Home » హోంమంత్రి.. త..త..త..త!

హోంమంత్రి.. త..త..త..త!

– సబిత, సుచరిత, వనిత, అనితకు పట్టం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఒక్కోసారి కాకతాళీయంగా జరిగే కొన్ని సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. అవి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-విభజిత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ విచిత్రమైన అనుభవమిది.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అద్భుత ప్రయోగం చేశారు. దివంగత ఇంద్రారెడ్డి భార్య సబితకు హోంమంత్రి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే ఒక మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చిన తొలి అనుభవం అది. అంతపెద్ద కీలక పదవిని సబిత నిర్వహించగలరా? అన్న సందేహం తెరపైకి వచ్చింది.

సీన్ కట్ చేస్తే… విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం జగన్.. మహిళా ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు హోంమంత్రి పదవి ఇచ్చి, ఏపీలో తొలి మహిళా ఏపీ హోంమంత్రి అన్న కీర్తి ఆమెకు అందించారు. తర్వాత ఎమ్మెల్యే వనితకు హోంమంత్రి పదవి ఇచ్చారు.

ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడు కూడా, అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి ఇచ్చి, గౌరవించారు. విచిత్ర మేమిటంటే.. సబిత మినహా మిగిలిన సుచరిత, వనిత, అనిత ముగ్గురూ దళితులే.

అయితే ఇప్పటి రాజకీయ ముఖచిత్రం.. ప్రాంతీయ పార్టీల అధిపత్యంలో, హోంమంత్రులకు అసలు అధికారాలు ఉంటాయా? లేదా? అన్నది మరో చర్చ. పేరుకు ఎవరు హోంమంత్రులున్నా.. కీలకమైన లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రుల దగ్గరే ఉంటుంది. దానితో హోంమంత్రులకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. చివరికి తమ నియోజకవర్గాల్లో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలను కూడా బదిలీ చేయించుకోలేరన్న ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. కేవలం బుగ్గకారు, ప్రొటోకాల్ మినహా హోంమంత్రులకు అంత విలువ ఉండదన్నది ఒక భావన.

పైగా మహిళ ఆ స్థానంలో ఉండటంతో, రాజకీయ ప్రత్యర్ధులు విమర్శలు చేయరన్న వ్యూహం కూడా.. మహిళలకు హోంమంత్రి పదవులు ఇవ్వడానికి మరో మతలబన్నది రాజకీయ పరిశీలకుల ఉవాచ.

Leave a Reply