– రాజ్యాంగం ప్రకారం పోలీసుల పని కేవలం ఎంక్వయిరీ చేయడం మాత్రమే
– తీర్పులు ఇవ్వడానికి మీరేమీ న్యాయమూర్తులా ?
– ప్రతిపక్ష నేతకు గౌరవం ఇవ్వకపోవడమేనా మీ సంస్కారం?
– కోర్టు తీర్పు రాకముందే ‘ఇల్లీగల్’ అని ఎలా డిసైడ్ చేస్తారు?
– సిట్ చీఫ్ సజ్జనార్ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం
హైదరాబాద్: రాజ్యాంగం ప్రకారం పోలీసుల పని కేవలం ఎంక్వయిరీ చేయడం మాత్రమే. తీర్పులు ఇవ్వడానికి మీరేమీ న్యాయమూర్తులా ? ప్రతిపక్ష నేతకు గౌరవం ఇవ్వకపోవడమేనా మీ సంస్కారం? విచారణ ఇంకా నడుస్తుండగానే ఇల్లీగల్ అని ఫిక్స్ అయ్యారంటే.. మీరు ముందే ఒక నిర్ణయానికి వచ్చారా? ప్రతిపక్ష నేతకు గౌరవం ఇవ్వకపోవడమేనా మీ సంస్కారం?
ఖాకీ డ్రెస్ వేసుకొని రాజకీయ అజెండాలు అమలు చేయడం ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమని మీకు తెలియదా? తీర్పులు చెప్పాల్సింది కోర్టులు.. పోలీసులు కాదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోర్టు విచారణ జరిపి తుది తీర్పు ఇవ్వకముందే, సిట్ చీఫ్ సజ్జనార్ అధికారికంగా ‘ఇల్లీగల్’ అని ప్రకటించడం బాధ్యతరాహిత్యం.
మన ప్రజాస్వామ్యంలో కోర్టు నిర్ధారించే వరకు ఏ ఆరోపణను కూడా నేరంగా చూడకూడదనేది కనీస న్యాయ సూత్రం. ఈ న్యాయ సూత్రాన్ని పాటించకపోవడం శోచనీయం. దీనిని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ప్రాథమిక హక్కుల్లో స్పష్టం చేస్తుంది. పోలీసుల పని కేవలం దర్యాప్తు చేయడం మాత్రమే. విచారణ దశలోనే ఒక అంశాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించడానికి మీరేమైనా న్యాయమూర్తులా?
అసలు ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 5(2), ఐటీ చట్టం, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం జరిగిందా లేదా అన్నదానిపై ఆధారపడి ఉంటుందని మీకు తెలియదా? ఇందులో ఏదైనా ఉల్లంఘన జరిగితే అది కోర్టు విచారణ ద్వారానే తేలాలి తప్ప, పోలీసుల అధికారిక ప్రకటనల ద్వారా కాదు.
సజ్జనార్ విడుదల చేసిన అధికారిక ప్రకటన (ట్విట్టర్లో) లో ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనే పదాన్ని వాడటం చూస్తుంటే, దర్యాప్తు ఫలితంపై మీరు ముందే ఒక నిర్ణయానికి వచ్చారని అర్థమవుతోంది. సీనియర్ అధికారుల నుండి ఆశించే నిష్పాక్షికతకు, ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1968 ప్రకారము ఇది తప్పు అని మీకు తెలియదా?
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన అంశంలో.. ఇలాంటి తొందరపాటు ప్రకటనలు చూస్తుంటే, ఇది పక్షపాతంతో కూడిన రాజకీయ ప్రేరేపిత దర్యాప్తు అని స్పష్టం అవుతున్నది. దర్యాప్తు అనేది నిష్పాక్షికంగా ఉండటమే కాదు, ఉన్నట్లు కనిపించాలని కూడా సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. సిట్ చీఫ్ గారు విచారణకు ముందే దోషులు ఎవరో నిర్ణయిస్తే చట్టాలు ఎందుకు, కోర్టులో ఎందుకు?
సిట్ చీఫ్ గారు.. మీరు విడుదల చేసిన అధికారిక ట్విట్టర్ ప్రకటనలో కనీసం కేసీఆర్ ని గౌరవ ప్రతిపక్ష నాయకులు అని సంబోధించడానికి కూడా ఇష్టపడకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఒక మాజీ ముఖ్యమంత్రికి, ప్రస్తుత ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వకపోవడం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు?