– గతంలో ఏపీపీఎస్సీ బాధితులకు బాబు బాసట
– ఉద్యోగాలు పొందిన వారిని తొలగిస్తామని హామీ
– నిరుద్యోగుల పోరాటానికి మద్దతునిచ్చిన చంద్రబాబు
– బాబు ఆనాటి ప్రెస్కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలి
– ఇప్పుడు జగన్ సర్కారు నిర్ణయమని కోర్టులో ఏజీ దమ్మాలపాటి ఎలా వాదిస్తారు?
– నాడు గౌతం సవాంగ్ అఫిడవిట్నే నేడు కూటమి ఎలా సమర్ధిస్తుంది?
– ఏజీ దమ్మాలపాటి ఎవరివైపు వాదించినట్లు?
– మరి చంద్రబాబు నాటి హామీ మాట ఏమైనట్లు?
– ఏపీపీఎస్సీ కేసు లో ఏజీ తీరుపై ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నేత మహంకాళి సుబ్బారావు ఆగ్రహం
అమరావతి: 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలలో జరిగిన అవతవకలపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు మహంకాళి సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ..గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఆనాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు ఏకపక్షంగా థర్డ్ పార్టీకి ఇచ్చి డిజిటల్ మూల్యంకనం చేయించడం జరిగింది. కొంతమంది నిరుద్యోగులు నోటిఫికేషన్ లో డిజిటల్ మూల్యంకనం పొందుపరచలేదు కాబట్టి, పాత పద్ధతిలో మ్యాన్యువల్ మూల్యంకనం చేయించాలని హైకోర్టుకి వెళ్లడం జరిగింది.
కోర్టు మ్యానువల్ పద్ధతిలో మూల్యాంకనం చేయమని చెప్పడం జరిగింది. ఏపీపీఎస్సీ మాన్యువల్ ఆవాస రిసార్ట్, (హాయ్ ల్యాండ్)లో 65 రోజులు పాటు సుమారు కోటి 19 లక్షలు ఖర్చు పెట్టి 5- 12- 2021 నుండి26- 2- 2022 వరకు మూల్యాంకనం కూడా జరిపి, పలితాలు కూడా సిద్ధం చేసినట్లు అన్ని ఆధారాలను కోర్టుకి సమర్పించి సింగిల్ బెంచ్ లో వాదనలు వినిపించి అభ్యర్థులు న్యాయం పొందడం జరిగింది.
ఈ అంశంలో అప్పటి చైర్మన్ గౌతమ్ సవాంగ్ కోర్టు ను తప్పు దోవ పట్టిస్తూ, హాయ్ ల్యాండ్ లో ఎటువంటి మూల్యాంకనం జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసి కోర్టును తప్పు దోవ పట్టించడం జరిగింది.
ఈ అంశాల పై అప్పటి ప్రతి పక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ తీర్పు పై సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి.. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, జగన్ ప్రభుత్వంలో గల అవినీతి పై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత, నిరుద్యోగుల అందరికీ అండగా ఉంటామని, అవినీతి తో పొందిన ఈ అభ్యర్థులను కోర్టు పేర్కొన్నట్లు తక్షణమే తొలగించి, కోర్టు తీర్పును అమలు చేస్తూ నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టు తిరస్కరించిన ఆ అభ్యర్థులకు అనుకూలంగా, అప్పటి జగన్ ప్రభుత్వం చేసిన నియామకాలలో ఎటువంటి తప్పులు లేవని కోర్టులో అడ్వకేట్ జనరల్ తో కోర్టుకి చెప్పారు. బాబు ప్రెస్ నోట్ ను న్యాయమూర్తి, కోర్టు హాల్ లో గుర్తు చేస్తూ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించడం గమనార్హం.
బాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని నిరుద్యోగ పేద అభ్యర్థులు కోరుతున్నారు. ఏపీపీఎస్సీ, ప్రభుత్వం తమ జీవితాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి కోర్టు నిబంధనలకు లోబడి, నియామకాలు పొందిన ఈ అభ్యర్థులును తొలగించి, సమగ్ర విచారణ చేపట్టి సిబిఐ తో చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించి నిరుద్యోగులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.