Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి బినామీ కంపెనీ షిరిడీసాయికి, అదానీకి నీటి కేటాయింపులు ఎలా చేస్తారు?

-గిరిజన పల్లెలను, మెట్టప్రాంత ప్రజలను విస్మరించి అస్మదీయులకు నీటి కేటాయింపులు చేయడం అధికార దుర్వినియోగానికి పాల్పడటమే.
– మాజీ విద్యుత్ శాఖామాత్యులు కిమిడి కళావెంకట్రావు

మంగళగిరి: ఓ వైపు డిస్కంలు 20 ఏళ్లకు సరిపడా ప్రక్క రాష్ట్రాలకు సైతం అమ్ముకునేంత మిగులు విద్యుత్ ఉందని చెబుతుంటే రైతులను బలిపెట్టే అదనపు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఏంటి? ఉత్తరాంధ్ర ప్రజలు త్రాగు, సాగు నీరు లేక అల్లాడుతుంటే జగన్ రెడ్డి గిరిజన పల్లెలను, మెట్టప్రాంత ప్రజలను బలిపెడుతూ పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తి సంస్థలైన అదానీ, షిరిడీసాయికి నీటిని కేటాయించడం దేనికి నిదర్శనం? జగన్ రెడ్డి ప్రభుత్వం కమీషన్ల కోసం ఇప్పటికే అవసరం లేకున్నా బహిరంగ మార్కెట్ లో రూ.12 వేల కోట్లకు విద్యుత్ కొనుగోలు చేశారు.

విద్యుత్ ఛార్జీలు, అప్పులు కలిపి రాష్ట్ర ప్రజలపై రూ.57 వేల కోట్ల విద్యుత్ భారాలు మోపారు. అది చాలదన్నట్లు నేడు ఉత్తరాంధ్ర అన్నదాతలపై పగబట్టి వారి ఆయకట్టును బీడుపెట్టే కుట్ర చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లతో రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తూ విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. పంప్డ్ స్టోరేజీ హైడల్ పవర్ కోసం తాండవ, రైవాడ జలాశయాల నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీకి 0.393 టిఎంసీలు, షిరిడీసాయికి 0.533 టిఎంసీల నీటిని కేటాయించడం దుర్మార్గం. దీంతో ఉత్తరాంధ్రలో దాదాపు 70 వేల ఎకరాలు రానున్న రోజుల్లో బీడు భూములుగా మారనున్నాయి.

జగన్ రెడ్డి ఆదేశాలను గ్రుడ్డిగా అమలు చేసేలా జలవనరుల శాఖ జీవో విడుదల చేయడం శోచనీయం. ఇప్పటికే ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను పడుకోబెట్టి అక్కడి రైతాంగం పొట్టగొడుతున్న జగన్ రెడ్డి ఉన్న ఆ కొద్దిపాటి సాగునీటిని కూడా తన అస్మదీయులకు దోచిపెట్టాలని చూస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఉత్తరాంధ్రకు ఒరగబెట్టింది ఏంటి? ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు టిడిపి ప్రభుత్వం ఐదేళ్లలో రూ.1754 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి రూ.488 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు.

ఇప్పటికే ఉత్తరాంధ్ర అన్నదాతలు తగినంత సాగునీరు లేక పంటలు ఎండబెట్టుకుంటున్నారు. ఇప్పడు అదానీ, షిరిడీసాయిలకు నీళ్లు ఇస్తే త్రాగునీటికి కూడా కటకటలాడాల్సి వస్తుంది. పేదలకు వైద్యం అందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్ కు నీరివ్వని జగన్ రెడ్డి అదానీ, షిరిడీసాయిలకు మాత్రం నీరవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

LEAVE A RESPONSE