డాక్టర్ కాని డాక్టర్ కృష్ణంరాజు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయనేమీ ఎంబీబీఎస్ చదువుకోలేదు. పోనీ ఆర్‌ఎంపీగా పనిచేసిన అనుభవమూ లేదు. నటన తప్ప మరేమీ తెలియదు. కానీ ఆయన వద్దకు సినిమా తారలంతా వైద్యం కోసం వచ్చేవారు. ప్రధానంగా పచ్చకామెర్లు వచ్చిన ప్రతి సినిమానటుడు, ఆయన వద్ద వైద్యం చేయించుకున్న వారే అని తెలిస్తే ఆశ్చర్యపడక తప్పదు. ఆయనే డాక్టర్ కాని డాక్టర్.. రెబెల్ స్టార్ కృష్ణంరాజు.
తెలుగు సినీ పరిశ్రమ చెన్నైలో స్థిరపడిన రోజుల్లో కృష్ణంరాజు బిజీ నటుడిగా ఉన్నారు. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తన వద్దకు వచ్చిన తెలుగు, తమిళ నటులకు.. ఆయుర్వేద- హోమియోపతి వైద్యం చేసేవారు. ప్రధానంగా పచ్చకామెర్లతో బాధపడుతున్న నటులతోపాటు, చెన్నైలో ఉన్న తెలుగువారికీ మందులిచ్చి నయం చేసేవారు.
అప్పట్లో ఈ వ్యాధికి గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని ఇంటూరులో మాత్రమే ఆయుర్వేద చికిత్స ఉండేది. చేతిపైన కాల్చి మందువేసే వైద్య విధానం అప్పట్లో ఉండేది. చెన్నైలో ఉండే తెలుగువారు కూడా ఇంటూరుకు వెళ్లి వైద్య చేయించుకునేవారు. కృష్ణంరాజు ఎప్పుడయితే పచ్చకామెర్లకు వైద్యం ప్రారంభించారో, అప్పటినుంచి చెన్నైలోని తెలుగువారు ఇంటూరు వెళ్లడం మానేశారు. అంటే నటనతోపాటు, వైద్యం మీద ఆయనకు ఎంత పట్టు ఉందో స్పష్టమవుతుంది.
‘మేం చెన్నైలో ఉండగా చూసేవాళ్లం. తెలుగు, తమిళ అగ్రనటులే కాదు. చిన్న చిన్న నటులు, సాంకేకిత నిపుణులు కూడా కృష్ణంరాజుగారి వద్ద వైద్యం చేయించుకోవడం మేం స్వయంగా చూశాం. మరి ఆయన దానిని ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు. పెద్ద పెద్ద స్టార్లు కూడా ఆయన వద్దకు వైద్యానికి వచ్చిన రోజులన్నాయి’ అని అఖిల భారత కృష్ణంరాజు అభిమానుల సమాఖ్య గౌరవ సలహాదారు జొన్నలగడ్డ రామచంద్రశాస్త్రి తన అనుభవాలు గుర్తు చేసుకున్నారు.
అభిమానుల ఆదరణలో ఆయన తర్వాతే…
చెన్నైలో ఉన్న కృష్ణంరాజును అభిమానులు కలిసినప్పుడు ఆదరాభిమానాలు చూపించేవారు. ‘ఆయన వారిని అభిమానులుగా కాకుండా కుటుంబసభ్యుల మాదిరిగా చూసేవారు. చాలామంది కుటుంబసభ్యులతో వెళ్లి ఆయనను కలసిన రోజులున్నాయి. అభిమానులను కుటుంబసభ్యులుగా చూసినందుకే, ఇప్పటి తరం వారు.. కృష్ణంరాజు, ఆయన కుటుంబంతో ఇంకా అనుబంధం కొనసాగిస్తున్నార’ని జొన్నలగడ్డ రామచంద్ర శాస్త్రి చెప్పారు. ‘ఈరోజు ఉదయమే నాకు విచారకరమైన వార్త తెలిసి కుమిలిపోయా. ఆయనతో నాకు 1972 నుంచి అనుబంధం. కృష్ణంరాజు అభిమానసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశా. అభిమానులకు-ఆయనకు అనసంధానకర్తగా పనిచేయడం నాకు చాలా తృప్తినిచ్చింది. ఆయన నన్ను చాలా అభిమానించేవారు. వద్దన్నా నన్ను సెన్సార్ బోర్డు సభ్యుడిని చేశారు. గుంటూరులో మా ఇంటికిచాలాసార్లు వచ్చారు. ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమా వంద రోజుల ఫంక్షన్ గుంటూరులో నిర్వహించాం. నేను చివరిసారిగా కృష్ణంరాజును జులైలో కలిశా’నని రామచంద్రశాస్త్రి వెల్లడించారు.