– భిక్కనూర్ రూట్లో వేలాడుతున్న రైలు పట్టాలు
-భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
– కామారెడ్డి బిక్కనూర్ మార్గంలో రైలు పట్టాల కింద పోటెత్తిన భారీ వరద
– భారీ గండి – ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం బీభత్సం సృష్టిస్తోంది. చెరువుల నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ రోడ్లు, కల్వర్టులు తెగిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది. ఇళ్లలోకి నీరు చేరి నిత్యవసరాలు తడిసి ముద్దయ్యాయి.
లో లెవల్ వంతెనలపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి రాకపోకలు నిలిపివేశారు. రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో అత్యధికంగా 41.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది, కామారెడ్డిలో 28 సెంటీమీటర్లు, మెదక్‌లోని హవేలీఘన్పూర్లో 26సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల బీభత్సం
ఎల్లారెడ్డి మండలంలో భారీగా వరద ప్రవహిస్తోంది. ఈ క్రమంలో కామారెడ్డి -భిక్కనూర్ మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీ గండిపడింది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. హైదరాబాద్-కామారెడ్డి మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు ట్రైన్లను రద్దు చేయగా, మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు. కాచిగూడ-మెదక్, నిజామాబాద్-తిరుపతి ట్రైన్లను రద్దు చేశారు.
తిమ్మారెడ్డి లోని కల్యాణి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై బొగ్గు గుడిసె సమీపంలో బ్రిడ్జి(వంతెన) నిర్మాణ పనులు చేపడుతున్న ఆరుగురు కార్మికులు వరదలో చిక్కుకున్నారు. డీసీఎంలో అమర్చినటువంటి నీళ్ల ట్యాంకర్ పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వరద కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో స్థానికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కామారెడ్డిలో భారీగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పట్టణాన్ని వరద నీరు చుట్టుముట్టింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు.
వరద నీటి నుంచి తమను రక్షించాలని జీఆర్ కాలనీవాసులు అధికారులను కోరుతున్నారు. మరోవైపు పట్టణంలో రోడ్డుపై నిలిపిన కార్లు వరద ధాటికి నీటిలో కొట్టుకుపోయాయి. బీబీపేట నుంచి కామారెడ్డి వైపు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్
భారీ వర్షాల దృష్ట్యా కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు రెస్క్యూ బృందాలు), ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.