- రైతులపై అక్రమంగా కేసులు పెట్టించిన ప్రభుత్వం ఇదీ
- మాండౌస్ తుపాను పరిహారం ఇప్పటికీ అందలేదు
- కళ్లెదుటే రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే చలనం లేని ప్రభుత్వం
- దేశంలోనే ధనిక సీఎం జగన్ రెడ్డి తన సంపద నుంచి పైసా కూడా పేదలకు ఇవ్వలేదు
- ప్రధాని జమ చేసిన నిధులకు మీ హడావుడి ఎందుకు..?
- హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో మీడియా సందేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
సొంత ఇంట్లో కన్న తల్లి, సొంత చెల్లి వద్దన్న బిడ్డగా ముద్రపడిన జగన్ రెడ్డిని ఏ కుటుంబమూ బిడ్డగా ఒప్పుకోదు అంటూ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని పదేపదే మీ బిడ్డ అంటూ ముఖ్యమంత్రి మాట్లాడటం ఆపాలన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘మాండౌస్ తుపాను పంట నష్ట పరిహారాన్ని ఇప్పటికీ సరిగా అందించని ప్రభుత్వం ఇదీ. రైతులు వేదనలో ఉంటే కనీసం వారిని పలకరించని జాలి లేని నాయకుడు జగన్ రెడ్డి. డెల్టా రైతులు పంట నష్టపోయిన ప్రతిసారీ వారిని అనాధలుగా వదిలేశారు.
ధాన్యం కొనమని అడిగితే అరెస్టులు
పండించిన ధాన్యం కొనండని రైతులు ప్రశ్నిస్తే, వారిని అక్కడికక్కడే వీధి రౌడీల మాదిరి అరెస్టు చేయించిన ఈ పాలకుల దాష్టీకం రైతాంగం ఇంకా మర్చిపోలేదు. నిన్ననే కర్ణాటక టూర్ లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తే, మళ్లీ అవే డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కడం ఏమిటి..? నాలుగేళ్లకు కలిపి ప్రతి రైతుకు రూ.54 వేల సాయం అందించామని చెబుతున్న ఈ ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలతో వారిని మభ్య పెడుతున్నారు. ఈ నాలుగేళ్లలో రైతులకు ఈ ప్రభుత్వం ద్వారా అందింది కేవలం రూ.26 వేలు మాత్రమే. దీనికోసం ఇంతటి ఖర్చులెందుకు..?
తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ ప్రయాణమా?
26 కిలోమీటర్ల దూరం ఉన్న తాడేపల్లి నుంచి తెనాలికి కనీసం రోడ్డు మార్గం ద్వారా వెళ్లని ముఖ్యమంత్రికి.. తన పాలనలో గుంతలు పడి ఉన్న రోడ్లను చూసే తీరిక లేదు. హెలికాప్టర్ పర్యటనలకు అలవాటు పడిన ఈ ముఖ్యమంత్రికి ప్రజల బాధలెలా తెలుస్తాయి..? రూ.6,300 కోట్ల అవినీతికి మూలమైన రైతు భరోసా కేంద్రాల గురించి ఈ ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నాడు. మరి అంత ఖర్చు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఎందుకు జరగడం లేదు. అక్కడ అందాల్సిన కనీస సేవలు ఎందుకు అందడం లేదో ఈ ముఖ్యమంత్రి పరిశీలించింది లేదు.
ధనిక ముఖ్యమంత్రి క్లాస్ వార్ అంటుంటే ప్రజలు నవ్వుతున్నారు
దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా రికార్డు ఉన్న జగన్ రెడ్డి ఇప్పుడు క్లాస్ వార్ అంటూ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. పేదలను మరింత పేదలు చేసి, ధనవంతుడు అయిన ముఖ్యమంత్రి మరింత ధనవంతుడిగా మారుతున్నాడు. ఇదే ఆయన చెబుతున్న క్లాస్ వార్. జగన్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన సంపాదించిన దానిలో 10 శాతం రాష్ట్ర ప్రజలకు పంచి అప్పుడు వార్ లు గురించి మాట్లాడాలి. ఏనాడూ పైసా కూడా పేదలకు ఇవ్వలేదు. ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ చేసే దమ్ము, పోరాడే దమ్ము జనసేనకు ఉంది. ఎన్నికల వేళ అది చూసుకుందాం. ముందు ప్రజాధనంతో నిర్వహించే ప్రభుత్వ సభల్లో ఎలా మాట్లాడాలో, రాజకీయ ఉపన్యాసాలెందుకు ఇవ్వకూడదో ఈ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. చాలా ఆవేశంతో జగన్ రెడ్డి చెప్పే మాట సామాన్యుడికి సైతం నవ్వు తెప్పిస్తోంది. కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఎందుకు ఇవ్వడం లేదో మొదట సమాధానం చెప్పిన తర్వాత జగన్ రెడ్డి రైతు సంక్షేమం గురించి మాట్లాడితే బాగుంటుంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను నిండు మనసుతో ఆదుకున్న పార్టీ జనసేన. సత్తెనపల్లిలో ఒకేసారి 208 మంది కౌలు రైతుల కుటుంబాలను జనసేన పార్టీ ఆదుకుంది. కళ్ల ముందే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా ఈ ప్రభుత్వంతో మాత్రం కనీస చలనం లేదు. రూ.1.93 లక్షల కోట్లను రైతుల కోసం వినియోగించామని చెబుతున్న సీఎంకు, క్షేత్రస్థాయిలో ఆ సొమ్ము కనీసం 40 శాతం మందికి కూడా అందలేదన్న వాస్తవం గ్రహించాలి.
బెదిరించి సభలు పెట్టడం మీకే చెల్లింది
తెనాలి సభ కోసం 450 ఆర్టీసీ బస్సులు ఉపయోగించారు. ప్రైవేటు పాఠశాలల బస్సులను వదల్లేదు. వారం రోజుల క్రితమే వాలంటీర్లకు, డ్వాక్రా సంఘాలకు జనసమీకరణ బాధ్యతలు అప్పగించారు. సీఎం సభలో చప్పట్లు ఎప్పుడు కొట్టాలి..? ఈలలు ఎప్పుడు వేయాలో కూడా శిక్షణ ఇచ్చి సభకు తీసుకెళ్లారు. టార్గెట్లు పెట్టి, బెదిరించి జనాన్ని తీసుకొచ్చారు. తెనాలిలో కరెంటు కట్ చేసి, ఆస్పత్రిలో జనం చనిపోయేలా చేశారు. ఇవన్నీ చేసి సభలు పెట్టుకొని, మీ జబ్బలు మీరే చరుచుకోవడమే మీ నైజం. ఒక్క కుటుంబానికి ఉపయోగపడని సభలతో అల్లకల్లోలం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తే కొత్త రోడ్లు వేస్తారనే ఆశ జనంలో ఉండేది. ఈ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తిరగడంతో ఆ ఆశ పోయింది. ఇకనైనా ముఖ్యమంత్రి హెలికాప్టర్ వదలి, రోడ్డు బాట పట్టి జనం బాధలను గమనించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.