- వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ లేదు… గుర్తింపు లేదు
- జగన్ రెడ్డి పాలనలో బీసీలు డమ్మీలుగా మారారు
- ఒక్క ఛాన్స్ ఇస్తే కార్మిక, కర్షక, విద్యార్థి, ఉద్యోగ వర్గాల భవిష్యత్తు నాశనం చేశారు
- వెనకబడిన తరగతుల్ని విభజించే పాలిస్తున్నారు
- జనసేన, టీడీపీ ప్రభుత్వంలోనే బీసీలకు రక్షణ
- వైసీపీకి బీసీ సోదరులు గుణపాఠం చెప్పాలి
- జయహో బీసీ సభలో జనసేన బీసీ నేతలు
వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ లేదు.. గుర్తింపు లేదు.. ఆత్మగౌరవం లేదు.. ఉత్తుత్తి కార్పోరేషన్లు పెట్టి బీసీలను ఈ ముఖ్యమంత్రి డమ్మీలుగా మార్చారని జనసేన పార్టీ బీసీ నేతలు స్పష్టం చేశారు. జనసేన, టీడీపీ ప్రభుత్వంలోనే వెనకబడిన తరగతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. మంగళగిరి వేదికగా ‘జయహో బీసీ’ బహిరంగ సభ వేదికగా జనసేన బీసీ నేతలు గళం విప్పారు. హల్లో బీసీ.. ఛోడో వైసీపీ.. అంటూ నినదించారు.
బీసీ సోదరులారా.. వైసీపీని వదిలిపెట్టండి: కొణతాల రామకృష్ణ
మాజీ మంత్రి, అనకాపల్లి జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్ధి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. “వైసీపీ ప్రభుత్వ దమనకాండకు అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందిపడుతున్నారు. ఒకప్పుడు అన్నపూర్ణగా అవతరించిన రాష్ట్రం జగన్ రెడ్డి పాలనలో భిక్షాటన చేసే పరిస్థితికి వచ్చింది. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే- పవన్ కళ్యాణ్ గారి నినాదం హల్లో ఏపీ బైబై వైసీపీ నినాదాన్ని బలపర్చాలి. హల్లో ఏపీ.. ఛోడో వైసీపీ.. హల్లో బీసీ.. బైబై వైసీపీ నినాదాన్ని మనమంతా ముందుకు తీసుకువెళ్లాలి. బీసీ సోదరులు వైసీపీని వదిలి పెట్టండి, రాష్ట్రానికి విముక్తి తీసుకురండి. ఒక్క అవకాశం ఇస్తే కార్మిక, కర్షకులను, విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తుల భవిష్యత్తు నాశనం చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు సిద్ధమయ్యారు. చివరికి వెనకబడిన తరగతుల్ని ముక్కలు చేసే పరిస్థితి తెచ్చారు. బీసీలకు జనసేన, టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే రక్షణ లభిస్తుంది. అరాచక వైసీపీకి గుణపాఠం చెప్పాలి. జనసేన, టీడీపీ ప్రభుత్వంలోనే మనకు తగిన న్యాయం జరిగేది. ఈ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో కూల్చేద్దాం” అన్నారు.
వైసీపీలో బీసీలకు విలువలేదు : వంశీకృష్ణ యాదవ్, జనసేన పార్టీ విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షులు
జనసేన పార్టీ విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షులు చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ “నా బీసీ.. నా బీసీ అంటున్న ముఖ్యమంత్రి మీ పార్టీ నుంచి బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు బయటకు వస్తున్నారో చెప్పాలి. అక్కడ బీసీలు ఆత్మ గౌరవం కోల్పోయాం. అక్కడ విలువలు లేవు. బీసీలను జగన్ డమ్మీలుగా తయారు చేశాడు. 56 కార్పోరేషన్లు పెట్టారు. ఏ ఒక్క కార్పోరేషన్ ద్వారా అయినా ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? వ్యాపారానికి ఒక్క లోను ఇచ్చారా? బీసీలకు పూర్వ వైభవం రావాలంటే జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలపాలి. జనసేన, టీడీపీ అధికారంలోకి రావాలి. బీసీలకు తలెత్తుకు తిరిగే పరిస్థితులు రావాలి” అన్నారు.
వైసీపీని బంగాళాశాతంలో కలిపేద్దాం : బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. “బీసీల వెన్ను విరిచిన వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో బంగాళాశాతంలో కలిపేందుకు అందరం సమాయత్తం కావాలి. జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా కృషి చేయాల్సిన బాధ్యత ఉంది.
బడుగు, బలహీన వర్గాల యువతకు ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో ఎక్కడ చదువుకుంటే అక్కడే ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు పొట్ట చేతపట్టుకుని పక్క రాష్ట్రాలకు పోవాల్సిన దుస్థితి. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు బీసీలు అంతా ఏకం కావాలి. బీసీలంతా ఏకమై అరాచకపాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వానికి పాడె కట్టి బంగాళాఖాతంలో కలిపేద్దాం” అన్నారు.
బీసీల వెన్నుపోటుదారుడు జగన్ రెడ్డి : పోతిన వెంకట మహేష్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి
జనసేన పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ.. “జగన్ ప్రభుత్వ హయాంలో గడచిన ఐదేళ్లలో ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టకపోగా, ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. నా బీసీ.. నా బీసీ అనే హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదు. బీసీలంతా మనకున్నఆదరణ, పెళ్లికానుక, ఫీజు రీఎంబర్స్ మెంటు, సబ్సిడీ రుణాలు లాంటి పథకాలన్నీ ఎందుకు రద్దు చేశాడో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి. బీసీల కోసం ఒక్క పథకమూ ప్రవేశపెట్టని దుర్మార్గుడు జగన్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో 16,800 మందికి రాజ్యాంగ బద్దంగా దక్కాల్సిన పదవులు దూరం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. బీసీల వెన్నుపోటుదారుడు జగన్ రెడ్డి. 56 కార్పోరేషన్లు పెట్టి ఒక్క రూపాయి రుణం ఇవ్వని వ్యక్తి బీసీల జీవితాలు ఏం తీర్చిదిద్దుతాడు? బీసీలంతా జనసేన, టీడీపీలతోనే ఉన్నారు. బీసీలను సొంత బిడ్డల్లా చూస్తున్న పార్టీలు జనసేన, టీడీపీలు. సవతి తల్లి ప్రేమ చూపేది వైసీపీ. బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని ఆకాంక్షించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. బీసీల ఆత్మగౌరవం నిలబడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా జనసేన, టీడీపీ కూటమిని బలపర్చాలి” అన్నారు.
మత్స్యకారుల్ని వైసీపీ నిర్లక్ష్యం చేసింది : బొమ్మిడి నాయకర్, జనసేన పార్టీ మత్స్సకార వికాస విభాగం ఛైర్మన్
పార్టీ మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మడి నాయకర్ మాట్లాడుతూ.. “బీసీలను రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లింది ఎన్టీఆర్ గారు అయితే వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఆలోచన చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బీసీలను రాజకీయంగా, ఆర్ధికంగా ముందుకు తీసుకువెళ్లాలన్న ఆకాంక్షతో ముందుకు వచ్చిన నేత పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మాత్రం కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాడు. 56 బీసీ కార్పోరేషన్లను నామ మాత్రంగా మార్చాడు. మత్స్యకార సోదరులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఒక్క జెట్టి కట్టింది కూడా లేదు. ఒక్క హార్బర్ నిర్మించింది లేదు. రాబోయే రోజుల్లో మనమంతా ఆలోచన చేసి మన కోసం నిలబడే నాయకుల్ని గెలిపించుకోవాలి”‘అన్నారు.
ఉత్తుత్తి కార్పోరేషన్లుతో మోసం చేశారు : చిల్లపల్లి శ్రీనివాస్, జనసేన పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్
చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “గత ఐదేళ్లలో జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఉత్తుత్తు కార్పోరేషన్లు పెట్టి, ఉత్తుత్తి పదవులతో బీసీలను మోసం చేసింది. ఈ ప్రభుత్వంలో శాసించే స్థాయి నుంచి బీసీలు యాచించే స్థాయికి వచ్చేశారు. జగన్ దుష్ట పరిపాలనే అందుకు కారణం. అలాంటి సమయంలో బీసీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు మేమున్నామంటూ ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మనకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన మన నాయకత్వానికి మనమూ అండగా నిలవాలని” అన్నారు.