Suryaa.co.in

Telangana

దక్కన్ క్రానికల్ పత్రికకు హెచ్ఎండిఏ లీగల్ నోటీస్

-ఓఆర్ఆర్ లీజ్ అంశంపై నిరాధారమైన వార్త కథనం
-పత్రికా విలువలు పాటించాలని హెచ్ఎండిఏ విజ్ఞప్తి

హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లీజ్ అంశంపై వార్తా కథనాలు ప్రచురించే ముందు వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మీడియాకు విజ్ఞప్తి చేసింది. ఈ నెల 23వ తేదీ (మంగళవారం) ఇంగ్లీషు దినపత్రిక దక్కన్ క్రానికల్ లో ప్రచురితమైన నిరాధారమైన వార్తపై హెచ్ఎండిఏ తీవ్రంగా స్పందించింది.

దక్కన్ క్రానికల్ వార్త కథనంలోని అంశాలు పూర్తిగా అవాస్తవాలని, ఈ వార్తకథనం హెచ్ఎండిఏ ప్రతిష్టతతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉందని పేర్కొంది. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ నిబంధనలు పబ్లిక్ డొమిన్ లో అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని పరిశీలించకుండా, వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఏకపక్షంగా ప్రభుత్వ సంస్థ హెచ్ఎండిఏ ప్రతిష్టతకు భంగం కలిగించే విధంగా డెక్కన్ క్రానికల్ వ్యవహరించిందని, వార్తలో పేర్కొన్న అంశాల్లో ఏ మాత్రం వాస్తవం (నిజం) లేదని హెచ్ఎండిఏ స్పష్టం చేసింది.

సంచలనాల కోసం మీడియా బాధ్యతారాహిత్యంగా వార్తలను ప్రచురించరాదని హెచ్ఎండిఏ సూచించింది. రాజకీయ పార్టీలు, నాయకుల ఆరోపణలపై వాస్తవాలను నిర్ధారించుకొని వార్తలను ప్రజలకు, పాఠకులకు చేరవేయాలని హెచ్ఎండిఏ మీడియాకు విజ్ఞప్తి చేసింది.

డెక్కన్ క్రానికల్ పత్రిక పాఠకులను, ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వార్తా కథనాన్ని ప్రచురించిందని, తద్వారా హెచ్ఎండిఏ ప్రతిష్టతకు భంగం కలిగించే విధంగా వార్తా కథనాన్ని ప్రచురించడం ద్వారా పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చిందని హెచ్ఎండిఏ పేర్కొంది.

ఇదిలా ఉండగా డెక్కన్ క్రానికల్ తప్పుడు వార్తా కథనంపై ఐ.ఆర్.బి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ లిమిటెడ్ సంస్థ కూడా డెక్కన్ క్రానికల్ యాజమాన్యానికి లీగల్ నోటీస్ జారీ చేసింది. డెక్కన్ క్రానికల్ వార్తపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు కూడా ఫిర్యాదు చేసింది.

LEAVE A RESPONSE