– అయినా మా పార్టీ వారిపైనే కేసుల నమోదు
– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్, హిందూపురం నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ దీపిక
తాడేపల్లి: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైయస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ గుండాల దాడి జరిగిన రోజున ఎమ్మెల్యే బాలకృష్ణ, నియోజకవర్గంలోనే ఉన్నారని, ఆ స్థాయిలో విధ్వంసం సృష్టించినా ఆయన కనీసం మాట్లాడలేదంటే, తన ప్రోద్భలంతోనే దాడి జరిగినట్లు స్పష్టంగా తెలిసిపోతుందని పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్, హిందూపురం నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ దీపిక తేల్చి చెప్పారు. ఈ తరహా ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువలు ఏవిధంగా పతనం అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చని వారన్నారు.
దాడిలో పాల్గొన్న నిందితుల వివరాలను సీసీ కెమెరా ఫుటేజ్‌తో పాటు ఇస్తే వారిని శిక్షించాల్సింది పోయి, ఆ పని చేయకుండా, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపైనే ఎస్సీ అట్రాసిటీతో పాటు, హత్యాయత్నం కేసులు నమోదు చేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు ఆక్షేపించారు. ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం తమను భయపెట్టే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఉషాశ్రీ చరణ్, దీపిక తెలిపారు. .. ఈ దాడికి సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, ఎమ్మెల్యే బాలకృష్ణ సమాధానం చెప్పాలి.
హిందూపురం నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డిపై దాడి చేయాలనే ఉద్దేశంతో వచ్చిన టీడీపీ గుండాలు, అప్పుడు ఆయన అక్కడ లేకపోవడంతో, పార్టీ ఆఫీస్‌లో విధ్వంసం సృష్టించారు. సీసీ కెమెరాల సాక్షిగా దాడిలో పాల్గొన్న రౌడీలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యల్లేవు. కానీ ఆ సమయంలో అక్కడ లేని హిందూపురం నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇంఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డితో పాటు, దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పార్టీ కార్యకర్తల మీద ఎస్సీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెట్టారు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే బాలకృష్ణకు తెలిసే పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది.