దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల అప్పులు, భద్రంగా చంద్రబాబు చేతికి ఇచ్చి నిష్క్రమిస్తున్నారు. సంక్షుభిత రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంతోపాటు, ఖాళీ అయిన ఖజానాను పూడ్చడం ఆర్ధిక నిపుణుడైన బాబుకు సరికొత్త సవాలు. కేంద్రంలో ఎన్డీయేనే అధికారంలో ఉన్నందున సాయానికి కొదవ ఉండకపోవచ్చు. కాకపోతే ఏపీలోని బీజేపీ నేతల భిన్న స్వరాలతోనే రాజకీయంగా ఇబ్బంది.
కానీ జగన్ పతనాన్ని దగ్గరుండి శాసించిన ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలివ్వడమే చంద్రబాబుకు తక్షణ సవాలు. జగన్ పెండింగ్‌లో పెట్టి వెళ్లిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు అంశం కత్తిమీద సాము. జగన్ నేర్పిన గుణపాఠాలతో ఉద్యోగులు ఇకపై గొంతెమ్మకోర్కెలు కోరకుండా, తమ స్థానమేమిటో తెలిసి నడుచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగులకు వైసీపీ దన్ను కూడా ఉండదు. ఉద్యోగుల ఓట్లకు కతె్తర పెట్టాలని ఢిల్లీదాకా వెళ్లిన వైసీపీని, ఉద్యోగులు ఏ మొహం పెట్టుకుని ఆశ్రయిస్తారు?
ఫలితాలు పరిశీలిస్తే, రాష్ట్రంలోని దాదాపు అన్ని వర్గాలూ కూటమికే పట్టం కట్టినట్లు స్పష్టం చేస్తున్నాయి. అంటే అందరి ఆశలు నెరవేర్చడం కూటమికి సవాలు. సంక్షేమ పథకాలు అందుకున్న వారు సైతం కూటమికే జై కొట్టారంటే, కూటమి మేనిఫెస్టోపై పెట్టుకున్న ఆశలే దానికి కారణం. మేనిఫెస్టోను సంపూర్ణంగా అమలుచేయడం పైనే కూటమి భవితవ్యం ఆధారపడి ఉంది. కూటమి మధ్య సమన్వయం కొనసాగించడం కూడా ఒక సవాలే. నిజం చెప్పాలంటే.. అసలు కూటమి ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా ఎన్నికల్లో విజయం సాధించేది. ల్యాండు టైటిలింగ్ యాక్టు, పాసు పుస్తకాలపై జగన్ ఫొటో అంశాలే జగన్ ఓటమిని శాసించాయి. జగన్ అన్ని పథకాలిచ్చినా జనం ఎందుకు ఓటు వేయలేదంటే.. సంక్షేమ పథకాల తాయిలాలు విజయానికి గీటురాయి కాదన్నది తేలిపోయింది.
ప్రధానంగా..ఈ ఐదేళ్లలో పార్టీ జెండా మోసి ఆర్ధికంగా-శారీరంకంగా-రాజకీయంగా నష్టపోయిన వారిని ఆదుకోవడం చంద్రబాబు నైతిక బాధ్యత. చంద్రబాబు ఎప్పటిమాదిరిగా ఈసారి కూడా.. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులకు పెద్దపీట వేసి, పార్టీ కోసం పనిచేసిన వారిని చిన్నబుచ్చితే, వ్యతిరేకత వచ్చేందుకు పెద్దగా సమయం పట్టదని గ్రహించాలి. పాలకుడిగా ప్రభుత్వానికి ప్రాధాన్యం ఇచ్చి, పార్టీని విస్మరిస్తే మళ్లీ కష్టాలు తప్పవు. కష్టకాలంలో దన్నుగా నిలిచిన వారిని అందలెక్కిస్తేనే, బాబుపై ఉన్న పాత ముద్ర చెరిగేది.
సూటు-బూటు వేసుకున్నవారికే బాబు ప్రాధాన్యం ఇస్తారన్న భావన తొలగించాలన్నదే కార్యకర్తల మనోభావన. ఇక కొత్తగా చేరిన వారికి- పాత కాపుల మధ్య స్థానికంగా మనస్ఫర్ధలు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఎన్నికల ముందు భారీ సంఖ్యలో వైసీపీ నుంచి వచ్చి చేరిన వారికి సత్వరన్యాయం చేస్తే, అది పార్టీ జెండా మోసిన వారి మనోభావాలను గాయపరిచినట్టే అవుతుంది. ముందు వారి మధ్య సమన్వయం సాధించడమే సవాలు. ఐదేళ్లూ పార్టీకి దూరంగా ఉండి, ఇప్పుడు బోకేలు తీసుకువస్తున్న వారితో ప్రయోజనం ఏమిటన్న పార్టీ వాదుల ప్రశ్నను కొట్టివేయలేం. జనంలో తిరగకుండా, పార్టీ ఆఫీసులో హడావిడి చేసే వారికంటే జనం మధ్యలో తిరిగేవారికే పట్టం కట్టాలన్నది కార్యకర్తల మనోభావన.
ఐదేళ్ల తర్వాత గద్దెనెక్కుతున్న టీడీపీ.. అదే ఐదేళ్ల క్రితం తన పతనానికి దారితీసిన పరిస్థితులు గుర్తు చేసుకుని, అడుగులు వేయటం అనివార్యం. ఐదేళ్ల క్రితం పార్టీపై వేసిన కులముద్ర వల్ల, అనుభవంలో వచ్చిన ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే మళ్లీ కష్టాలు తప్పవు. ఎందుకంటే కులం-మతం ప్రమాదకరమైన అస్త్రాలు. చంద్రబాబు చేతికి పార్టీ పగ్గాలు వచ్చిన తర్వాత, ఏ ఎన్నికల్లోనూ రెండోసారి పార్టీ విజయం సాధించలేదు.
దాన్ని దృష్టిలో ఉంచుకుని, మరో 30 ఏళ్లు వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలంటే..నమ్ముకున్న వారిని కులాలకు అతీతంగా సామాజికన్యాయం తప్పనిసరి. ప్రభుత్వంలో భాగస్వామ్యం లేని కులాలను అందలమెక్కించడం మరో బాధ్యత. ప్రభుత్వంలో ఒకే కులం వారికి ప్రాధాన్యం ఇస్తే వచ్చే గత్తర ఏమిటో జగన్ ద్వారా అర్ధమయింది కాబట్టి, జగన్ చేసిన తప్పులనే టీడీపీ చేయకపోవడం ఉత్తమం.
విపక్షంలో ఉన్నప్పుడు పార్టీనేతలను వేధించిన అధికారులు మళ్లీ కులం-మతం-ప్రాంతం కార్డుతో పాలకుల చుట్టూ చేరే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’లో ఆరితేరిన ఆ బాపతు అధికారులు అదే పనిలో ఉంటారు. ఉన్నారు కూడా! విశాఖ కలెక్టర్‌గా పనిచేసిన ఒక అధికారి, పొలిట్‌బ్యూరో సభ్యుడి దన్నుతో మళ్లీ వెలిగేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇక గతంలో బాబు పేషీలోనే పనిచేసి, తర్వాత జగన్‌కు దగ్గరైన ఓ ‘జాకెట్ అధికారి’ తాను మళ్లీ సీఎంఓలోకి వస్తున్నానని ప్రచారం చేసుకుంటున్నారట. ఆయన సతీమణి వైసీపీ లీగల్‌సెల్‌కు కర్త-కర్మ-క్రియలా వ్యవహరించారు. ఇవన్నీ కొన్ని ఉదాహరణలే. పైగా యవనేత లోకేష్ తరచూ చెప్పిన రెడ్‌బుక్ అమలుపై, ఇప్పుడు పార్టీ శ్రేణులు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. అందుకుభిన్నంగా జరిగితే క్యాడర్ మనోభావాలు దెబ్బతినడం ఖాయం.
విపక్షంలో ఉన్నప్పుడు అనేక రూపాల్లో పార్టీకి దన్నుగా నిలిచిన వారిని గుర్తించకపోతే, నాయకత్వంపై విశ్వసనీయత పోవడం ఖాయం. నేతలు ఎదురుచూసే నామినేటెడ్ పదవుల పంపిణీ బాబు జమానాలో ఎప్పుడూ ఆలస్యమేనన్న అపవాదును చెరిపేయడం కూడా, నాయకత్వం ముందున్న మరో కర్తవ్యం. ఈ సందర్భంలో జనాలకు ఏమీ చేయకపోయినా, నమ్ముకున్న నాయకులకు మాత్రం న్యాయం చేసిన నేతగా జగన్ సక్సెస్ అవడాన్ని విస్మరించకూడదు.
టీవీ చర్చల్లో తీరి కూర్చుని పార్టీ వాదనలు వినిపించేవారు, సెల్‌ఫోన్‌లలో నాలుగు పోస్టులు పెట్టేవారికంటే.. యుద్ధరంగంలో నిలబడి, ప్రత్యర్ధితో పోరాడిన వారికే పట్టం కట్టడం నాయకత్వ ధర్మం. జగన్ పుణ్యాన ఐదేళ్లపాటు ప్రధాన పోస్టులకు దూరమై, లూప్‌లైన్‌లో మగ్గుతున్న పోలీసు-రెవిన్యూ అధికారులకు మోక్షం కలిగించడం నైతిక బాధ్యతనే. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ముద్ర పడి, చంద్రబాబుకు నమ్మినబంటనే ఏకైక కారణంతో జగన్ వేధింపుల వల్ల, చివరివరకూ పోస్టింగుకు నోచుకోని.. సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వారికి, ఎలాంటి గుర్తింపు ఇస్తుందనేది నాయకత్వ విశ్వసనీయతకు పరీక్షలాంటిదే.
ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం జమిలిగా నడిపించడమే ఇప్పుడు సవాలు. అమరావతిని మునుపటి మాదిరి మీనమేషాలు లెక్కించకుండా, పట్టాలెక్కించడం మరో బాధ్యత. ప్రజలిచ్చిన ఐదేళ్ల అధికార కాలానికే పరిమితమయి, నిర్ణయాలు తీసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ప్రజల ఆశలు-కోరికలు-అవ సరాలు పెరిగిపోతుంటాయి. వారి కోరికలు అనంతం. ప్రజలను సంతృప్తిపరచడం బ్రహ్మదేవుడి తరం కూడా కాదన్నది అనుభవంలో రుజువయింది. కాబట్టి ఇరవై-ముఫ్ఫై ఏళ్ల సుదీర్ఘ ప్రణాళికల వల్ల ప్రయోజనం సున్నా.
నిరుద్యోగులకు ఉద్యోగ-ఉపాథి అవకాశాలు- రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, బాబు మాత్రమే తీసుకురాగలరన్న నమ్మకమే కూటమిని గెలిపించిందన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. జగన్ ఏరంగంలో అయితే విఫలమయ్యారో.. ఏ అంశాల్లో అయితే ప్రజావ్యతిరేకతకు గురయ్యారో.. ఏ నిర్ణయాలతో అయితే అన్ని వర్గాలకూ దూరమయ్యారో గ్రహించి, అందుకు భిన్నమైన బాటలో నడిస్తేనే వచ్చే ఐదేళ్లకు భవిష్యత్తు!