– మీ చీకటి ఒప్పందం తెలంగాణ ప్రజలకు చెప్పండి
– బనకచర్లపై నిమ్మల చెప్పింది రైటా? రేవంత్ చెప్పింది రైటా?
– 65 టీఎంసీలు ఏపీకి, చంద్రబాబుకు గురుదక్షిణ
– రాష్ట్రంలో బిజేపీ, టీడీపీ రిమోట్ పాలన
– తెలంగాణ పాలిట రేవంత్ మరణ శాసనం రాసిండు
– పాలన రేవంత్, డైరెక్షన్ చంద్రబాబు
– టెలిమెట్రీ కొత్తగా పెట్టిందేం ఉంది?
– ఈ ద్రోహానికి నిన్ను ఎన్ని కొరడాలు కొట్టాలి రేవంత్ రెడ్డి?
– తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు వెళ్లి సవాల్ విసిరితే రేవంత్ రెడ్డికి మొహం చాటేసిండు.క్లబ్బులకు పబ్బులకు రాను అని బిల్డప్ ఇచ్చిండు.
ఈరోజు రేవంత్ సెవన్ స్టార్ హోటల్ లీలా ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెట్టిండు. అధికారిక నివాసం ఉంటది ఢిల్లీలో. తెలంగాణ భవన్ ఉంటది. అక్కడ
ప్రెస్ మీట్ పెట్టలేదు. రేవంత్ మాటలకు చేతలకు పొంతన లేదు.
బనకచర్లపై బాబు మీటింగ్ పెడితే ఢిల్లీ మీటింగ్ వెళ్ళబోమని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి, అర్ధరాత్రి పూట పరుగు పరుగున ఎందుకు పోయాడు? బాయ్ కాట్ చేస్తం అని లీకులు ఇచ్చాడు. ఎందుకు డిల్లీకి వెళ్లావు? అర్ధరాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏమిటి. ఎందుకు ఢిల్లీకి పోయావు రేవంత్ రెడ్డి
సమాధానం చెప్పు. గతంలో నీతి అయోగ్ మీటింగ్ కు పోను అని అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి, ఆ తర్వాత నీతి అయోగ్ మీటింగ్ లో అటెండ్ అయ్యారు.
ఊసరవెల్లి కూడా రేవంత్ ను చూసి సిగ్గుపడుతుంది. బనకచర్ల అంశం నేటి ఎజెండాలో లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు అని రేవంత్ రెడ్డి బుకాయించిండు. అజెండాలో మొట్ట మొదటి అంశం గోదావరి బనకచర్ల ప్రాజెక్టు. కానీ ప్రెస్ మీట్ లో అబద్దం చెప్పారు. ఏపీ మంత్రి నిమ్మల మో
బనకచర్ల పై చర్చించాం అంటడు. పరిష్కారం కోసం కమిటీ వేసాం అంటడు. రేవంత్ రెడ్డి ఏమో బనకచర్ల చర్చ రాలేదు అంటడు. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడవచ్చునా? ఎవర్ని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి?
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. ఏపీకి, చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లించేందుకు ప్రజలు నిన్ను ఎన్నుకోలేదు. నిజం నిప్పు లాంటిది వాస్తవం దాగదు. రాష్ట్ర ప్రజలకు అబద్దాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పు. రేవంత్ రెడ్డి బుకాయించడం అంటే ప్రజలను వంచిచడమే, మోసం చేయడమే.
రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ద్రోహి. పక్కనున్న ఉత్తం చేస్తున్నడు. రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదు, బిజేపీ, టీడీపీ రిమోట్
పాలన. కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ లో టీడీపీ కోవర్టులు ఉన్నారన్నరు. బనకచర్లపై మీటింగ్ పెడితే కలిసేదే లేదు అన్నడు. ఈరోజు పరుగు పరుగున వెళ్లిండు. కమిటీ వేయడానికి ఒప్పుకున్నడు.
చంద్రబాబు చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. రాష్ట్రానికి నష్టం జరిగితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే పోరాటం చేస్తా, సుప్రీం కోర్టుకు వెళ్తా
అనాలి. కానీ ఒప్పుకుంటా అని ఎలా అంటావు రేవంత్ రెడ్డి? కేంద్ర ప్రభుత్వం గోదావరి బనకచర్ల మీటింగ్ పెట్టడమే తప్పు. సెంట్రల్ వాటర్ కమిషన్,
జీఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్టు అథారిటిలు బనకచర్ల ప్రీ ఫీజబులిటి రిపోర్టును తిరస్కరించాయి.
పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థలు నిర్ద్వంద్వంగా అనుమతులు తిరస్కరించాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించాక కేంద్రం ఎలా మీటింగ్ పెట్టింది? రేవంత్ రెడ్డి వెళ్లి కమిటీ వేయండి, కమిటీ ఎట్లా చెబితే గట్ల అని ఎట్ల అంటడు. రాష్ట్ర విభజన చట్టం, జీఆర్ఎంబీ, అపెక్స్ అనుమతి ఇవ్వకుండా బనకచర్లను రిటర్న్ కొడితే, దానికి రేవంత్ రెడ్డి నేడు కమిటీపై సంతకం పెట్టడం ఏమిటి?
రేవంత్ తెలంగాణకు చేస్తున్న ద్రోహం ఇది. తెలంగాణ పాలిట రేవంత్ మరణ శాసనం రాసిండు. కేసీఆర్ ఉన్నంత కాలం, బిఆర్ఎస్ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయి. అపెక్స్ మీటింగ్ డిమాండ్ చేయకుండా ఇంటర్నల్ మీటింగ్ పెడితే ఎందుకు వెళ్లిండు. బీజేపీ ఒత్తిడినా, బాబు ఒత్తిడినా ఏ ఒత్తిడి పని చేసింది?
బాబు, బిజేపీతో ఉన్న భాయి భాయి రాజకీయాలపై, ఒప్పందాలపై రేవంత్ సమాధానం చెప్పాలి. తెలంగాణకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి, పాలమూరును వ్యతిరేకించిన వ్యక్తిని రాష్ట్ర సలహాదారుగా ఎలా పెట్టుకుంటారు? పాలన రేవంత్, డైరెక్షన్ చంద్రబాబు. బాబు చెబితే రేవంత్ పదవులు ఇస్తున్నాడు కాంగ్రెస్ నామినెటెడ్ పోస్టుల్లోనూ బాబు మాటలు రేవంత్ శిరసా వహిస్తున్నడు. చంద్రబాబును విమర్శించాల్సింది పోయి, కేసీఆర్ ను విమర్శిస్తవా?
మొన్నటి పీపీటీలో చంద్రబాబును ఒక్క మాట అనలేదు. పోరాటం ఎవరి మీద తెలంగాణ సాధించిన కేసీఆర్ మీదనా, తెలంగాణకు మోసం చేస్తున్న చంద్రబాబు మీదనా?
ఏపీలో కూటమి పాలన, తెలంగాణలో విష కూటమి పాలన నడుస్తున్నది టెలిమెట్రీ కొత్తగా పెట్టిందేం ఉంది. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు వరకు
బిఆర్ఎస్ హయాంలోనే పెట్టారు. అన్ని ప్రాజెక్టుల వద్ద పెట్టాలని బిఆర్ఎస్ అడిగింది.
కేఆర్ఎంబీ ఆఫీసు హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకుపోతే విజయం సాధించిన అంటడు. అధికారంలోకి రాగానే కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నడు. కేసీఆర్ గర్జిస్తే నిర్ణయం వెనక్కి తీసుకున్నరు.
కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయించారు. 20 నెలల్లో నువ్వు సాధించింది ఏముంది రేవంత్ రెడ్డి? పెద్దవాగు కొట్టుకుపోయింది, సుంకిశాల కూలింది, ఎస్ ఎల్ బీసీ కుప్పకూలింది, జూరాల గేట్లు రోప్స్ తెగిపోయినయి.
కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని అనడానికి నువ్వు ఎవరు రేవంత్ రెడ్డి? కృష్ణాలో న్యాయమైన వాటా కోసం సెక్షన్ 3 సాధించిండు కేసీఆర్. ట్రిబ్యునల్ అవార్డు వస్తే ఏడు, ఎనిమిది వందల టీఎంసీలు వస్తయి. ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రికి అవగాహన లేదు, చిత్త శుద్ది లేదు.
17.24లక్షల ఎకరాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ఆయకట్టు తెచ్చింది. 30లక్షల ఎకరాలు స్థిరీకరణ చేసాం 20 నెలల్లో ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చావా రేవంత్ రెడ్డి? కేసీఆర్ ను తిట్టడం తప్ప, తెలంగాణ సాగు నీటి రంగంలో కాంగ్రెస్ సాధించింది గుండు సున్న. నోటి తీట తప్ప, నీటి వాటా సాధించాలనే చిత్త శుద్ది లేదు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొద్దని రిటర్న్ ఇంజినీర్లు చెప్పారని అబద్దాలు చెప్పిండు. గోదావరి మీద నిపుణుల సలహాలు అడుగు. ఎవర్ని అడగకుండా ఎందుకు పోతవు?
పరుగెత్తి ఎందుకు మీటింగ్ వెళ్లావు, ఎందుకు కమిటీకి ఒప్పుకున్నావు?
రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం ఇది. ఈ ద్రోహానికి నిన్ను ఎన్ని కొరడాలు కొట్టాలి రేవంత్ రెడ్డి?
నీళ్ల విషయంలో నిజాయితీ ప్రదర్శించు, లేదంటే తెలంగాణ ప్రజలు నీళ్లలో ముంచుతారు. ఇచ్చే నీళ్ళు వాడుకునే తెలివి లేదు. తాత్కాలిక వాటా ప్రకారం నీళ్లు వాడుకోని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్. 65 టీఎంసీలు ఏపీకి, చంద్రబాబుకు గురుదక్షిణగా ఇచ్చారు. కల్వకుర్తి మోటార్లు ఆన్
చేయాలని మేం అడిగితే అప్పుడు నిద్ర లేచి ఒత్తారు. 36 రోజులు నీళ్లు కిందకు వెళ్లిపోయాయి కదా.
ఈరోజు చేసిన ద్రోహానికి చెంపలు వేసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ బనకచర్లను ఒప్పుకోదు. అఖిల పక్షం డిల్లీకి తీసుకుకోవాలని గతంలోనే డిమాండ్ చేశారు. మాకు బేషజాలు లేవు, మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మీలాగా రాజకీయాలు ముఖ్యం కాదు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి, బాబు ప్రయోజనాల కోసం చేసావు. రేవంత్ రెడ్డి చీకటి ఒప్పదం తేటతెల్లం అయ్యింది. బేషరతుగా క్షమాపణలు చెప్పు.