* ప్రజలు కష్టాలుపడుతుంటే ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోయారు
* జనసేన బృందాలు బాధితుల సేవలో ఉన్నాయి
* తిరుపతి విమానాశ్రయంలో మీడియాతో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
భారీ వర్షాలు, వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి పలకరించే దిక్కు లేకుండా పోయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు కదలరు.. ఆయన వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి అన్నారు. ఏ మాత్రం పరిపాలనా దక్షత లేని వ్యక్తిగా జగన్ రెడ్డి తయారయ్యారు అని చెప్పారు. జల విలయం వల్ల నష్టపోయిన చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించేందుకు మంగళవారం నాదెండ్ల మనోహర్ తిరుపతికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు.
మనోహర్ మాట్లాడుతూ “ప్రజలు కష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేసి జిల్లాకు రూ.2 కోట్లు సాయం ప్రకటించడం విడ్డూరంగా ఉంది. బాధ్యత కలిగిన ఒక రాజకీయ పార్టీగా ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలిచేందుకు వచ్చాం. పార్టీ తరఫున వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, నిత్యావసర సరుకుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాం. జనసేన పార్టీ తరఫున వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు విడతల పర్యటనలు జరపాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మొదటి విడతగా తాను పర్యటించి వరద నష్టంపై అంచనాలు రూపొందిస్తాం. రెండో విడత పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే వరకు జనసేన పార్టీ పోరటం చేస్తుంద”న్నారు.మనోహర్ కి జనసేన పార్టీ నేతలు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్,కిరణ్ రాయల్, వినూత కోట, తాతంశెట్టి నాగేంద్ర, సుంకర శ్రీనివాస్, కొట్టే వెంకటేశ్వర్లు తదితరులు స్వాగతం పలికారు.