Suryaa.co.in

Andhra Pradesh

అమరావతిలోనే హెచ్ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్ కార్యాలయాలు

– హెచ్ఆర్సీ, లోకాయుక్త చైర్మన్ సభ్యుల నియామకానికి త్వరలో నోటిఫికేషన్
– హైకోర్టుకు తెలియపరిచిన రాష్ట్ర ప్రభుత్వం
– కర్నూలు కేంద్రంగా ఉన్న హెచ్ఆర్సీని రాజధాని అమరావతికి తరలించాలని అమరావతి
హైకోర్టును ఆశ్రయించిన జేఏసీ నాయకులు
– హెచ్ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్ తరలింపుపై పిటిషన్ వేసిన మద్దిపాటి శైలజ
– కమిషన్ల తరలింపుపై పిటిషన్ వేసిన ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్
– పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది నర్రా శ్రీనివాస్

అమరావతి: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్,లోకాయుక్త కమిషన్ సభ్యుల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థల నియామక, ఇతర అంశాలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించినట్లు నియామకాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

న్యాయ రాజధాని కర్నూలు కేంద్రంగా ఏర్పాటు అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తరలింపు, చైర్మన్ సభ్యుల నియామకానికి సంబంధించి హైకోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరువారాలు గడువు కోరిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థల నియామక మరియు ఇతర అంశాలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించినట్లు నియామకాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

గత వైకాపా ప్రభుత్వం వెలువరించిన నోటిఫికేషన్ చెల్లదని, తాము నూతనంగా నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు దానికి సంబంధించి ఆరువారాల సమయం కేటాయించాలని తదుపరి నిర్ణయం ఆరు వారాల అనంతరం కోర్టుకు తెలియపరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కు విన్నవించింది.

కాగా హెచ్చార్సీ, లోకాయుక్త కార్యాలయాలు అమరావతిలోనే ఏర్పాటుచేయాలంటూ మద్దిపాటి శైలజ పిటిషన్ వేశారు. అదే సమయంలో కమిషన్ కార్యాలయాల తరలింపుపై పిటిషన్ వేసిన ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదించారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వ వివరణతో కీలకమైన మానవ హక్కుల కమిషన్- లోకాయుక్త కార్యాలయాలు కర్నూలు నుంచి అమరావతికే తరలివెళ్లనున్నట్లు స్పష్టమైంది. కాగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు సంస్థలను అమరావతి నుంచి కర్నూలుకు తరలించారు. దానితో బాధితులు అక్కడికి వెళ్లలేకపోతున్నారనే ఫిర్యాదులొచ్చాయి.

చాలామంది బాధితులు ఉత్తరాలు, మెయిల్స్ ద్వారా హెచ్చార్సీకి ఫిర్యాదు చేయడంతో సిబ్బందిపై పనిభారం పడుతోంది. సిబ్బంది సంఖ్యను కూడా పెంచకపోవడంతో, హైదరాబాద్ నుంచి తరలివచ్చిన వారితోనే పనిచేయిస్తున్న పరిస్థితి ఏర్పడింది. తాజాగా ప్రభుత్వ వివరణతో ఇక బాధితులు అమరావతికి వచ్చి ఫిర్యాదు చేసే వెసులుబాటు ఏర్పడింది.

LEAVE A RESPONSE