– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ: ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది కూటమి ప్రభుత్వ తీరు. యూరియా సకాలంలో ఇవ్వడం చేతకాక రోగాల పేరుతో రైతులను నిందించడం సిగ్గుచేటు అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా విమర్శించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో యూరియా కొరత తీరేదెన్నడు…రైతుల పంట పండేదెన్నడు? యూరియా అందించలేని కూటమి ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత? యూరియా కొరతపై కూటమి ప్రభుత్వం చెప్తున్నవన్నీ కుంటి సాకులు.
యూరియా ఎక్కువగా వాడుతున్నారని, క్యాన్సర్ కి కారణం అవుతున్నారని, రాష్ట్రంలో టాప్ 5 లో క్యాన్సర్ రోగం ఉందని, ఏడాదికి ఒకే సారి వరి సాగు చేయాలని, యూరియా వాడుకుంటే 800 రూపాయలు ఇస్తామని, అసెంబ్లీ వేదికగా రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడం నిజంగా హాస్యాస్పదమని ఆమె పేర్కొన్నారు.
రైతు సంక్షేమమే అజెండా అని చెప్పుకొనే కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో చేతులెత్తేసింది. ధాన్యాగారానికి అన్నపూర్ణ లాంటి రాష్ట్ర రైతులకు వ్యవసాయం మీద నీతులు నేర్పడం కూటమి ప్రభుత్వ అవివేకానికి నిదర్శనం. యూరియా ఎక్కువ చల్లి రైతులు పండించే బియ్యం తినడానికి పనికిరావనడం రాష్ట్ర రైతాంగాన్ని అవమానించినట్లే.
ఖరీఫ్ సీజన్ లో 14 లక్షల హెక్టార్లలో వరి సాగువుతుంటే ఎంత యూరియా అవసరమో తెలియదా? రైతు సేవా కేంద్రాల వద్ద అన్నదాతల అగచాట్లు కనిపించడం లేదా? రాష్ట్రానికి రావలసిన యూరియా 6.65 లక్షల మెట్రిక్ టన్నుల కోటాలో ఇంకా లక్ష టన్నులు ఇవ్వకుండా కేంద్రం చోద్యం చూస్తుంటే .. మోడీని నిలదీసే దమ్ములేని మీరు రైతులదే తప్పు అన్నట్లు మాట్లాడటం నిజంగా బాధాకరం. ఉచిత సలహాలు పక్కన పెట్టి తక్షణం రాష్ట్ర రైతులకు సరిపడా యూరియా అందించండి. ఆ తర్వాత చేపట్టే సంస్కరణల మీద అవగాహన కల్పించండని ఆమె హితవు పలికారు.