– రిలీవ్ కావద్దని ఆదేశించినా ఎలా వెళ్లారు?
– ఆయనకు సహకరించిన వారెవరు?
– గతంలో ఆయనను తెచ్చింది ఇప్పటి కీలక మంత్రేనట
– కులాభిమానంతోనే సత్యనారాయణను ‘కాపు’కాశారట
– భారతీరెడ్డి-దనంజయరెడ్డి చెబితేనే బిల్లుల చెల్లింపులు
– బిల్లులపై భారీ కమిషన్ల వసూలు?
– దానికోసం సీఎంఓలోనే ప్రత్యేక వ్యవస్థ?
– హైదరాబాద్‌లో కమిషన్ల చెల్లింపులు?
– వైసీపీ నేతలకూ బిల్లులు చెల్లించని వైనం
– భారతీరెడ్డి చెప్పిన వారికే ప్రాధాన్యమట
– చివరిలో చిన్న బిల్లు ‘మేఘా’కేనట
– చిక్కుల్లో ‘ఫైనాన్స్ సత్యనారాయణ’
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంధ్రప్రదేశ్‌ను అప్పులాంధ్రగా మార్చి.. చివరకు పంచాయతీరాజ్ శాఖలో వాటర్ ట్యాంకర్లను కూడా తాకట్టుపెట్టించే ఉపాయాలు చెప్పి.. చంద్రబాబునాయుడు సర్కారుకు ఖాళీ ఖజానా అప్పగించడానికి కారణమైన ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ ఎవరికీ చెప్పకుండా ఎలా రిలీవ్ అయ్యారు? ఎలా జంపయ్యారు? ఒకవైపు ఎవరినీ రిలీవ్ చేయవద్దని సీఎం చంద్రబాబు ఆదేశించినా లెక్కచేయకుండా, సత్యనారాయణ తిరిగి రైల్వేకు మళ్లీ ఏ ధైర్యంతో వెనక్కి వెళ్లగలిగారు? అందుకు ఆయనకు సహకరించిన శక్తులెవరు? ఇందులో కేంద్రప్రభుత్వంలో ఆయన సహచరుల ప్రమేయం ఏమైనా ఉందా? లేక గతంలో ఆయనను ‘కులాభిమానం’తో ఏపీకి తీసుకువచ్చిన, ప్రస్తుత మంత్రి హస్తం ఏమైనా ఉందా? శుక్రవారమే సత్యనారాయణ ఆర్ధిక శాఖలో అప్పగింతలు పూర్తి చేశారంటే, ఆయన ముందస్తుగానే ప్రయాణానికి సిద్ధమయ్యారా?.. ఇదీ ఇప్పుడు అధికార-రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్.
ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బాధ్యతల నుంచి రిలీవ్ కావొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
మూడు రోజుల కిందట సత్యనారాయణ నేరుగా వెళ్లి నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో జాయిన్ అయ్యారు. రైల్వే ఉన్నతాధికారులు సైతం ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇచ్చారు.
ఇంతవరకూ బాగానే ఉంది. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలంటే సత్యనారాయణకు రిలీవింగ్ ఆర్డర్ కావాలి. ఈలోపే విషయం తెలుసుకున్న సీఎస్ నీరబ్ కుమార్, రిలీవ్ కావొద్దంటూ ఆదేశించారు. ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్ సిక్ లీవ్‌లో ఉండటంతో, ఈనెల 18న రిలీవ్ కావాల్సిన అవసరం లేదంటూ సీఎస్ స్పష్టం చేశారు.
కాగా సత్యనారాయణ గత శుక్రవారమే, తన శాఖలో అప్పగింతలు పూర్తి చేశారట. అధికారుల సీఆర్ రాసేశారు. సిబ్బందికి 450 ట్యాబ్‌ల కొనుగోలుకు మంజూరు కాగా, అందులో 50 ట్యాబ్‌లు పంపిణీ చేశారట. చివరగా మేఘా కంపెనీకి కోటిరూపాయలకు పైగా ఉన్న బిల్లు ఒకటి ఆమోదించారట. ఇవన్నీ శుక్రవారమే పూర్తి చేశారంటే.. జంపయ్యేందుకు సత్యనారాయణ రంగం సిద్ధం చేసుకున్నారని అర్ధమవుతూనే ఉంది.
రైల్వేశాఖ అధికారి అయిన సత్యనారాయణను.. 2017లో అప్పటి టీడీపీ సర్కారులో కీలకపాత్ర పోషించిన ఒక మంత్రి, ‘కులాభిమానం’తో ‘కాపు’కాసి ఏపీకి డెప్యుటేషన్‌పై తీసుకువచ్చారన్నది బహిరంగ రహస్యమే. ఆ తర్వాత ప్రభుత్వం మారి జగన్ సీఎం కావడంతో, సత్యనారాయణ ఆయనకు చేరువయ్యారు. నరమానవుడికి సైతం తెలియని అప్పుల రహస్యాలను, జగన్ ముందు విప్పడంతో ఆయన ఫిదా అయ్యారు. దానితో సత్తిబాబు అప్పుల అద్భుతాలకు మంత్రముగ్ధుడైన జగన్.. ఆ అప్పులు తెచ్చే బాధ్యతను ఆయనకే అప్పగించారు.
దానితో సత్యనారాయణ అమరావతిలో కంటే, ముంబయిలోనే ఎక్కువ కాలం గడిపేవారు. ఆర్బీఐ, కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులతో సత్సంబంధాలుండటంతో బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు తీసుకువచ్చేవారు. పంచాయితీరాజ్ శాఖలోని వాటర్ ట్యాంకర్ల నుంచి- సచివాలయ భవనాల వరకూ తాకట్టుపెట్టడం ద్వారా, సుమారు 15 లక్షల కోట్ల అప్పులను విజయవంతంగా తీసుకురాగలిగారు.
అప్పులు తీసుకురావడం మాత్రమే కాదు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులలోనూ జగన్-భారతీరెడ్డి-దనంజయరెడ్డి-సత్యనారాయణ ఒక బృందంగా ఏర్పడ్డారన్న విమర్శలుండేవి. సీఎంఓ కార్యదర్శి ధనంజయరెడ్డి తన సెల్‌ఫోన్ నుంచి ఏ కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించాలో ఆదేశిస్తే, సత్యనారాయణ ఆ బిల్లులే చెల్లించేవారు. దానికి సీఎంఓలోనే ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేసుకున్నారు. బిల్లుల చెల్లింపు కోసం కమిషన్ల వ్యవహారాన్ని ఆ ప్రత్యేక వ్యవస్థే చూసుకునేదట. కొన్ని కీలక బిల్లుల కమిషన్ల చెల్లింపులు, హైదరాబాద్‌లో జరిగేవన్న ఆరోపణలున్నాయి.
చివరకు సజ్జల, విజయసాయి సహా మంత్రులు సిఫార్సు చేసినా సత్యనారాయణ బిల్లులు చెల్లించేవారు కాదన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. ప్రభుత్వంలో వివిధ కాంట్రాక్టు పనులు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు, అగ్రనేతలకు సైతం బిల్లులు ఇచ్చేవారు కాదు. ఆరకంగా వారు కూడా సత్యనారాయణ-ధనంజయరెడ్డి బాధితులుగా మిగిలారు.
బిల్లుల కోసం వారంతా ధనంజయరెడ్డి చాంబరు మందు చకోరపక్షుల్లా వేచి ఉండటం.. ఆయన బడ్జెట్ వచ్చిన తర్వాత చూద్దామని చెప్పడం.. తర్వాత కావలసిన వారికి, సంతృప్తి పరిచిన వారికి మాత్రమే బిల్లులివ్వడం జరిగేదన్న ప్రచారం విస్తృతంగా వినిపించేది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల సైతం సత్యనారాయణ-ధనంజయరెడ్డి బాధితుడేనన్నది అప్పట్లో వినిపించిన టాక్. మంగళగిరిలో ఆయన చేసిన కాంట్రాక్టు పనులకు ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించలేదట. జగన్‌కు సన్నిహితులైన సజ్జల,విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, బుగ్గన సహా మంత్రులెవరు చెప్పినా, సత్యనారాయణ కేవలం భారతీరెడ్డి-ధనంజయరెడ్డి నుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే పాటించారన్నది వైసీపీలో బహిరంగంగా వినిపించే మాటనే.
జగన్ సతీమణి భారతీరెడ్డి బిల్లుల చెల్లింపు వివరాలు ధనంజయరెడ్డికి చెప్పడం, ఆయన దానిని సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లి, బిల్లులు క్లియర్ చేయించడం జరిగేదన్న ప్రచారం విస్తృతస్థాయిలో జరిగింది. ఈ మొత్తం ప్రక్రియలో 5 నుంచి 12 శాతం కమిషన్ల వ్యవహారం నడిచేదన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.
ఇదిలాఉండగా.. జగన్ ఐదేళ్ల హయాంలో తెచ్చిన అప్పులు శాఖల వారీగా గుర్తించి, వాటిని విశ్లేషించాలంటే మరో ఐదేళ్లు కూడా సరిపోదని, ఆర్ధిక శాఖ అధికారులు చెబుతున్నారు. వాటిని తవ్వితీయాలంటే ఇప్పట్లో అయ్యే పనికాదంటున్నారు. ప్రస్తుతం ఆర్ధిక శాఖ మొత్తం అదేపనిపై జల్లెడ పడుతోందట.