– విధుల్లో అలక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు ఉండాలి
– బాగా పనిచేసే వారిని ప్రోత్సహించే విధానాన్ని ప్రవేశపెట్టాలి
-ఉన్నతాధికారులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు
– అసుపత్రుల పనితీరుపై సచివాలయంలో మంత్రి సుదీర్ఘ సమీక్ష
వైద్యులు ప్రతిరోజూ ఎంతమంది రోగులకు వైద్యం అందిస్తున్నారో పరిశీలించి మదింపు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారుల్ని అదేశించారు. రోగులకు సేవలు అందించడంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వైద్యులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది విషయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో వెనుకాడవద్దని స్పష్టంచేశారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సాయంత్రం సుమారు 4 గంటలపాటు ప్రభుత్వాసుపత్రులు, వైద్యుల పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ..
అసుపత్రుల్లో వైద్యులు ఉండడంలేదని తన దృష్టికి నిత్యం వస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ పరిస్థితులు బోధనాసుపత్రులు, జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఉన్నాయన్నారు. ఇలాగైతే రోగులకు మెరుగైన వైద్య సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. వైద్యులు ప్రతిరోజూ విధుల నిర్వహణలో భాగంగా ఎంతమంది రోగులను ఓపీ చూస్తున్నారో గమనించి నివేదికలు అందచేయాలని ఆదేశించారు.
ఉత్తమ వైద్యులు, సిబ్బందిని గుర్తించి ప్రోత్సహించాలి
విధుల నిర్వహణలో స్ఫూర్తిగా నిలిచే వైద్యులు, ఇతర సిబ్బందిని నెలవారీగా గుర్తించి ప్రోత్సహించాలన్నారు. ముఖ ఆధారిత హాజరు(ఎఫ్ఆర్ యస్) విధానం అమలు చేస్తుండగా కొందరు తప్పుడు పద్ధతులు అనుసరించి విధులకు దూరంగా ఉంటున్నారన్నారు. సంజాయిషీ నోటీ సులు జాగీచేస్తున్నా ఇంకా మార్పు కనిపించడంలేదన్నారు. బాగా పనిచేసే వారిని గుర్తిస్తూ, పని చేయని వారిపై చర్యలు తీసుకోవడంలో ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు.
బోధనాసుపత్రులో అడ్మినిస్ట్రేటర్ల పనితీరు సంతృప్తికరంగా లేదు
భోధనాసుపత్రుల్లో పనిచేసే అడ్మినిస్ట్రేటర్ల పనితీరు సంతృప్తికరంగా లేదని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఆసుపత్రుల్లోనే ఉండి రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన వీరి విధుల నిర్వహణ సక్రమంగా లేదన్నారు. వీరి రోజువారి పనితీరును కూడా పరిశీలించాలన్నారు. ప్రస్తుతం వైద్యులుగా పనిచేస్తూ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు చేసిన వాలెంత మంది ఉన్నారని అధికారులను అడిగారు. బోధనాసుపత్రులు సూపరింటెండెంట్లు ఇతర కీలక హోదాల్లో ఉన్న జాబ్ చార్ట్‌ను కూడా పరిశీలించాలన్నారు.
ఐపి కోసం చేరేవారికి ఓపీ కింద వివరాల నమోదు ఎందుకు?
అసుపత్రుల్లో ఐపి కింద చేరే వారు ఓపీ కింద కూడా పేర్లు నమోదు చేసుకోవడం ఎందుకు సమయం వృధా కాదా? అని ప్రశ్నించారు. దీనిపై పరిశీలన జరిపి, సరైన నిర్ణయాన్ని తీసుకోవాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ అభా ఐడీల ద్వారా రోగులకు చికిత్స జరిగేలా చూడాలని పేర్కొన్నారు. దీనివల్ల వైద్య సేవల తీరుపై మరింత స్పష్టత వస్తుందన్నారు. క్యాన్సర్ వ్యాధులకు అందించే చికిత్స వివరాలు సైతం ప్రైవేటు ఆసుపత్రులు నోటిఫైబుల్ రిజిస్ట్రీ ద్వారా వెల్లడించాలన్నారు. అయితే ఇది ఆచరణలో జరగడంలేదన్నారు. ఈ విషయంలోనూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.యస్. గిరీశా, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సీఈఓ దిశేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.